ప్రేమగా నీళ్లు పోయండి!

Four years old Rare Juniper Bonsai trees Robbery At Tokyo - Sakshi

ఇది నా బిడ్డ..దీని పేరు షిమ్‌పకూ..వయస్సు నాలుగొందల ఏళ్లు..మా పూర్వీకుల కాలం నుంచీ అపురూపంగా పెంచుకుంటున్నాం.. దీన్ని విడిచి ఒక్కరోజు కూడా ఉండలేదు.. అలాంటిదాన్ని మీరు పట్టుకెళ్లిపోయారు.. దొంగతనం చేస్తే చేశారు.. కానీ.. దానికి ప్రేమగా నీళ్లు పోయండి.. జాగ్రత్తగా చూసుకోండి.. ఎందుకంటే.. అది నా ప్రాణం.. 

తమ ఇంట్లోంచి అరుదైన జానిపర్స్‌ బోన్సాయ్‌ చెట్లను ఎత్తుకెళ్లిన దొంగలను ప్రాధేయపడుతూ జపాన్‌లోని టోక్యోకు చెందిన మహిళ ఫుయుమీ ఈమూరా ఫేస్‌బుక్‌లో ఈ మేరకు పోస్టు పెట్టింది.. ఆమె దిగులుకు ఓ అర్థం కూడా ఉంది. ఎందుకంటే.. దొంగలు ఎత్తుకెళ్లిన ఏడు బోన్సాయ్‌ చెట్ల ధర రూ.83 లక్షలు పైమాటే.. అందులో ఈ షిమ్‌పకూ ధరే రూ.40 లక్షలకు పైగా ఉంటుందట. ఈమూరా భర్త సీజీ ఈమూరా కుటుంబం బోన్సాయ్‌ మొక్కల పెంపకంలో ఐదవతరానికి చెందినవారు. ఐదవ బోన్సాయ్‌ మాస్టర్‌ అన్నమాట. ఈ మొక్కని కూడా 400 ఏళ్ళ క్రితం పర్వతప్రాంతం నుంచి తీసుకొచ్చారు. క్రమంగా ఆ మొక్కని బోన్సాయ్‌గా మార్చడానికి ఈ కుటుంబం వందల ఏళ్ళు కష్టపడింది. ఇప్పుడిది మూడడుగుల ఎత్తు, రెండడుగుల వెడల్పు ఉంది.

త్వరలో జరగబోయే బోన్సాయ్‌ ఫెయిర్‌ కోసం వీటిని సిద్ధం చేసి.. ఫొటోలు గట్రా తీయించారు కూడా.. ఇంతలో ఇలా జరిగిపోయింది.. పిల్లల్లా పెంచుకుంటున్న బోన్సాయ్‌లను దొంగిలించడంతో అల్లాడిపోయిన ఆ కుటుంబం చివరికి ఫేస్‌బుక్‌లో పెట్టిన ఈ పోస్ట్‌ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ దొంగలంటే తనకెంతో కోపంగా ఉందని.. అయితే.. వాటిని జాగ్రత్తగా చూసుకోవాలని.. సరిగా చూసుకోకపోతే.. అవి చనిపోతాయని.. ఇది తనకెంతో బాధను కలిగిస్తుందని ఈమూరా అంటున్నారు.

ఈమూరా కుటుంబం తమ తోటలోని బోన్సాయ్‌లను చూసేందుకు అందరినీ అనుమతించేవారని.. సీసీటీవీలు వంటి భద్రత ఏర్పాట్లు కూడా లేవని.. దీంతో దొంగల పని సులువైందని పోలీసులు అంటున్నారు. ఈ దొంగతనం ఒక్కరోజులో జరిగిందని తాము భావించడం లేదని.. రోజుకొకటి చొప్పున తీసుకెళ్లి ఉండొచ్చని చెబుతున్నారు. దొంగతనం నేపథ్యంలో ఈమూరా ఇప్పుడు తమ బొన్సాయ్‌ గార్డెన్‌లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం!! 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top