హాంగ్‌కాంగ్‌ ఎయిర్‌పోర్ట్‌ నిర్భందం

Hong Kong Airport Cancels All Flights For Today As Protesters Swarm - Sakshi

హాంగ్‌కాంగ్‌లో నిరసనలు వెల్లువెత్తాయి. గత రెండు నెలల నుంచి కొనసాగుతున్న ఆందోళన కార్యక్రమాలు, నిరసన ప్రదర్శనలు ఇంకా తీవ్రమవుతున్నాయి. తాజాగా నిరసనకారులు ఎయిర్‌పోర్ట్‌ని స్వాధీనం చేసుకోవడం ఉద్రిక్తతలకు దారితీసింది. నల్ల దుస్తులు ధరించి వేలాది మంది ఎయిర్‌పోర్ట్‌కు వచ్చి నాలుగురోజుల పాటు అక్కడే ఉంటామని భీష్మించారు. దీంతో ఎయిర్‌పోర్ట్‌ అధికారులు విమాన ప్రయాణాలను రద్దుచేసి తాత్కాలికంగా విమానాశ్రయాన్ని మూసివేశారు. ఈ చర్యతో హాంగ్‌కాంగ్‌లోని భారీ విమానయాన సంస్థ కథాయ్‌ ఫసిఫిక్‌ ఎయిర్‌వేస్‌ షేర్లు ఒక్కరోజులోనే 10 సంవత్సరాల కనిష్ట స్థాయికి చేరుకున్నాయి.  కాగా, ఈ ఆందోళనలపై చైనా సీరియస్‌ అయింది. నిరసనకారుల చర్యలు ఉగ్రవాద చేష్టల్లా ఉన్నాయని తీవ్రస్థాయిలో మండిపడింది. భవిష్యత్‌ మంచిగా ఉండాలని కోరుకునేవారు హింసను కోరుకోరని వ్యాఖ్యానించింది.

హాంగ్‌కాంగ్‌ వివాదం
నేరారోపణలు ఎదుర్కొంటున్న నిందితులను పారదర్శకమైన విచారణ నిమిత్తం చైనాకు పంపించాలని ప్రతిపాదిస్తూ హాంగ్‌కాంగ్‌ ప్రభుత్వం ఓ బిల్లును ప్రవేశపెట్టింది. ఈ బిల్లుపై  ఆ దేశంలో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. దీంతో, హాంగ్‌కాంగ్‌ చీఫ్‌ కారీ లామ్‌ ఈ బిల్లు అంశాన్ని తాత్కాలికంగా ఉపసంహరించుకున్నారు. ఈ బిల్లును పూర్తిగా రద్దు చేయాలని, లామ్‌ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలంటూ నిరసనకారులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. చైనా ప్రభుత్వం లామ్‌కు మద్దతుగా నిలిచింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాలను ఉపేక్షించొద్దని సూచించింది. దీంతో, హాంగ్‌కాంగ్‌ పోలీసులు ఎక్కడికక్కడ నిరసనకారులను అరెస్ట్‌ చేశారు. పోలీసులకు, నిరసనకారులకు మధ్య హాంగ్‌కాంగ్‌ వ్యాప్తంగా ఘర్షణ వాతావరణం నెలకొంది. నిరసనకారులపై బాష్పవాయుగోళాలు, రబ్బరు బుల్లెట్లు సాధారణమయ్యాయి. హాంగ్‌కాంగ్‌లో అశాంతియుత వాతావరణం సృష్టించేందుకు పలు విదేశీ శక్తులు ప్రయత్నిస్తున్నాయని, హాంగ్‌కాంగ్‌ను చైనా నుంచి విడదీయడానికే ఈ నిరసనలని చైనా ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. చైనా ఏకపక్ష విధానాలు రుద్దుతోందంటూ మెజార్టీ హాంగ్‌కాంగ్‌ ప్రజలు నిరసిస్తున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top