ఐటీరంగంలో 18 లక్షలమందికి ఉపాధి | Telangana: Bandaru Dattatreya asks govt to submit new textile proposals | Sakshi
Sakshi News home page

ఐటీరంగంలో 18 లక్షలమందికి ఉపాధి

Jun 25 2016 8:42 PM | Updated on Sep 4 2017 3:23 AM

దేశ వ్యాప్తంగా వచ్చే మూడేళ్లలో టెక్స్‌టైల్స్, గార్మెంట్ రంగాల్లో కోటి మందికి ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ వెల్లడించారు.

 హైదరాబాద్: దేశ వ్యాప్తంగా వచ్చే మూడేళ్లలో టెక్స్‌టైల్స్, గార్మెంట్ రంగాల్లో కోటి మందికి ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ వెల్లడించారు. వస్త్రాలు(టెక్స్‌టైల్స్), వస్త్ర ఉత్పత్తులు(అపరల్) రంగాల్లో కేంద్రం రూ.6వేల కోట్ల పెట్టుబడులు, రాయితీల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ రంగంలో 75శాతం మహిళలకే అవకాశాలు కల్పించనున్నట్లు చెప్పారు. శనివారమిక్కడ ఈపీఎఫ్ ప్రాంతీయ కార్యాలయంలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వస్త్రాలు, వస్త్రోత్పత్తి రంగంలో బంగ్లాదేశ్‌కు దీటుగా భారత్‌లో ప్రత్యేక పార్కులు ఏర్పాటు చేసి బలోపేతం చేయాలని కేంద్రం ఆలోచిస్తున్నట్లు తెలిపారు.

ఫ్యాషన్ టెక్నాలజీ అనుసరించి వివిధ రంగాల్లో ఉత్పత్తులు తయారు చేసుకోవడానికి మహిళలకు పరిశ్రమలు పెంపొందిస్తామన్నారు. టెక్స్‌టైల్, అపరల్ విధానానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రతిపాదనలు పంపిస్తే... కేంద్రం తరఫున అత్యధిక సహాయం అందేలా చూస్తామన్నారు. చేనేత కార్మికులు అత్యధికంగా ఉన్న పోచంపల్లి, గద్వాల్, నారాయణపేట తదితర ప్రాంతాలకు సంబంధించి ప్రత్యేక ప్రణాళికలు అందజేయాలని కోరారు. అదే విధంగా మహిళలకు ప్రసూతి సెలవుల కింద ప్రస్తుతం ఉన్న 12 వారాలను 26 వారాలకు పెంచుతున్నట్లు దత్తాత్రేయ వెల్లడించారు.

ఐటీ రంగంలో 18లక్షల మందికి ఉపాధి..
యువత చిన్న పరిశ్రమలు పెట్టుకోవడానికి కేంద్రం ప్రత్యేక ప్రోత్సహకాలు అందజేయనున్నట్లు దత్తాత్రేయ వెల్లడించారు. స్టార్టప్, స్టాండప్ కింద రూ.10వేల కోట్ల పెట్టుబడులు పెట్టి 18లక్షల మందికి ఉపాధి కల్పించాలని నిర్ణయించినట్లు తెలిపారు. అదే విధంగా పరిశ్రమలు కొత్తగా ఉద్యోగులను చేర్చుకుంటే వారికి భవిష్యనిధి డబ్బును కేంద్రమే చెల్లిస్తుందన్నారు. ఉద్యోగుల వాటా 12శాతాన్ని భరించడం కోసం ఈ ఏడాది కార్మికశాఖ రూ.వెయ్యి కోట్లు కేటాయించినట్లు గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహించడం కోసం పారిశ్రామిక వాడల్లో సమావేశాలు ఏర్పాటు చేసి, బ్యాంకర్ల ద్వారా సహాయం చేస్తామన్నారు.

 పరిశ్రమల ఉత్పత్తి పెంచడం కోసం పనిగంటలను పెంచే యోచన చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. కార్మికుల్లో సామాజిక భద్రత కల్పించడం కోసం లేబర్ బ్యూరో ద్వారా ప్రత్యేక సర్వే చేయించనున్నట్లు తెలిపారు. లేబర్ బ్యూరో సర్వే రిపోర్టును 5 ఏళ్ల నుంచి కుదించి ప్రతీ మూడు నెలలకు అందేలా చేసినట్లు వివరించారు. కనీస వేతన చట్టానికి తుది మెరుగులు దిద్దుతున్నామని, వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బిల్లు ఆమోదించి దేశ వ్యాప్తంగా అమలు చేస్తామన్నారు.

కార్మికులకు నైపుణ్య శిక్షణ పెంపొందించేందుకు సిస్ నిధుల నుంచి 20శాతం ఖర్చు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించినట్లు తెలిపారు. దేశ అభివృద్ధి కోసమే ఎఫ్‌డీఐలను వందశాతం అహ్వానిస్తున్నట్లు ఒక ప్రశ్నకు బదులుగా దత్తాత్రేయ స్పష్టం చేశారు. సమావేశం అనంతరం తెలంగాణ ఎన్నారై ఫోరం ప్రతినిధులు దత్తాత్రేయను కలిసి లండన్‌లో జులై 17న నిర్వహించే బోనాల జాతరకు రావాల్సిందిగా ఆహ్వానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement