‘బాలీవుడ్’కు ‘భావన’ భాష్యం | Trafficked hearing | Sakshi
Sakshi News home page

‘బాలీవుడ్’కు ‘భావన’ భాష్యం

Jan 27 2014 12:56 AM | Updated on Apr 3 2019 4:37 PM

‘బాలీవుడ్’కు ‘భావన’ భాష్యం - Sakshi

‘బాలీవుడ్’కు ‘భావన’ భాష్యం

టీనేజ్ అమ్మాయి. తల్లితండ్రులు లేరు. కెనడాలో అక్కదగ్గరుంటోంది. ఒక ప్రకటన చూసి ఇంటర్వ్యూకి వెళ్లి ఫిలిం జర్నలిస్ట్ అయ్యింది.

సాక్షి, కల్చరల్ కరస్పాండెంట్: టీనేజ్ అమ్మాయి. తల్లితండ్రులు లేరు. కెనడాలో అక్కదగ్గరుంటోంది. ఒక ప్రకటన చూసి ఇంటర్వ్యూకి వెళ్లి ఫిలిం జర్నలిస్ట్ అయ్యింది. మూడు దశాబ్దాలు సినిమా రీలులా తిరిగాయి. వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్ని మైలురాళ్లో! బ్లాక్‌బస్టర్ ఫిలిం మేగజైన్ ‘స్క్రీన్’కు చీఫ్ ఎడిటర్. అబ్జర్వర్, హిందు, హిందుస్థాన్ టైమ్స్ తదితర పత్రికలకు కాలమిస్ట్. ‘అమితాబ్ బచన్ ద లెజెండ్-సలాం బాలీవుడ్-టాకింగ్ సినిమా’ తదితర 12 ప్రతిష్టాత్మక పుస్తకాల రచయిత. షబనా అజ్మీ కోసం: ‘మాసూమ్, ఆజ్‌కా ఎంఎల్‌ఏ, కామ్‌యాబ్’లకు చిత్రరచన చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి. 92.7 బిగ్ ఎఫ్‌ఎంలో రోజూ ఉదయం ఆమె కంఠం హిందీ సినిమా తాజా కబుర్లను వినిపిస్తుంది.

ఇంతకీ ఎవరామె..? రేడియో-టీవీ-ప్రింట్-ఎలక్ట్రానిక్ మీడియమ్‌లలో సినిమాలను రిపోర్ట్ చేస్తోన్న ఎవర్‌గ్రీన్ జర్నలిస్ట్ ‘భావనా సోమయ్య’. ‘హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్’ ముగింపు రోజు ఆదివారం మధ్యాహ్నం ప్రధానవేదిక ఆషియానాలో ‘బాలీవుడ్ సంగతులు’ అంశంపై చర్చాగోష్టిలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా ‘భావనా’తరంగాలు..
 
అమ్మ సలహా పాటించా..

జర్నలిస్ట్‌లతోను, సినిమా వాళ్లతో చనువుగా ఉండడం ఇష్టం లేని తల్లి తన కెరీర్ తొలి రోజుల్లో ‘చీకటి పడకముందే ఇంటికిరా. గబ్బర్‌సింగ్ లాంటివారి ఇంటర్వ్యూలు చేయమంటే ఒప్పుకోకు’ అని తల్లి చెప్పారని గుర్తు చేసుకున్నారు భావన. ఒక పత్రిక ఫిలిం ఎడిటర్‌గా పనిచేయమని అవకాశం వచ్చినపుడు తనకు అంతటి సామర్థ్యం లేదని భావించానని, ‘మూడు నెలలు పనిచెయ్యి, నువ్వు పనికిరావని తెలుసుకునేందుకైనా అంత సమయం పడుతుందని’ తల్లి ఇచ్చిన సలహాను పాటించానని భావన చమత్కరించారు. దాదాపు 16 ఏళ్లు అమితాబ్ బచర్ మీడియాను నిషేధించారని, ఆ దశలో అమితాబ్‌పై తాను రాసిన అనేక వ్యాసాల గురించి విన్న ఆయన ఆ క్లిప్పింగ్స్ అడిగితే ఇచ్చానన్నారు. వాటిని అమితాబ్ దంపతులు చదివి పుస్తకంగా తీసుకువచ్చారన్నారు. సినిమాల్లో నగ్న సన్నివేశాలను చూపడాన్ని తాను తప్పు పట్టనని రెండు పర్యాయాలు సెన్సార్‌బోర్డ్ సలహా సంఘం సభ్యురాలిగా పనిచేసిన భావన పేర్కొన్నారు. అయితే, కెమెరాను వల్గర్ ఏంగిల్స్‌లో చూపే వ్యక్తుల కుసంస్కారాన్ని తప్పుపడతానన్నారు.
 
కథ, వినోదం కోసమే సినిమాలు..
 
‘లంచ్‌బాక్స్’ లాంటి ఉత్తమ చిత్రాలు కాకుండా చెత్త సినిమాలు ఎందుకు వస్తున్నాయనే ప్రశ్నకు బదులిస్తూ.. అన్ని సినిమాలు నచ్చినట్లుండాలనే ధోర ణిని తాను హర్షించ లేనన్నారు. కొన్ని సినిమాలు కథ కోసం, కొన్నిటిని వినోదం కోసం చూస్తారని గుర్తు చేశారు. తెలుగు అస్సలు తెలీకపోయినా తన మామగారు విపరీతంగా తెలుగు సినిమాలు చూస్తారనే ఒక కాశ్మీరీ కోడలి వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఉదహరించారు. జర్నలిస్ట్‌లలోనూ రకరకాలుంటారని, సెలబ్రిటీల వ్యక్తిగత జీవితంలోకి చొచ్చుకు వచ్చే ధోరణి సమర్ధనీయం కాదని పేర్కొన్నారు. వివిధ భాషాచిత్రాలు రూపొందుతోన్న ముంబై పేరుతో కేవలం హిందీ సినిమాలను సూచించే ‘బాలీవుడ్’ పేరును మహేష్‌భట్ పెట్టారని ఇది అనుచితమేనన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement