ప్రాజెక్టుల్లోకి ‘గోదావరి’ | Water streams into the godavari projects with rains | Sakshi
Sakshi News home page

ప్రాజెక్టుల్లోకి ‘గోదావరి’

Aug 21 2017 2:48 AM | Updated on Sep 12 2017 12:36 AM

రాష్ట్రానికి వరప్రదాయినిగా ఉన్న గోదావరి ప్రాజెక్టుల్లోకి ఈ ఏడాదిలో తొలిసారి గరిష్ట ప్రవాహాలు నమోదవు తున్నాయి.

వర్షాలతో కడెం, ఎల్లంపల్లి, ఎస్సారెస్పీ, నిజాంసాగర్‌లోకి ప్రవాహాలు

 
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రానికి వరప్రదాయినిగా ఉన్న గోదావరి ప్రాజెక్టుల్లోకి ఈ ఏడాదిలో తొలిసారి గరిష్ట ప్రవాహాలు నమోదవు తున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టుల్లోకి భారీగా నీరు వచ్చి చేరుతోంది. శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి, కడెం, నిజాంసాగర్‌లో చెప్పుకోదగ్గ స్థాయిలో నీటి మట్టాలు పెరుగుతున్నాయి. గోదావరి బేసిన్‌లో ఎగువ మహారాష్ట్రలో ఉన్న గైక్వాడ్‌ ప్రాజెక్టులకు గరిష్టంగా 9,238 క్యూసెక్కుల మేర ప్రవాహాలు వస్తున్నాయి. దీంతో ఇక్కడ 102 టీఎంసీల సామర్థ్యానికి గానూ 64.6 టీఎంసీల మేర నీటి నిల్వ ఉంది. ఇక దిగువన శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులోకి 5,116 క్యూసెక్కుల నీటి ప్రవాహాలు వస్తున్నాయి.

అయితే ఇక్కడ 90 టీఎంసీలకు గానూ ప్రస్తుత లభ్యత 9.66 టీఎంసీలు మాత్రమే ఉంది. ఎగువ మహారాష్ట్రలో అధిక వర్షాలు కురిస్తేనే శ్రీరాంసాగర్‌కు మరింత ప్రవాహాలు పెరిగే అవకాశం ఉంది. ఇక కడెం ప్రాజెక్టుకు సైతం 5,214 క్యూసెక్కుల ప్రవాహాలు వస్తున్నాయి. అక్కడ 7.6 టీఎంసీలకుగానూ 4.7 టీఎంసీల లభ్యత ఉంది. నిజాంసాగర్, ఎల్లంపల్లి ప్రాజెక్టుల్లోకి 2,600 క్యూసెక్కులకుపైగా ప్రవాహాలు నమోదవుతున్నాయి. ఇదే బేసిన్‌లోని లోయర్‌మానేరు డ్యామ్‌కు చుక్క కూడా చేరలేదు. సింగూరులోకి 290 క్యూసెక్కుల మేర నీరొస్తోంది. 
 
కృష్ణాలో అంతంతే... 
ఇక కృష్ణా బేసిన్‌ ప్రాజెక్టుల్లో ఎక్కడా ప్రవాహాలు పెద్దగా కనిపించడం లేదు. ఎగువ ఆల్మట్టి నుంచి 29వేల క్యూసెక్కుల మేర నీటిని దిగువకు వదలడంతో నారాయణపూర్‌కు 27,600 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. నారాయణపూర్‌ నుంచి దిగువకు చుక్క విడువకపోవడంతో పెద్దగా ప్రవాహాలు లేవు. అయితే జూరాల పరీవాహకం పరిధిలో కురుస్తున్న వర్షాలతో ఆ ప్రాజెక్టులోకి 2,052 క్యూసెక్కుల నీరు వస్తోంది. శ్రీశైంలంకి కూడా 2,238 క్యూసెక్కులు వస్తోంది. సాగర్‌లోకి 705 క్యూసెక్కులు మాత్రమే ప్రవాహం ఉంది. ఇవేవీ ప్రాజెక్టుల పరిధిలోని తాగు, సాగనీటి అవసరాలను తీర్చేలా లేవు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement