బ్రెగ్జిట్‌ గడువు జనవరి 31

EU agrees Brexit extension to 31 January - Sakshi

పొడిగింపునకు ఈయూ ఆమోదం

లండన్‌/బ్రసెల్స్‌: బ్రిటన్‌ పార్లమెంట్‌లో బ్రెగ్జిట్‌ ఒప్పందం ఆమోదం పొందడంలో తలెత్తిన అనిశ్చితి నేపథ్యంలో మరో కీలక పరిణామం సంభవించింది. బ్రిటన్‌కు మరింత వెసులుబాటు ఇచ్చేందుకు యూరోపియన్‌ యూనియన్‌(ఈయూ) అంగీకరించింది. బ్రెగ్జిట్‌పై ఈనెలాఖరు వరకు ఉన్న గడువును మరో మూడు నెలలపాటు అంటే వచ్చే ఏడాది జనవరి 31వ తేదీ వరకు పొడిగించేందుకు ఈయూ సుముఖత వ్యక్తం చేసింది. ఈ నిర్ణయంపై యూనియన్‌లోని 27 సభ్య దేశాలు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపాయని ఈయూ అధ్యక్షుడు డొనాల్డ్‌ టస్క్‌ తాజాగా ట్విట్టర్‌లో ప్రకటించారు.

ఇందుకు సంబంధించిన విధివిధానాలను త్వరలోనే రాత పూర్వకంగా వెల్లడిస్తామన్నారు. బ్రెగ్జిట్‌ ఒప్పందాన్ని బ్రిటన్‌ పార్లమెంట్‌ ఆమోదించిన పక్షంలో సాధ్యమైనంత త్వరగా..తాజాగా ప్రకటించిన గడువులోగానే ఈయూతో తెగదెంపులు చేసుకునే అవకాశం బ్రిటన్‌కు ఉందన్నారు. బ్రెగ్జిట్‌ గడువు పొడిగింపుపై ఈయూ పార్లమెంట్‌ చర్చించి, ఆమోదం తెలపాలంటే సత్వరమే దీనిపై బ్రిటన్‌ లాంఛనప్రాయంగా ఆమోదముద్ర వేయాల్సి ఉందని తెలిపారు.

బ్రెగ్జిట్‌ పొడిగింపుపై ఈయూ ఇప్పటికే సానుకూలత వ్యక్తం చేసింది. ప్రస్తుతం జరుగుతున్న ఈయూ పార్లమెంట్‌ సమావేశాల్లో దీనిపై చర్చించి, రెండు రోజుల్లో సానుకూల నిర్ణయం వెలువరించనుంది. దీని ప్రకారం.. జాన్సన్‌ ప్రభుత్వం తమతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని పార్లమెంట్‌ నవంబర్‌ 30, డిసెంబర్‌ 31, జనవరి 31వ తేదీల్లో ఎప్పుడు ఆమోదించినా.. ఆ వెంటనే బ్రెగ్జిట్‌ అమల్లోకి వస్తుందని స్పష్టం చేయనుంది.  డిసెంబర్‌ 12వ తేదీన సాధారణ ఎన్నికలు జరపాలంటూ ప్రవేశపెట్టనున్న తీర్మానంపై వచ్చే సోమవారం పార్లమెంట్‌లో ఓటింగ్‌ జరగనుంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top