ఇదే చాన్స్ | Show Irregulars back to GHMC | Sakshi
Sakshi News home page

ఇదే చాన్స్

Nov 13 2015 12:56 AM | Updated on Sep 3 2017 12:23 PM

ఇదే చాన్స్

ఇదే చాన్స్

అక్రమార్కుల చూపు మళ్లీ జీహెచ్‌ఎంసీ వైపు మళ్లింది. అవకతవకలకు... ఆమ్యామ్యాలకు అలవాటు పడిన వారు జీహెచ్‌ఎంసీకి క్యూ కడుతున్నారు.

సాక్షి, సిటీబ్యూరో: అక్రమార్కుల చూపు మళ్లీ జీహెచ్‌ఎంసీ వైపు మళ్లింది. అవకతవకలకు... ఆమ్యామ్యాలకు అలవాటు పడిన వారు జీహెచ్‌ఎంసీకి క్యూ కడుతున్నారు. గతంలో ఇక్కడ పని చేస్తుండగా వచ్చిన అవినీతి ఆరోపణలు, పనుల్లో నిర్లక్ష్యం వంటి కారణాలతో వెళ్లిపోయిన వారు తిరిగి జీహెచ్‌ఎంసీలో చేరేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఒకరిద్దరు కోరుకున్న స్థానాల్లో చేరగా... మరికొందరు అతి త్వరలో చేరేందుకు ఏర్పాట్లు పూర్తయినట్లు తెలుస్తోంది.

ఇటీవలే బదిలీపై వెళ్లిన కమిషనర్ సోమేశ్ కుమార్ హయాంలోనే కాక... అంతకు ముందు కమిషనర్‌గా పని చేసిన కృష్ణబాబు హయాంలో మాతృ సంస్థలకు వెళ్లిన వారు కూడా తిరిగి జీహెచ్‌ఎంసీలో తిష్ట వేసేందుకు పెద్ద మొత్తాల్లోనే ఖర్చు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు జీహెచ్‌ఎంసీలోనే ఉంటున్నప్పటికీ తాము కోరుకున్న స్థానాలకు వెళ్లేందుకు పావులు కదుపుతున్న వారు గణనీయంగా ఉన్నట్లు తెలుస్తోంది.

అధికారులే కాక, ఔట్‌సోర్సింగ్‌పై పని చేస్తున్న అటెండర్లు, డ్రైవర్లు వంటి వారు కూడా కోరుకున్న స్థానాల్లో చేరేందుకు ప్రయత్నాలు చేస్తుండటం గమనార్హం. ఇతర ప్రభుత్వ విభాగాలతో పోలిస్తే జీహెచ్‌ఎంసీలో పనులు ఎక్కువగా ఉండటం.. బడ్జెట్ కూడా భారీగానే ఉండటం.. డబ్బులు చేతులు మారడం కూడా అదే దామాషాలో ఉండటంతో ఇక్కడ పని చేసేందుకు ఉత్సాహం చూపుతున్న వారు ఎక్కువ మందే ఉన్నారు. ఇటీవల బదిలీ అయిన సోమేశ్‌కుమార్ కచ్చితత్వంతో ఒక దశలో జీహెచ్‌ఎంసీలో పని చేసేందుకే భయపడిన పరిస్థితి ఏర్పడగా... ఆయన వెళ్లగానే మళ్లీ ఇటువైపు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్న వారు భారీగా పెరుగుతున్నారు.
 
ఇదీ వరుస

* గతంలో ఒక ఉన్నతాధికారి ద్వారం వద్ద ఉంటూ.. సందర్శకులను గదిలోకి పంపించే ఓ ఔట్‌సోర్సింగ్ అటెండర్ పనితీరు అనుమానాస్పదంగా ఉండటంతో అతన్ని అక్కడి నుంచి తప్పించారు. సోమేశ్ కుమార్‌కు బదిలీ అయిన మరుసటి రోజే పాత స్థానంలో ఆ అటెండర్ విధులు నిర్వహించడం విస్మయానికి గురి చేసింది.
* అకౌంట్స్ విభాగంలో పనిచేసే ఒక అధికారిని దాదాపు మూడేళ్ల క్రితం కృష్ణబాబు కమిషనర్‌గా ఉన్నప్పుడు జీహెచ్‌ఎంసీలో అవసరం లేదని రిలీవ్  చేశారు. గృహ నిర్మాణ పనులకు  సంబంధించి మంజూరు లేకుండానే బిల్లులు పాస్ చేయడం వంటి అంశాలు దృష్టికొచ్చి కృష్ణబాబు ఆయనను జీహెచ్‌ఎంసీ నుంచి పంపించినట్లు సమాచారం. ఆ అధికారి కొద్దికాలం క్రితం తిరిగి జీహెచ్‌ఎంసీకి బదిలీ అయినప్పటికీ విధుల్లో చేరలేకపోయారు. సోమేశ్ కుమార్ కమిషనర్‌గా ఉన్నప్పుడు విధుల్లో చేరలేకపోయిన ఆయన గతంలో కంటే పైస్థానంలో నేడో రేపో జీహెచ్‌ఎంసీలో చేరేందుకు ఏర్పాట్లు పూర్తయినట్లు సమాచారం.
* చాలా ఏళ్లుగా ఒకే చోట పాతుకుపోయిన వారిలో కొందరిని సోమేశ్ కుమార్ హయాంలో ఇతర స్థానాలకు పంపించారు. అలాంటి వారంతా తిరిగి పాత స్థానాల్లోకి చేరేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ దిశగా ఒకరిద్దరు సఫలీకృతులైనట్లు సమాచారం.
* వీరి చర్యలతో గతంలో ఏ కారణం లేకుండా జీహెచ్‌ఎంసీ నుంచి వెళ్లిపోయిన వారు తిరిగి వచ్చే అవకాశం లేకుండా పోయిందనే వాదనలు వినిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement