ఆ కవలలకు పునర్జన్మ | conjoint twins succefully seperated in texas | Sakshi
Sakshi News home page

ఆ కవలలకు పునర్జన్మ

Feb 24 2015 5:28 PM | Updated on Sep 2 2017 9:51 PM

ఆ కవలలకు పునర్జన్మ

ఆ కవలలకు పునర్జన్మ

ప్రపంచంలో ఇద్దరు కవలలు ఒకే శరీరంతో కలిసి పుట్టడం, వైద్యులు వారిని శస్త్ర చికిత్స ద్వారా విజయవంతంగా వేరుచేయడం బహు అరుదు.

ప్రపంచంలో ఇద్దరు కవలలు ఒకే శరీరంతో కలిసి పుట్టడం, వైద్యులు వారిని శస్త్ర చికిత్స ద్వారా విజయవంతంగా వేరుచేయడం బహు అరుదు. మన రాష్ట్రంలో వీణ- వాణి చాలా కాలంగా ఇలాగే ఉంటున్నారు. ఒకే శరీరమే కాకుండా పలు కీలక అవయవాలు ఒకటిగానే కలిసి పుట్టిన కవలలను శస్త్ర చికిత్స ద్వారా విజయవంతంగా వేరు చేసి వారికి ప్రాణ ప్రతిష్ఠ చేసిన వైద్య చరిత్ర నిన్నటి వరకు లేదు. అలాంటి కొత్త చరిత్రను టెక్సాస్ చిల్డ్రన్స్ హాస్పిటల్ వైద్యులు లిఖించారు. ప్రపంచంలోనే తొలిసారిగా ఇలాంటి ఆపరేషన్ నిర్వహించి శభాష్ అనిపించుకున్నారు.
 
టెక్సాస్‌కు చెందిన ఎలిస్సీ, జాన్ ఎరిక్ దంపతులకు గత ఏప్రిల్ నెలలో ఒకే శరీరంతో కవలలు అతుక్కొని పుట్టారు. వారికి నతల్యే హోప్, అడెలైన్ ఫెయిత్ అనే పేర్లు పెట్టారు. ఛాతీ వద్ద, కటి వలయం వద్ద కలిసిపుట్టిన ఆ కవలలకు ఊపిరితిత్తులు, కాలేయం, చిన్న ప్రేగు ఒకటే ఉంది. అంతేకాకుండా చెస్ట్ వాల్ కలిసే ఉంది. వారిని శస్త్ర చికిత్స ద్వారా వేరు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. వారిని పరీక్షించిన టెక్సాస్ పిల్లల ఆస్పత్రి సర్జన్ డాక్టర్ డారెల్ క్యాస్ ముందుకొచ్చారు.

ఈ సర్జరీని ఓ సవాల్‌గా స్వీకరించిన ఆయన గత డిసెంబర్ నెల నుంచే అందుకు తగిన ఏర్పాట్లు చేసుకున్నారు. సర్జరీకి వీలుగా చెస్ట్ వాల్‌లోని జన్యుకణాలను ముందుగా వ్యాకోపింపజేశారు. అత్యాధునిక త్రీ డీ టెక్నాలజీని ఉపయోగించి కృత్రిమ కాలేయం, ఊపిరి తిత్తులను ల్యాబ్‌లో సృష్టించారు. ఈనెల మొదటివారంలో 25 మంది వైద్యసిబ్బందితో కలిసి విజయవంతంగా సర్జరీ పూర్తిచేశారు. ఇప్పుడు ఆ ఇద్దరు కవలలు ఆరోగ్యంగా ఉన్నారు. సర్జరీకి 23 గంటల సమయం పట్టిందని, మొత్తం 26 మంది వైద్య సిబ్బంది సర్జరీలో పాల్గొన్నారని, వారిలో 12 మంది సర్జన్లు, ఆరుగురు ఎనస్థీషియా నిపుణులు, 8 మంది నర్సులు ఉన్నారని, సర్జరీకి నేతృత్వం వహించిన డాక్టర్ డారెల్ క్యాస్ వివరించారు. తమ పిల్లలకు పునర్జన్మనిచ్చిన వైద్యులకు కవలల తల్లిదండ్రులు పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

పోల్

Advertisement