'అతడి తల నరికితేనే మాకు శాంతి'

China Terracota Warrior Thumb Theft Triggers Outrage - Sakshi

బీజింగ్‌ : ఓ చైనా వీరుడి విగ్రహ బొటన వేలు పోవడానికి కారణమైన అమెరికన్‌ యువకుడి తల నరికితేనే తాము శాంతిస్తామని చైనా ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. అలాగే, చైనా అధికారులు కూడా ఆ వ్యక్తికి కఠినమైన దండన విధించాల్సిందేనని అమెరికాను డిమాండ్‌ చేస్తున్నారు. రెండువేల ఏళ్ల కిందటి దాదాపు 4.5మిలియన్‌ డాలర్ల విలువైన చైనా యుద్ద వీరులు టెర్రకోటా వారియర్స్‌ పది విగ్రహాలను అమెరికాలోని ఫ్రాంక్లిన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఇన్‌ ఫిలడెల్పియాలో ప్రదర్శనకు ఉంచారు. అయితే, రోహనా (24) అనే అమెరికన్‌ యువకుడు ఆ ఇన్‌స్టిట్యూట్‌లో జరిగిన అగ్లీ స్వీటర్‌ పార్టీకి గత ఏడాది 2017, డిసెంబర్‌ 21న హాజరయ్యాడు. అయితే, అతడు ప్రదర్శనశాలను చూసే క్రమంలో సరిగ్గా టెర్రకోట వారియర్స్‌ విగ్రహాల వద్దకు వెళ్లేసరికి సమయం ముగిసింది.

దాంతో అతడు తన ఫోన్‌లోని ఫ్లాష్‌ లైట్‌ ఉపయోగించి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించాడు. అప్పుడు ఆ విగ్రహంలో ఏదో భాగం విరిగిపోయినట్లు అనిపించింది. ఆ విరిగిన భాగాన్ని తీసుకొని జేబులో వేసుకొని వెళ్లిపోయాడు. అయితే, మ్యూజియం స్టాఫ్‌ తర్వాత ఆ విషయాన్ని గుర్తించి ఎఫ్‌బీఐ అధికారులకు చెప్పగా వారు రోహనాను అరెస్టు చేశారు. దాంతో అతడు ఆ బొటన వేలి భాగాన్ని తన సొరుగులో దాచిపెట్టినట్లు చెప్పాడు. కొద్ది రోజులుగా పోలీసు కస్టడీలో ఉన్న అతడు బెయిల్‌పై విడుదలయ్యాడు. అయితే, ఎంతో విలువైన పురాతన విగ్రహాల విషయంలో మ్యూజియం అధికారులకు కనీసం జాగ్రత్త లేకుండా పోయిందని, ఈ ఘటనకు కారణమైన ఆ వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్‌ చేస్తున్నారు. మరోపక్క, చైనా ప్రజలు మాత్రం అతడి తలను కూడా తొలగించాల్సిందేనంటూ మండిపడుతున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top