‘జాతీయ’ ముసుగులో నకిలీ వార్తలు

Fake News Spreading In India Due To Rising Tide Of Nationalism - Sakshi

నిజానిజాలను పట్టించుకోని భారతీయులు

బీబీసీ అధ్యయనంలో వెల్లడి

లండన్‌/ న్యూఢిల్లీ: భారత్‌లో నకిలీ వార్తలు, వదంతుల వ్యాప్తిపై ప్రముఖ వార్తాసంస్థ బీబీసీ సంచలన విషయాన్ని బయటపెట్టింది. దేశ నిర్మాణం, జాతీయవాద సందేశాలతో ఉన్న నకిలీ వార్తలను భారతీయులు సోషల్‌మీడియాలో పంచుకుంటున్నారని బీబీసీ తెలిపింది. ఈ సందర్భంగా వీటిలోని నిజానిజాలను పరిశీలించడం లేదని వెల్లడించింది. హింసను రెచ్చగొట్టే సందేశాలను సోషల్‌మీడియాలో పంచుకునేందుకు భారతీయులు ఇష్టపడటం లేదనీ, అదే సమయంలో జాతీయవాద సందేశాలున్న వార్తలను షేర్‌ చేయడాన్ని తమ బాధ్యతగా భావిస్తున్నారని చెప్పింది. సోషల్‌మీడియాలో నకిలీ వార్తలు వ్యాప్తిచేస్తున్న గ్రూపులకు, ప్రధాని మోదీ మద్దతుదారులకు మధ్య సంబంధముందని పేర్కొంది. భారత్, కెన్యా, నైజీరియాలో నకిలీ వార్తలపై అధ్యయనం చేసిన బీబీసీ సోమవారం తన నివేదికను విడుదల చేసింది.

భావోద్వేగాల ఆధారంగా ఈ నకిలీ వార్తలు, వదంతులను వ్యాప్తి చేస్తున్నారని బీబీసీ తెలిపింది. ఈ విషయమై బీబీసీ వరల్డ్‌ సర్వీస్‌ గ్రూప్‌ డైరెక్టర్‌ జేమీ అంగస్‌ మాట్లాడుతూ.. ‘నకిలీ వార్తలపై పశ్చిమదేశాల్లోని మీడియాలో విస్తృతమైన చర్చ నడుస్తుండగా, మిగిలిన ప్రాంతాల్లో సామాజిక మాధ్యమాల్లో మాత్రం జాతి నిర్మాణం అనే అంశం వాస్తవాలను మరుగున పడేస్తోంది. భారత్‌లో నకిలీ వార్తలు వ్యాప్తి చేయడంలో ట్విట్టర్‌లోని హిందుత్వ గ్రూపులు, వామపక్ష భావజాలమున్న వారికంటే ఎక్కువ సమన్వయంతో పనిచేస్తున్నాయి’ అని వెల్లడించారు. ‘బీబీసీ బియాండ్‌ ఫేక్‌ న్యూస్‌ ప్రాజెక్టు’ కింద  అధ్యయనం చేపట్టామన్నారు.

నకిలీల్ని పూర్తిగా అరికట్టలేం: ట్విట్టర్‌
నకిలీ వార్తల వ్యాప్తి అన్నది చాలా అంశాలతో కూడుకున్న విషయమనీ, దాన్ని పరిమిత చర్యలతో అడ్డుకోలేమని ట్విట్టర్‌ సీఈవో జాక్‌ డోర్సీ తెలిపారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న భారత్‌కు చేరుకున్న డోర్సీ.. ఢిల్లీ–ఐఐటీలో సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లా డారు. నకిలీ వార్తలు, వదంతుల తొలగింపులో ట్విట్టర్‌ నిర్లక్ష్యంగా, నిదానంగా వ్యవహారిస్తోం దని కేంద్ర హోంశాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది.
 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top