మట్టిలో మాణిక్యాలు గురుకులాలకు మెరుగులద్దారు!

State gurukul students shining in the national level - Sakshi

జాతీయ స్థాయిలో మెరిసిన రాష్ట్ర గురుకుల విద్యార్థులు 

ఐఐటీ, ఎన్‌ఐటీలతోపాటు జాతీయ సంస్థల్లో సీట్లు సాధించిన 453 మంది 

2017–18లో ఐఐటీల్లో 59 మందికి.. ఎన్‌ఐటీల్లో 174 మందికి.. 

వైద్య విద్యలో 82 మందికి.. అజీం ప్రేమ్‌జీ వర్సిటీలో 62 మందికి సీట్లు 

సాక్షి, హైదరాబాద్‌: కార్పొరేట్, ప్రైవేటు సంస్థల విద్యార్థులతో పోటీ పడుతూ ప్రభుత్వ గురుకులాల విద్యార్థులు అనూహ్య విజయాలను సాధిస్తున్నారు. జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో ప్రభంజనం సృష్టిస్తున్నారు. 2017–18 విద్యా సంవత్సరంలో వివిధ జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు హాజరైన వారిలో 453 మంది విద్యార్థులు ప్రముఖ విద్యా సంస్థల్లో సీట్లు సాధించారు. గతంలో ప్రభుత్వ విద్యా సంస్థల నుంచి జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో అర్హత సాధించే విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండేదని, ఇటీవలి కాలంలో ఆ సంఖ్య పెరుగుతోందని విద్యా శాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.

గతంలో ఎన్నడూ లేనివిధంగా 2017 జేఈఈ మెయిన్‌లో టాప్‌ ర్యాంకులను సాధించి 174 మంది విద్యార్థులు ఎన్‌ఐటీల్లో సీట్లు పొందగా, జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 59 మంది ఐఐటీల్లో సీట్లను పొందారు. ఇక ఏకంగా 82 మంది విద్యార్థులు నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రెన్స్‌ టెస్టు (నీట్‌)లో, ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ నిర్వహించిన ప్రవేశ పరీక్షలో ఉత్తమ ర్యాంకులను సాధించి మెడిసిన్‌లో సీట్లు పొందినట్లు విద్యా శాఖ లెక్కలు తేల్చింది. మరోవైపు అజీం ప్రేమ్‌జీ యూనివర్సిటీలో 62 మంది విద్యార్థులకు సీట్లు లభించాయి. 

ఫలితాల్లోనూ మేటి.. 
రాష్ట్రస్థాయి విద్యా సంస్థలతోపాటు జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో సీట్లు సాధించి తమ భాగస్వామ్యాన్ని పెంచుకుంటున్న గురుకులాలు ఫలితాల్లోనూ సత్తా చాటుతున్నాయి. టెన్త్, ఇంటర్మీడియెట్‌లో రాష్ట్ర సగటు ఉత్తీర్ణత కంటే అధిక శాతం సాధిస్తూ ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. పదో తరగతి ఫలితాల్లో రాష్ట్ర ఉత్తీర్ణత 84.15 శాతం ఉండగా, సోషల్‌ వెల్ఫేర్‌ గురుకులాలు 89.10 శాతం ఫలితాలను సాధించాయి. ఇంటర్మీడియెట్‌లో రాష్ట్ర సగటు ఉత్తీర్ణత 66.45 శాతం ఉండగా, సోషల్‌ వెల్ఫేర్‌ గురుకులాల విద్యార్థులు 87.12 శాతం సాధించారు. మోడల్‌ స్కూల్స్‌ కూడా టెన్త్‌లో 94 శాతం, ఇంటర్మీడియెట్‌లో 70.58 శాతం ఉత్తీర్ణత సాధించాయి. 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top