బాలీవుడ్ గాలాకు ప్రిన్స్ విలియం దంపతులు
బ్రిటిష్ రాయల్ జంట త్వరలో భారత్ లో పర్యటించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
	లండన్: బ్రిటిష్ రాయల్ జంట త్వరలో భారత్ లో పర్యటించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.  ముంబై లో నిర్వహించనున్న బాలీవుడ్ గాలా తిలకించేందుకు ప్రత్యేక అతిథులుగా వారు హాజరుకానున్నారు. సినీస్టార్ల ఉత్సవానికి హాజరైన సందర్భంలో వారం రోజులపాటు ఇండియాలో గడపనున్నారు.  
	
	హిందీ చిత్ర పరిశ్రమలోని స్టార్ నటులతో  ఓ చల్లని సాయంత్రాన్ని ప్రిన్స్ విలియం, ఆయన భార్య కేట్ మిడిల్టన్  ఆస్వాదించనున్నారు. వీధిబాలల సహాయార్థం నిధులను సమకూర్చే ఉద్దేశ్యంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ముంబైలోని ఓ హోటల్ లో ఏప్రిల్ 10న నిర్వహించనున్నారు.  ఆర్థిక రాజధాని ముంబైలో 2008లో ఉగ్రవాదులు దాడి చేసిన  హోటలే.. ప్రస్తుతం  రాజదంపతులకు ఆవాసం కల్పించనుంది.
	
	బాలీవుడ్ కార్యక్రమానికి హాజరయ్యే రాయల్ కపుల్.. వారం రోజుల భారత్ , భూటాన్ సందర్శనలో భాగంగా ముంబై మురికి వాడల్లోని పిల్లలను పలుకరించనున్నారు. అనంతరం ప్రపంచ వింతల్లో ఒకటైన ఆగ్రాలోని అద్భుత కట్టడం తాజ్ మహల్ ను సందర్శిస్తారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
