అమెరికాలో కుప్పకూలిన వంతెన

Bodies, cars still pinned by deadly Miami bridge collapse - Sakshi

ఆరుగురు మృతి

మయామిలో దుర్ఘటన

మయామి: అమెరికాలోని మయామిలో వారం క్రితమే నిర్మాణం పూర్తయిన పాదచారుల వంతెన కూలిన దుర్ఘటనలో ఆరుగురు మృతిచెందారు. ఫ్లోరిడా ఇంటర్నేషనల్‌ యూనివర్సిటీని విద్యార్థుల వసతి గృహంతో కలుపుతున్న ఈ బ్రిడ్జి గురువారం రద్దీగా ఉన్న రహదారిపై అమాంతం కుప్పకూలింది. దీని కింద పలు కార్లు, వాహనాలు నలిగిపోయాయి. ఇప్పటి వరకు ఆరుగురి మృతదేహాలు లభించాయని, రక్షణ చర్యలు కొనసాగుతున్నాయని స్థానిక అధికారులు వెల్లడించారు. మరో పది మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు. బ్రిడ్జి రెండు చివరలకు మద్దతుగా ఉన్న నిర్మాణాలు కూడా ఏ క్షణమైనా కింద పడిపోవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. బ్రిడ్జి ఉన్నపళంగా నేలకొరుగుతున్న వీడియోను సీఎన్‌ఎన్‌ విడుదల చేసింది.

సుమారు 950 టన్నుల బరువున్న బ్రిడ్జి కింద కనీసం 8 కార్లు, రెండు ట్రక్కులు చిక్కుకున్నట్లు తెలిసింది. వంతెన కూలిపోయినప్పుడు పెద్ద శబ్దం వచ్చిందని, తొలుత బాంబు పేలిందని అనుకున్నామని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. బ్రిడ్జిని మోస్తున్న కేబుల్స్‌ వదులయ్యాయని, వాటిని బిగుతు చేస్తుండగా అది కూలిపోయిందని ఫ్లోరిడా సెనేటర్‌ మార్కో రూబియో ట్వీట్‌ చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే అటుగా వెళ్తున్న వారు వెంటనే స్పందించి శిథిలాల్లో చిక్కుకున్న బాధితులను బయటికి తీసుకొచ్చేందుకు సాయం చేసినట్లు తెలిపారు. గత శనివారమే పూర్తిస్థాయిలో సిద్ధమైన ఈ బ్రిడ్జిని 2019లో పాదచారులకు అందుబాటులోకి తేవాల్సి ఉంది. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విచారం వ్యక్తం చేశారు.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top