breaking news
Mayor majidhussen
-
అందరి సహకారంతో అభివృద్ధి
నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దేందుకు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో పాటు ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనకు ఎంతో కృషి చేశామని మేయర్ మాజిద్‌హుస్సేన్ అన్నారు. పాలక మండలి పదవీ కాలం పూర్తయిన నేపథ్యంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలు, ప్రజాప్రతినిధుల సహకారంతో వివిధ అంశాల్లో నగరాన్ని ప్రగతిపథంలో నడిపించామన్నారు. ఓ వైపు నగర చారిత్రక వారసత్వాన్ని పరిరక్షిస్తూనే మరోవైపు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజకు మెరుగైన సేవలందించేందుకు ప్రయత్నించానన్నారు. తాను మేయర్‌గా ఉన్న 35 నెలల్లో జీహెచ్ఎంసీ ఆర్థికంగా బలం పుంజుకుందన్నారు. ప్రజలపై ఎలాంటి పన్నులు వేయబోయనన్న హామీని అమలు చేస్తూనే ఆదాయాన్ని పెంచామని గుర్తు చేశారు. రూ.4 వేల లోపు వారికి ఆస్తిపన్ను మినహాయింపు అంశంపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోగలదన్న ధీమా వ్యక్తం చేశారు. వరదనీటి కాలువల ఆధునికీకరణ, ఆర్‌యూబీలు, ఆర్ఓబీలు, ఫ్లై ఓవర్ల పనులు జరుగుతున్నాయన్నారు. ఇవి పూర్తయితే ప్రజల ఇబ్బందులు పరిష్కారమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచంలోని వివిధ దేశాల్లోని నగరాలతో పరస్పర సహకారానికి ఒప్పందాలు కుదుర్చుకున్నామని మేయర్ గుర్తు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీసైతం బ్రిస్బేన్ జీ-20 సదస్సులో హైదరాబాద్ నగరం గురించి ప్రస్తావించడాన్ని గుర్తు చేశారు. పేదలకు వడ్డీలేని రుణాలు, అభయహస్తం, బంగారుతల్లి, వికాసం, ఆసరా తదితర ప్రభుత్వ పథకాలు సమర్ధంగా అమలు చేశామన్నారు. రూ. 5కే భోజనం, నైట్‌షెల్టర్ల ఏర్పాటు గురించీ ప్రస్తావించారు. తన హయాంలోనే కాప్ సదస్సు, మెట్రోపొలిస్ సద స్సులు నిర్వహించడం సంతోషాన్నిచ్చాయని చెప్పారు. మేయర్‌గా విధి నిర్వహణలో సహకరించిన అన్ని పార్టీలకూ కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్సీ జాఫ్రి, జీహెచ్ఎంసీలో ఎంఐఎం ఫ్లోర్‌లీడర్ నజీరుద్దీన్ పాల్గొన్నారు. మేయర్‌ను కలిసిన కమిషనర్ జీహెచ్ఎంసీ పాలక మండలికి చివరి రోజైన బుధవారం మేయర్ మాజిద్హుస్సేన్ను ఆయన చాంబర్లో కమిషనర్ సోమేశ్‌కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. మేయర్‌గా నగరాభివృద్ధికి ఎంతో కృషి చేశారని కమిషనర్ కొనియాడారు. దీనికి మేయర్ స్పందిస్తూ కమిషనర్, సీనియర్ అధికారుల సహాయ సహకారాలతోనే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు విజయవంత మయ్యాయని మేయర్ మాజిద్ కృతజ్ఞతలు తెలిపారు. -
తాయిలాలకు.. వేళాయె..
సమీపిస్తున్న జీహెచ్ఎంసీ ఎన్నికలు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నపాలకవర్గం పేదలపైనే ప్రత్యేక నజర్ హౌసింగ్‌లో లబ్ధిదారుల వాటా కూడా జీహెచ్ఎంసీ నుంచే సమీక్ష సమావేశంలో మేయర్ మాజిద్ వెల్లడి సిటీబ్యూరో: రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పాలకవర్గం ప్రతినిధులు పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారు. మురికివాడలు, పేదల బస్తీలపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నారు. ఇప్పటికే పేదల బస్తీల్లో నీటిని శుద్ధిచేసే ప్లాంట్లు.. రూపాయికే టిఫిన్ వంటి కార్యక్రమాల అమలు యోచనలో ఉన్న పాలకమండలి... తాజాగా గృహ నిర్మాణ పథకాల్లో లబ్ధిదారుల వాటా కూడా జీహెచ్ఎంసీ నుంచే చెల్లించాలని భావిస్తున్నారు. మేయర్ మాజిద్‌హుస్సేన్ ఇదే విషయాన్ని అధికారులకు సూచించారు. జేఎన్ఎన్యూఆర్ఎం నిధులతో చేపట్టిన బలహీనవర్గాల గృహనిర్మాణ కార్యక్రమాలపై మంగళవారం తన కార్యాలయంలో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ జీహెచ్ఎంసీ నిధుల నుంచి లబ్ధిదారుల వాటా చెల్లించేందుకు తమకు అభ్యంతరం లేదన్నారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ఇళ్లల్లోని తలుపులు, కిటికీలు, శానిటేషన్ సామగ్రి చోరీకి గురైన విషయం తెల్సిందే. సదరు ఇళ్లకు తిరిగి వాటిని సమకూర్చేందుకు దాదాపు రూ.25 లక్షల నిధులు అవసరం. తగిన ప్రతిపాదనలు రూపొందిస్తే.. స్టాండింగ్ కమిటీ ఆమోదంతో ఆ నిధులను కూడా సమకూర్చుతామని చెప్పారు. నిర్మాణం పూర్తయిన ఇళ్లలోకి లబ్ధిదారులు చేరకపోవడానికి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లే బాధ్యులన్నారు. వారు తగిన చొరవ చూపకపోవడం వల్లే ప్రాజెక్టులో జాప్యం జరుగుతోందని మేయర్ పేర్కొన్నారు. లబ్ధిదారుల వాటాగా రూ.240 కోట్లు రావాల్సి ఉందని, బ్యాంకులు సైతం వాటిని రుణాలుగా ఇచ్చేందుకు ముందుకు రావడం లేదన్నారు. వచ్చే మార్చిలోగా ప్రాజెక్టు పూర్తికాని పక్షంలో ఇప్పటివరకు చేసిన వ్యయం మొత్తం వృథా అవుతుందని, ఈ పరిస్థితి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులకు సూచించారు. రెండు జిల్లాల కలెక్టర్లు, గృహనిర్మాణ విభాగం ప్రాజెక్టు అధికారులతో కలిసి సమావేశం నిర్వహించి సమస్యలు పరిష్కరించాలని స్పెషల్ కమిషనర్, అడిషనల్ కమిషనర్(యూసీడీ)లను మేయర్ ఆదేశించారు.