రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పాలకవర్గం ప్రతినిధులు పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారు. మురికివాడలు, పేదల బస్తీలపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నారు.
సమీపిస్తున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికలు
సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నపాలకవర్గం
పేదలపైనే ప్రత్యేక నజర్
హౌసింగ్‌లో లబ్ధిదారుల వాటా కూడా జీహెచ్‌ఎంసీ నుంచే
సమీక్ష సమావేశంలో మేయర్ మాజిద్ వెల్లడి
సిటీబ్యూరో:
రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పాలకవర్గం ప్రతినిధులు పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారు. మురికివాడలు, పేదల బస్తీలపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నారు. ఇప్పటికే పేదల బస్తీల్లో నీటిని శుద్ధిచేసే ప్లాంట్లు.. రూపాయికే టిఫిన్ వంటి కార్యక్రమాల అమలు యోచనలో ఉన్న పాలకమండలి... తాజాగా గృహ నిర్మాణ పథకాల్లో లబ్ధిదారుల వాటా కూడా జీహెచ్‌ఎంసీ నుంచే చెల్లించాలని భావిస్తున్నారు. మేయర్ మాజిద్‌హుస్సేన్ ఇదే విషయాన్ని అధికారులకు సూచించారు. జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం నిధులతో చేపట్టిన బలహీనవర్గాల గృహనిర్మాణ కార్యక్రమాలపై మంగళవారం తన కార్యాలయంలో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ జీహెచ్‌ఎంసీ నిధుల నుంచి లబ్ధిదారుల వాటా చెల్లించేందుకు తమకు అభ్యంతరం లేదన్నారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ఇళ్లల్లోని తలుపులు, కిటికీలు, శానిటేషన్ సామగ్రి చోరీకి గురైన విషయం తెల్సిందే. సదరు ఇళ్లకు తిరిగి వాటిని సమకూర్చేందుకు దాదాపు రూ.25 లక్షల నిధులు అవసరం.
తగిన ప్రతిపాదనలు రూపొందిస్తే.. స్టాండింగ్ కమిటీ ఆమోదంతో ఆ నిధులను కూడా సమకూర్చుతామని చెప్పారు. నిర్మాణం పూర్తయిన ఇళ్లలోకి లబ్ధిదారులు చేరకపోవడానికి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లే బాధ్యులన్నారు. వారు తగిన చొరవ చూపకపోవడం వల్లే ప్రాజెక్టులో జాప్యం జరుగుతోందని మేయర్ పేర్కొన్నారు. లబ్ధిదారుల వాటాగా రూ.240 కోట్లు రావాల్సి ఉందని, బ్యాంకులు సైతం వాటిని రుణాలుగా ఇచ్చేందుకు ముందుకు రావడం లేదన్నారు. వచ్చే మార్చిలోగా ప్రాజెక్టు పూర్తికాని పక్షంలో ఇప్పటివరకు చేసిన వ్యయం మొత్తం వృథా అవుతుందని, ఈ పరిస్థితి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ అధికారులకు సూచించారు. రెండు జిల్లాల కలెక్టర్లు, గృహనిర్మాణ విభాగం ప్రాజెక్టు అధికారులతో కలిసి సమావేశం నిర్వహించి సమస్యలు పరిష్కరించాలని స్పెషల్ కమిషనర్, అడిషనల్ కమిషనర్(యూసీడీ)లను మేయర్ ఆదేశించారు.