
తెలుగు తమ్ముళ్ల డిష్యుం..డిష్యుం
టీడీపీలో టిక్కెట్టు చిచ్చు రేపింది. పార్టీ నాయకుల మధ్య కొట్లాటకు దారి తీసింది.
నాచారం: టీడీపీలో టిక్కెట్టు చిచ్చు రేపింది. పార్టీ నాయకుల మధ్య కొట్లాటకు దారి తీసింది. వివరాలివీ... మల్లాపూర్ డివిజన్ టీడీపీ అభ్యర్థిగా బోదాసు లక్ష్మీనారాయణ పేరును ఆదివారం అధికారికంగా ప్రకటించారు. లక్ష్మీనారాయణ నామినేషన్ వేసిన తరువాత సీనియర్ నాయకుల ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ క్రమంలో మల్లాపూర్‌లోని మాజీ కౌన్సిలర్, టీడీపీ సీనియర్ నాయకుడు కేశవరపు ఆంజనేయులు ఇంటికి వెళ్లారు.అక్కడికి చేరుకోగానే ఆంజనేయులు, అతని కుమారులు, అనుచరులు కలసి తనపై దాడి చేశార ని లక్ష్మీనారాయణ ఆరోపించారు.
మొదట ఆంజ నేయులు కుర్చీతో దాడి చేశాడని.. అనంతరం ఆయన అనుచరులు తనతో ఉన్న వారిపై దాడికి దిగారని బాధితుడు తెలిపారు. ఇరువర్గాలు గొడవ పడుతూ మల్లాపూర్ ప్రధాన రోడ్డుపైకి చేరుకున్నారు. దీంతో అరగంట పాటు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. ఈ విషయమై లక్ష్మీనారాయణ మాట్లాడుతూ అధిష్ఠానం దృష్టికి తీసుకెళతాన ని... నాచారం పోలీసులకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు.