
భూ నిర్వాసితురాలికి ఉద్యోగ నియామక పత్రం అందజేస్తున్న భట్టి, కోమటిరెడ్డి, బీఎల్‌ఆర్
ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటన
గ్రీన్ పవర్ ఉత్పత్తిలో తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలబెడతామని వెల్లడి
విద్యుత్ కేంద్రం పరిధిలో 500 మంది భూనిర్వాసితులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేత
నాడు వై.ఎస్. ఆర్‌వోఎఫ్‌ఆర్ పట్టాలు ఇవ్వబట్టే నేడు గిరిజనులకు ఉద్యోగాలు వచ్చాయని వ్యాఖ్య
సాక్షి, హైదరాబాద్: యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని వచ్చే ఏడాది జనవరి 15 నాటికి జాతికి అంకితం చేస్తామని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. ఇప్పటికే రెండు యూనిట్లను అందుబాటులోకి తెచ్చామని.. గ్రీన్ పవర్ ఉత్పత్తిలో తెలంగాణను దేశంలోనే ముందు వరుసలో నిలబెడతామన్నారు. యాదాద్రి విద్యుత్ కేంద్రం పరిధిలో భూములు కోల్పోయిన 500 మందికి ప్రజాభవన్‌లో భట్టి శుక్రవారం ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంట్ ఉండదన్న దు్రష్పచారాన్ని తిప్పికొట్టామన్నారు.
‘కాంగ్రెస్ అంటేనే కరెంట్... కరెంట్ అంటేనే కాంగ్రెస్’అని వ్యాఖ్యానించారు. వాస్తవానికి యాదాద్రి పవర్ ప్లాంట్‌కు 2022 అక్టోబర్‌లోనే పర్యావరణ అనుమతులపై జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఇచి్చందని.. అయినా గత ప్రభుత్వ పాలకులు ప్లాంట్ నిర్మాణ పనుల్లో చేసిన జాప్యం వల్ల ప్రాజెక్టుపై తీవ్ర ఆర్థిక భారం పడిందన్నారు. తాము అధికారంలోకి రాగానే తిరిగి పర్యావరణ అనుమతులు తీసుకొచ్చి నిర్మాణ పనుల్లో వేగం పెంచామని చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 1978లోనే జపాన్ సంస్థ మిత్సుబిషి సాంకేతికతను ఉపయోగించి పంప్డ్ స్టోరేజీ విద్యుత్ ఉత్పత్తి తీసుకొచ్చామని చెప్పారు. విద్యుత్ డిమాండ్ పెరుగుతున్నప్పటికీ రాష్ట్రంలో రెప్పపాటు కూడా విద్యుత్ అంతరాయం లేకుండా చూస్తున్నామని భట్టి అన్నారు. రాష్ట్రంలోని 29 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు, 51 లక్షల మంది పేదలకు నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌కు అయ్యే రూ. 17 వేల కోట్ల మొత్తాన్ని విద్యుత్ సంస్థలకు ప్రభుత్వమే చెల్లిస్తోందని వివరించారు.
ఆలస్యం వల్ల ఆర్థిక భారం.. ప్రతి మండలానికీ అంబులెన్స్
కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) నిధుల నుంచి పవర్ ప్లాంట్ పరిసర గ్రామాల్లోని వారికి విద్య, వైద్యాన్ని ఉచితంగా అందిస్తామని భట్టి తెలిపారు. ప్రతి మండలానికీ ఒక అంబులెన్స్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. సీసీ రోడ్లు, ఫ్లై ఓవర్లు నిర్మిస్తామని, భూసేకరణకు అవసరమైన నిధులను ఇస్తామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి హయాంలోనే లక్షలాది మంది గిరిజనులకు ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాలు అందాయని భట్టి గుర్తుచేశారు. వారిలో చాలా మంది భూ నిర్వాసితులు ఇప్పుడు ఉద్యోగాలు పొందారన్నారు. జెన్‌కో విధుల్లో ఉండి ప్రాణాలు కోల్పోయిన 159 మంది కుటుంబ సభ్యులకు రెండోసారి కారుణ్య నియామక ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి, ఉన్నతా ధికారులు నవీన్ మిత్తల్, హరీశ్ పాల్గొన్నారు.