ప్రైవేటుకు డయాగ్నొస్టిక్ కేంద్రాలు

ప్రైవేటుకు డయాగ్నొస్టిక్ కేంద్రాలు


అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాటుకు సర్కారు నిర్ణయం

 


 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో డయాగ్నొస్టిక్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం... ఆ కేంద్రాలన్నింటినీ ఒకే ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించాలని యోచిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) విధానంలో నిర్వహిస్తూ... చేసిన పరీక్షలను బట్టి సొమ్ము చెల్లించాలని భావిస్తోంది. కానీ ఈ ప్రతిపాదనను ప్రభుత్వ వైద్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ‘ప్రైవేటు’కు మేలు చేసేందుకే  డయాగ్నొస్టిక్ కేంద్రాల అప్పగింత, పీపీపీ పద్ధతిలో నిర్వహణను తెరపైకి తెచ్చారని ఆరోపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ అక్కడి ప్రభుత్వం ప్రైవేట్‌కు మేలు చేసేందుకు ఈ విధానాన్ని అమలు చేయడంపై తీవ్రంగా నిరసన వ్యక్తమవుతోంది.ప్రభుత్వ ప్రతిపాదనల ప్రకారం... ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) మొదలు జిల్లా ఆసుపత్రులు, రాష్ట్రస్థాయి వరకు అన్ని ఆసుపత్రుల్లో ప్రైవేట్ ఏజెన్సీ ఆధ్వర్యంలో డయాగ్నొస్టిక్ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. వీటిలో ఆరోగ్యశ్రీ కార్డులున్న రోగులందరికీ ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షలకయ్యే ఖర్చును ప్రభుత్వం ప్రైవేట్ ఏజెన్సీకి చెల్లిస్తుంది. దీనిని ప్రభుత్వ వైద్యులు తప్పుపడుతున్నారు. ప్రైవేటుకు ఇవ్వడం కాకుండా ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తే... ప్రభుత్వమిచ్చే సొమ్ముతో మౌలిక సదుపాయాలు కల్పించుకోవచ్చని పేర్కొంటున్నారు. రక్త పరీక్షలకూ దిక్కులేదు..

 రాష్ట్రంలో సుమారు 740 పీహెచ్‌సీలు, 5 వేల వరకు ఆరోగ్య ఉప కేంద్రాలు ఉన్నాయి. ఇక 115 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, 42 ఏరియా ఆసుపత్రులు, 10 జిల్లా ఆసుపత్రులు, 18 బోధనాసుపత్రులు, 5 మెటర్నిటీ ఆసుపత్రులు ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా ఇప్పటికీ పూర్తిస్థాయిలో వైద్య పరీక్షలు చేసే సౌకర్యం లేదు. పీహెచ్‌సీల్లో అయితే కనీసం రక్త పరీక్షలు కూడా చేసే దిక్కులేదు. ఏరియా ఆసుపత్రుల్లోనూ అరకొర వసతులే. కనీసం స్కానింగ్, ఎక్స్‌రే వంటి వసతులైనా లేవు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాసుపత్రుల్లో ఏర్పాటు చేయదలచిన డయాగ్నొస్టిక్ కేంద్రాలను... ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఏర్పాటు చేస్తే బాగుంటుందని వైద్యులు కోరుతున్నారు.అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రక్త పరీక్షలు నిర్వహించడానికి పెద్దగా ఖర్చు ఉండదని... ఎక్స్‌రే, స్కానింగ్, ఎంఆర్‌ఐ యంత్రాలను ఒకసారి ఏర్పాటు చేస్తే పేద రోగులకు శాశ్వతంగా మేలు జరుగుతుందని స్పష్టం చేస్తున్నారు. ఏరియా ఆసుపత్రుల్లో ఎక్స్‌రే, ఈసీజీ, స్కానింగ్ వంటి వసతులు ప్రభుత్వమే కల్పిస్తే చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజలందరికీ ఉపయోగంగా ఉంటుందని చెబుతున్నారు. ఒకే ఏజెన్సీకి..

 ప్రస్తుతం ప్రభుత్వం వద్ద ఉన్న ప్రతిపాదన అమల్లోకి వస్తే ఒకే ప్రైవేటు ఏజెన్సీకి డయాగ్నొస్టిక్ కేంద్రాల నిర్వహణ బాధ్యతను అప్పగిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరికీ ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి వారి ఆరోగ్య లోపాలతో స్మార్ట్ కార్డులను జారీ చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలోనే దీనిని ప్రతిష్టాత్మకంగా చేపట్టనుంది. డయాగ్నొస్టిక్ కేంద్రాల ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని, వసతిని ప్రైవేటు ఏజెన్సీకి ప్రభుత్వమే కల్పిస్తుంది. అయితే విద్యుత్ బిల్లుల నుంచి రోగులకు అవసరమైన పరీక్షలు నిర్వహించడం దాకా నిర్వహణ బాధ్యత మొత్తం ప్రైవేటు ఏజె న్సీదే.ఏ ఆసుపత్రిలో ఏ రోజు ఎన్ని వైద్య పరీక్షలు నిర్వహించారనే సమాచారాన్ని ఆ ఆస్పత్రి వైద్యులు, ప్రైవేటు ఏజెన్సీ కలసి ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. దాని ప్రకారం ఏజెన్సీకి ప్రభుత్వం సొమ్ము చెల్లిస్తుంది. అయితే వైద్య పరీక్షలు చేయకుండానే.. చేసినట్లు నమోదు చేస్తే ఎలాగన్న ప్రశ్న కూడా అధికారుల్లో నెలకొంది. ఇలా అక్రమాలు జరగకుండా నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top