పాక్‌లో బయటపడిన బుద్ధుడి విగ్రహం.. కానీ | Sakshi
Sakshi News home page

పాక్‌లో బయటపడిన బుద్ధుడి విగ్రహం.. కానీ

Published Sat, Jul 18 2020 9:26 PM

Buddha statue discovered in Pakistan demolished workers - Sakshi

ఇస్లామాబాద్‌ : బౌద్ధ మత స్థాపకుడు గౌతమ బుద్ధుడికి సంబంధించి పురాతనమైన విగ్రహం ఒకటి శనివారం పాకిస్తాన్‌లో బయటపడింది. ఖైబర్‌ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని మర్ధాన్‌ జిల్లాలో ఓ ఇంటి పునాదుల కోసం తవ్వకాలు జరుపుతుండగా కూలీలకు ప్రాచీన గౌతమ బుద్ధుడి విగ్రహం కనిపించింది. దీంతో స్థానికులు ముల్లా(మతపెద్ద)ని సంప్రదించారు. అయితే ఇస్లామిక్‌ బోధనలకు అనుగుణంగా లేదని సదరు విగ్రహాన్ని ధ్వంసం చేయాలని ముల్లా నిర్ణయించారు. అనంతరం విగ్రహాన్ని తొక్కుతూ, సుత్తితో ధ్వంసం చేశారు. ఈ ఘటనకు సంబంధించి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. విగ్రహం బయటపడిన ప్రాంతం ఒకప్పటి గాంధార నాగరికతకు సంబంధించినదిగా చరిత్రకారులు చెబుతున్నారు.

గౌతమబుద్దుడి విగ్రహాన్ని మతపరమైనదిగా చూడకుండా, కనీసం పురాతన విగ్రహంగా భావించి గౌరవిస్తే బాగుండని సామాజికమాధ్యమాల్లో నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. పాకిస్తాన్‌లో మతపరమైన విషయాల్లో అసహనం శృతిమించుతుందనడానికి ఇదో ఉదాహరణ అని కామెంట్లు పెడుతున్నారు. ఈ ఘటన పాకిస్తాన్ టూరిజం శాఖ దృష్టికి వచ్చిందని అక్కడి స్థానిక మీడియా పేర్కొంది. ఘటన జరిగిన ప్రాంతాన్ని తాము గుర్తించామని, నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని ఖైబర్‌- పఖ్తుంఖ్వా ఆర్కియాలజీ అండ్ మ్యూజియం డైరెక్టర్ అబ్దుల్‌ సమద్ చెప్పారు.

ధార్మిక వికాసంతో కూడిన వ్యక్తిత్వమే నిజమైన వ్యక్తిత్వమని ఆచరించి, నిరూపించిన వాడు బుద్ధుడు. ప్రపంచంలోమొట్టమొదటగా మానవతా వాదాన్ని ప్రవేశపెట్టింది బౌద్ధమే! ప్రకృతిసిద్ధమైన సూత్రాలు మనిషిని నియంత్రింప చేస్తాయనీ, వాటిని అర్థం చేసుకుని, అవగతం చేసుకుని సాలోచనగా నడుచు కోవటం వలన సమాజ శ్రేయస్సు కలుగుతుందనీ బౌద్ధం చెబుతుంది.
 

Advertisement
Advertisement