'కొత్త రాష్ట్రంతో యువతకు ఉద్యోగావకాశాలు'

'కొత్త రాష్ట్రంతో యువతకు ఉద్యోగావకాశాలు' - Sakshi


ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మల సీతారామన్ స్పష్టం చేశారు. కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా నిర్మల సీతారామన్ శనివారం హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్బంగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో నిర్మలా సీతారామన్ను రాష్ట్ర బీజేపీ అగ్రనేతలు ఘనంగా సన్మానించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నిర్మాల సీతారామన్ మాట్లాడుతూ... ఇరు రాష్ట్రాలు పారిశ్రామికంగా అభివృద్ధికి కేంద్రం సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పారు.



అలాగే ఇరు రాష్ట్రాలలో ఫూడ్ ప్రాసెసింగ్ పరిశ్రమను అభివృద్ధికి తనవంత సహకారం అందిస్తానని ఆమె భరోసా ఇచ్చారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో స్థానికంగా ఉన్న యువతకు ఉద్యోగావకాశాలు అధికమవుతాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.  ఎన్నికల నేపథ్యంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు తమ పార్టీ కట్టుబడి ఉందని ఆమె ఈ సందర్బంగా గుర్తు చేశారు. విదేశీ బ్యాంకుల్లో ఉన్న నల్లధనాన్ని వెనక్కి తీసుకువస్తామని చెప్పామని అందుకు ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టిందని ఆమె వివరించారు.



మహిళపై దాడులను నిరోధించేందుకు కేంద్ర పటిష్టమైన చర్యలు చేపట్టిందని ఆమె గుర్తు చేశారు. నిర్మల సీతారామన్ సన్మాన కార్యక్రమంలో సికింద్రబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యేలు, రాష్ట్ర నాయకులు పలువురు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో నిర్మల సీతారామన్ పాల్గొనున్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top