దుబాయ్‌ యువరాణి ఏమైంది ?

Amnesty Criticizing India Over Dubai Princess Missing Issue - Sakshi

భారత్‌ను వేలెత్తి చూపిస్తున్న ఆమ్నెస్టీ

మానవహక్కుల్ని హరించిందని ఆరోపణ

పేరుకే రాజు కుమార్తె. కానీ అడుగడుగునా ఆంక్షలు, బయట ప్రపంచం ఏమిటో తెలీదు. స్వేచ్ఛ అన్న మాటకి అర్థం తెలీదు. అండగా ఉండాల్సిన  కన్నతండ్రే వేధిస్తూ ఉంటే, తనకున్న అధికార దర్పంతో గాలి వెలుతురు లేని చీకటి గదిలో మూడేళ్ల పాటు బం«ధించి చిత్రహింసలు పెడితే ఏం చేయాలి ? ఎవరికి చెప్పుకోవాలి ? ఆ ఆంక్షల చట్రాలను ఛేదించుకొని స్వేచ్ఛగా ఎగిరిపోవాలని, అమెరికాలో ఆశ్రయం పొందాలని అనుకున్న ఆ యువరాణి ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఆమె ఇప్పుడేమైందో, ఎక్కడుందో ఎవరికీ తెలీడం లేదు. ఇది దుబాయ్‌ రాజు షేక్‌ మహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మకతూమ్‌ కుమార్తె షికా లతీఫా దీనగాథ. షికా లతీఫా కనిపించకుండా పోవడం వెనుక భారత్‌ ప్రమేయం ఉందని ఇప్పుడు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. భారత్‌ తీరప్రాంత రక్షణ దళం మానవ హక్కుల్ని తీవ్రంగా ఉల్లంఘించి ఆశ్రయం కోరి వచ్చిన లతీఫాను తిరిగి దుబాయ్‌కి పంపించారంటూ అంతర్జాతీయ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఆరోపించింది. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలంటూ భారత ప్రభుత్వాన్ని కోరింది.

భారత్‌ ప్రమేయం ఎంత ? 
ఆమ్నెస్టీ హక్కుల సంస్థ చెబుతున్న వివరాల ప్రకారం తండ్రి నుంచి గత కొన్నేళ్లుగా తీవ్ర వేధింపులు ఎదుర్కొంటున్న షికా లతీఫా ఎలాగైనా దేశం విడిచి పారిపోవాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. అమెరికాలో కొత్త జీవితం ప్రారంభించాలని భావించారు.. ఫిన్‌ల్యాండ్‌కు చెందిన తన ప్రాణస్నేహితురాలు తినా జౌహానియన్, ఫ్రాన్స్‌కు చెందిన కెప్టెన్‌ హెర్వ్‌ జాబెర్ట్‌ , మరోముగ్గురు సిబ్బందితో కలిసి ఒక మరపడవలో గత ఫిబ్రవరిలో దుబాయ్‌ అధికారుల కళ్లుగప్పి పారిపోయారు. వారు ప్రయాణిస్తున్న  పడవ మార్చి 14న భారత్‌లోని గోవా జలాల్లో ప్రవేశించింది. అప్పడు గోవాలోని భారత్‌ తీర ప్రాంత రక్షక దళం బలవంతంగా ఆ పడవలోకి ఎక్కి తుపాకులు చూపించి అందరినీ బెదిరించారు. కెప్టెన్‌ జౌబెర్ట్‌ని రక్తం కారేలా కొట్టడంతో అతను స్పృహ తప్పిపోయాడు. ఇతర సిబ్బందిని కూడా బాగా కొట్టారు. పడవని ధ్వంసం చేశారు. యువరాణి షికా లతీఫా తాను ఆశ్రయం కోరి వచ్చానని అరుస్తున్నా వినిపించుకోకుండా ఆమెని బంధించి, అప్పుడే  హెలికాప్టర్‌లో వచ్చిన యూఏఈ అధికారులకు వాళ్లందరినీ అప్పగించారట. మార్చి 20న జౌబెర్ట్, మిగిలినవారిని దుబాయ్‌ అధికారులు విడిచిపెట్టారు. ఆ తర్వాత రెండు రోజులకే యువరాణి స్నేహితురాల్ని కూడా విడిచిపెట్టడంతో ఆమె ఫిన్‌లాండ్‌కు వెళ్లిపోయింది. భారత్‌ తీర ప్రాంత రక్షణ దళం దయా దాక్షిణ్యాలు లేకుండా తాము ప్రతిఘటించకపోయినా తీవ్రంగా కొట్టి దుబాయ్‌ అధికారులకు అప్పగించారని వాళ్లంతా ఆరోపించారు. దుబాయ్‌లో ఎలాంటి న్యాయవిచారణ లేకుండానే గుర్తు తెలియని ప్రదేశంలో ఒక జైలులో తమను బంధించి ఉంచారని వారు వెల్లడించారు. అప్పట్నుంచి యువరాణి షికా లతీఫా ఆచూకీ కనిపించడం లేదు. ఆమె క్షేమ సమాచారాలపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఆమ్నెస్టీ ఈ మొత్తం వ్యవహారంలో భారత్‌ తీర ప్రాంత రక్షక దళం వ్యవహార శైలిని తప్పు పడుతోంది. ఆశ్రయంకోరి వచ్చిన వారిని ఏకపక్షంగా బంధించి, శారీరకంగా హింసించడం ఏమిటని ప్రశ్నిస్తోంది. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని కేంద్రప్రభుత్వాన్ని కోరింది. మరోవైపు షికా లతీఫా ఎక్కడుందో బయట పెట్టి, ఆమె స్వేచ్ఛగా జీవించేలా చర్యలు తీసుకోవాలంటూ యూఏఈని డిమాండ్‌ చేసింది.

లతీఫా వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌
షికా లతీఫా దేశం విడిచి పారిపోవడానికి ముందు ఇదంతా ఊహించిందో ఏమో ఒక వీడియోని రికార్డు చేసి పెట్టారు. తన తండ్రి వేధింపులు భరించలేక పారిపోతున్నానని ఆమె ఆ వీడియోలో చెప్పారు. ‘నాకు స్వేచ్ఛ లేదు. సంకెళ్ల మధ్య జీవితాన్ని గడుపుతున్నాను. నేను ఎక్కడికి వెళ్లినా నా వెంట ఒకరు ఉంటారు. నా కదలికల్ని అనుక్షణం గమనిస్తూ ఉంటారు. 2002లో కూడా ఒకసారి పారిపోవడానికి ప్రయత్నించా. సరిహద్దుల్లోనే నన్ను పట్టుకున్నారు. మూడేళ్ల పాటు నన్ను గాలి వెలుతురు కూడా రాని జైలులో పడేశారు. నా తండ్రికి కీర్తి ప్రతిష్టలంటే ఎనలేని మోజు. దాని కోసం దేనికైనా తెగిస్తాడు. మీరు ఈ వీడియో చూసే సమయానికి అయితే నేను చనిపోయి ఉంటాను. లేదంటే చాలా దుర్భరమైన పరిస్థితుల్లో ఉంటాను. బహుశా ఇదే నా ఆఖరి వీడియో‘ అంటూ ఒక వీడియో రికార్డు చేశారు. ఆరు నెలల క్రితం లతీఫా కిడ్నాప్‌ అయిందన్న వార్తల నేపథ్యంలో ఈ వీడియోని బ్రిటన్‌లో ఒక మీడియా సంస్థ బయటపెట్టింది. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేసింది. ఆరుగురు భార్యలున్న దుబాయ్‌ రాజుకి 30 మంది సంతానంలో లతీఫా ఒకరు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top