అన్నిచోట్లా తగ్గినా.. మనం తగ్గలే! | We are top in the south in registration department | Sakshi
Sakshi News home page

అన్నిచోట్లా తగ్గినా.. మనం తగ్గలే!

Apr 26 2017 12:55 AM | Updated on Nov 9 2018 5:56 PM

అన్నిచోట్లా తగ్గినా.. మనం తగ్గలే! - Sakshi

అన్నిచోట్లా తగ్గినా.. మనం తగ్గలే!

వార్షికాదాయ లక్ష్యాన్ని చేరుకోవడంలో మూడేళ్లుగా కిందామీద పడుతున్న రాష్ట్ర రిజిస్ట్రేషన్ల శాఖ 2016–17లో ఆదాయం పెరుగుదలలో దక్షిణాదిన టాప్‌గా నిలిచింది.

- రిజిస్ట్రేషన్లలో దక్షిణాదిన మనమే టాప్‌ 
- 13.92% వృద్ధిరేటుతో రాష్ట్రం ముందంజ


సాక్షి, హైదరాబాద్‌: వార్షికాదాయ లక్ష్యాన్ని చేరుకోవడంలో మూడేళ్లుగా కిందామీద పడుతున్న రాష్ట్ర రిజిస్ట్రేషన్ల శాఖ 2016–17లో ఆదాయం పెరుగుదలలో దక్షిణాదిన టాప్‌గా నిలిచింది. 2015–16లో తెలంగాణ రాష్ట్ర రిజిస్ట్రేషన్ల ఆదాయం రూ. 3,100 కోట్లు కాగా, 2016–17లో రూ. 3,528 కోట్లు సాధించింది. మొత్తంగా 13.92 శాతం వృద్ధిరేటుతో రాష్ట్రం దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల కంటే ముందు వరుసలో నిలిచింది. 2015–16తో పోలిస్తే పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ఆదాయం 3.96 శాతం క్షీణించగా, కర్ణాటకలోనూ 5.61 శాతం మేర రిజిస్ట్రేషన్ల ఆదాయం తగ్గింది.

తమిళనాడులో రిజిస్ట్రేషన్ల ఆదాయం 18.36 శాతం తగ్గగా, కేరళలో 4.86 శాతం వృద్ధి నమోదైనట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. నవంబర్‌లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ప్రభావం చూపినా, భూములు, భవనాల మార్కెట్‌ విలువలను మూడేళ్లుగా ప్రభుత్వం పెంచకున్నా తెలంగాణ రాష్ట్రం మెరుగైన వృద్ధిరేటును సాధించడం విశేషం. రాష్ట్ర రిజిస్ట్రేషన్ల శాఖలో వివిధ స్థాయిల్లో ఖాళీలను ప్రభుత్వం భర్తీ చేస్తే, అవకతవకలను నివారించడం ద్వారా రాబడి మరింత పెంచేందుకు వీలవుతుందని రిజిస్ట్రేషన్ల వర్గాలు అంటున్నాయి.

వచ్చే ఏడాదికి అంచనాలు సిద్ధం!
రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయ అంచనాలను రిజిస్ట్రేషన్ల శాఖ సిద్ధం చేసింది. 2016–17లో మాదిరిగానే 2017–18లోనూ 14 శాతం ఆదాయ వృద్ధికి అవకాశం ఉందని రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు మంగళవారం ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. మొత్తంగా 2017–18లో రిజిస్ట్రేషన్ల ఆదాయం రూ. 3,600 కోట్లు వచ్చే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. అయితే, నోట్ల రద్దు అనంతర పరిణామాలు, నగదు లావాదేవీలపై కేంద్రం కొత్తగా తీసుకుంటున్న నిర్ణయాలు రిజిస్ట్రేషన్ల శాఖకు వచ్చే ఆదాయంపై ప్రభావం చూపే అవకాశం ఉందని చెబుతున్నారు. కొత్త ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు వచ్చే రాబడి, ఇతర పరిణామాలను పరిశీలించిన తరువాతే సరైన అంచనాకు రావచ్చని రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement