
చైనీస్ వైరస్ వ్యాఖ్యలను సమర్ధించుకున్న డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్ : ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌పై అమెరికా, చైనాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. చైనీస్ వైరస్ ప్రపంచంలో వేగంగా విస్తరిస్తోందన్న అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్‌పై చైనా నుంచి నిరసనలు వెల్లువెత్తిన క్రమంలో ట్రంప్ తన వ్యాఖ్యలను సమర్ధించుకున్నారు. ఇది చైనా నుంచి రావడంతో ఆ పదమే సరైనదని తాను భావించానని ట్రంప్ చెప్పుకొచ్చారు. కొవిడ్-19 వ్యాప్తికి అమెరికా సైన్యమే కారణమని చైనా దుష్ర్పచారం సాగిస్తోందని ట్రంప్ మండిపడ్డారు.
తమ సేనలే చైనీయులకు ఈ వైరస్‌ను వ్యాప్తి చేశారని చైనా చెప్పడం సరైంది కాదని, తమ సైన్యం దీన్ని ఎవరికీ ఇవ్వలేదని ఆయన చెప్పారు. మరోవైపు అగ్రరాజ్యం అమెరికా సైతం కరోనాతో కకావికలమైంది. అక్కడ మూడు వేల మందికి పైగా జనం వైరస్ బారినపడగా.. 62 మంది మరణించారు. ఇక కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తూ రోజురోజుకూ విస్తరిస్తోంది.ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా 1,83,579 పాజిటివ్ కేసులు నమోదవగా 7,400 మందికి పైగా మరణించారు.