
పువ్వులు, క్యాండిల్స్ కాపాడతాయట!
పారిస్ తండ్రీకొడుకుల సంభాషణకు సంబంధించిన వీడియోను జెరెం ఇసాక్ రూసో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
పారిస్ : ఫ్రాన్స్ రాజధాని నగరం పారిస్ లో ఐఎస్ ఎస్ సృష్టించిన దారుణ మారణహోమానికి ప్రపంచదేశాలు సైతం వణికిపోతున్న సంగతి తెలిసిందే. వాళ్లు ఎందుకు అంతమందిని చంపేశారంటూ పారిస్‌లో ఓ బాలుడు అమాయకంగా అడగడం, వాళ్ల నాన్న ఆ పిల్లవాడిని సముదాయించిన వైనం అందరినీ ఆకర్షిస్తోంది. ఈ తండ్రీ కొడుకుల సంభాషణకు సంబంధించిన వీడియోను జెరెం ఇసాక్ రూసో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఫ్రెంచ్ టీవీలో ప్రసారమైన ఈ వీడియోను ఇంగ్లీష్ టైటిల్స్ చేర్చి చాలా అద్భుతమైన, విలువైన సంభాషణ అంటూ ఫేస్ బుక్ లో షేర్ చేశాడు.
పువ్వులు, కాండిల్స్ మనల్ని రక్షిస్తాయా అంటూ.. బెదురు కళ్లతో అడుగుతూ చివరికి కన్విన్స్ అయ్యి చిరునవ్వులు చిందిస్తున్న ఈవీడియో నెట్‌లో హల్ చల్ చేస్తోంది. బటాక్లాన్ థియేటర్ కాల్పుల సంఘటనలో ప్రాణాలు కోల్పోయినవారికి నివాళులర్పిస్తున్న సందర్భంగా స్థానిక టీవీ చానల్ ప్రతినిధి ఇంటర్వ్యూలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
వారి సంభాషణ క్లుప్తంగా ఇలా సాగుతుంది...
'వాళ్లు చాలా చెడ్డవాళ్లు. వాళ్ల దగ్గర తుపాకులు ఉన్నాయి.. మన్నల్ని చంపేస్తారు.
'లేదు ..పారిస్ మనది.. మనం ఎక్కడికీ పారిపోవాల్సి అవసరం లేదు..
వాళ్ల దగ్గర తుపాకులుంటే, మన దగ్గర పువ్వులు, క్యాండిల్స్ ఉన్నాయి..
క్యాండిల్స్, పువ్వులు, మనల్ని కాపాడతాయా.. ఇలా సాగుతుంది ఆ సంభాషణ.
చివరికి పువ్వులతో ఆ బ్యాడ్ పీపుల్‌ని మనం ఎదుర్కోవచ్చని తండ్రి అనునయంగా చెప్పిన మాటలకు ఏంతో రిలాక్స్డ్ గా బాలుడు నవ్వులు చిందించడం నెటిజనులను ఆకర్షిస్తోంది. దీంతో లైక్ లు, షేర్‌ల వెల్లువ పొంగుతోంది.