చేనేతకు చేయూత కరువైంది. సహకార, సహకారేతరరంగాల్లో చేనేత వృత్తిపై ఆధార పడిన కార్మికులు ఉపాధి లేక దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు.
నేడు జాతీయ చేనేత దినోత్సవం
* దుర్భర దారిద్య్రంలో చేనేత కార్మికులు
* నేటికీ రూపుదిద్దుకోని చేనేత విధానం
సాక్షి, హైదరాబాద్: చేనేతకు చేయూత కరువైంది. సహకార, సహకారేతరరంగాల్లో చేనేత వృత్తిపై ఆధార పడిన కార్మికులు ఉపాధి లేక దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాల్సిన అప్పెరల్, టెక్స్‌టైల్ పార్కులు మౌలిక సౌకర్యాల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
నేటికీ చేనేత విధానం రూపు దిద్దుకోకపోవడం గమనార్హం. ఉమ్మడి రాష్ట్రంలో చేనేత సహకార సంఘాల ఉత్పత్తులకు ఆప్కో రూ.178 కోట్లు చెల్లించాల్సి ఉంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ తదితర సంక్షేమ శాఖల నుంచి తెలంగాణకు రూ.78 కోట్లు బకాయిలు రావాల్సి వుంది. సహకార సంఘాలు తమ పరిధిలోని కార్మికులకు రూ.70 కోట్లు బకాయిలు చెల్లించలేక చేతులెత్తేస్తున్నాయి.
ఆప్కో (విభజన పూర్తయితే టెస్కో) ద్వారా ప్రభుత్వ శాఖలు వస్త్రాలు కొనుగోలు చేస్తే రూ.200 కోట్ల మేర టర్నోవర్ జరిగి ఏటా 25 వేలకు పైగా మంది కార్మికులకు ఉపాధి దొరుకుతుందని చేనేత సహకార సంఘాల ప్రతినిధులు చెప్తున్నారు. అన్ని ప్రభుత్వ శాఖలు చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేయాలంటూ ఇటీవల ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 1994-95 మధ్య కాలం లో చంద్రబాబు హయాంలో చేనేత సహకార సంఘాలు నిర్వీర్యమయ్యాయి. దివంగత సీఎం వైఎస్ హయాంలో లివరీ కొనుగోలు, చేనేత కార్మికుల రుణమాఫీతో కొంత మేర ఈ రంగం పునరుజ్జీవనం పొందిందని కార్మిక సం ఘాలు చెప్తున్నాయి. చేనేత రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లు వినిపిస్తున్నాయి.
ఆప్కో బకాయిలను విడుదల చేయడం అందరికీ ఉపాధి, పనికి తగిన వేతనం సహకారేతర రంగంలో వున్న వారికి గుర్తింపు కార్డులు అందరికీ ఆరోగ్య బీమా, గృహ సౌకర్యం రూ.లక్షలోపు వ్యక్తిగత రుణాల మాఫీ పావలా వడ్డీపై ప్రోత్సాహక రుణాలు
తొలిసారిగా జాతీయ చేనేత దినోత్సవం
ఆగస్టు 7న తొలిసారిగా కేంద్ర ప్రభుత్వం జాతీయ చేనేత దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. చేనేత ఉత్పత్తుల వినియోగాన్ని ప్రోత్సహించడం, తద్వారా చేనేత కార్మికుల ఆదాయాన్ని పెంచి వారిలో భరోసా నింపడానికి ఉద్దేశించిన ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ ఆగస్టు 7న చెన్నైలో శ్రీకారం చుడుతున్నారు.