కాపు రిజర్వేషన్‌పై నిర్ణయాన్ని సాయంత్రానికి చెబుతావా, రేపు చెబుతావా అని అడగటానికి ఇదేమీ రొట్టెముక్క కాదని టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యానించారు.
సాక్షి,హైదరాబాద్: కాపు రిజర్వేషన్‌పై నిర్ణయాన్ని సాయంత్రానికి చెబుతావా, రేపు చెబుతావా అని అడగటానికి ఇదేమీ రొట్టెముక్క కాదని టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యానించారు. మంగళవారం ఎన్టీఆర్ భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మొక్కుబడి జీవో ఇస్తే చట్టం ముందు నిలబడదని తెలిసి, మోసం చేశారని చెప్పడానికా అని ప్రశ్నించారు.
టీడీపీ అమలు చేస్తే ఆ క్రెడిట్ తనకే దక్కుతుందన్న ఆలోచనతో ఉద్యమాలు చేయడంలో తప్పులేదు కానీ తుని ఘటనతో కాపులను దోషులుగా చేయాలనే కార్యాచరణతో వెళ్లుతున్నావా అని ముద్రగడని ప్రశ్నించారు. చిరంజీవి తన స్వార్థం కోసం కాంగ్రెస్‌లో చేరి మంత్రి కావడం మినహా కాపులకు ఏం చేశారో చెప్పాలన్నారు. ఎమ్మెల్సీ గాలి ముద్దు కృష్ణమనాయుడు మాట్లాడుతూ కాపుల కోసం ప్రాణమిస్తానంటున్న ముద్రగడ 22 ఏళ్లుగా ఎందుకు నిద్రపోయారని ప్రశ్నించారు.