సంక్షేమ భవన్‌లో విభజన లొల్లి! | roits Division of Welfare Bhavan! | Sakshi
Sakshi News home page

సంక్షేమ భవన్‌లో విభజన లొల్లి!

Jun 8 2014 2:30 AM | Updated on Oct 22 2018 7:32 PM

సంక్షేమ భవన్‌లో విభజన లొల్లి! - Sakshi

సంక్షేమ భవన్‌లో విభజన లొల్లి!

అధికారికంగా రెండు రాష్ట్రాలు ఏర్పాటై వారం గడుస్తున్నా... సంక్షేమశాఖలో ఆ పరిస్థితి కనిపించడం లేదు.

భవనంలోని అంతస్థులనువిభజించినా... మారని చాంబర్లు
సహకరించడం లేదంటూ రెండు ప్రాంతాల ఉద్యోగుల ఆరోపణలు    

 
 హైదరాబాద్: అధికారికంగా రెండు రాష్ట్రాలు ఏర్పాటై వారం గడుస్తున్నా... సంక్షేమశాఖలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం సంక్షేమ కార్యాలయాల విభజన కూడా ఈ శాఖలో కనిపించడం లేదు. నగరంలో మాసబ్‌ట్యాంక్‌లోని సంక్షేమ భవన్‌లో రెండు ప్రాంతాల అధికారులు, ఉద్యోగుల మధ్య సమన్వయం కొరవ డడంతో కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి. జూన్ 2 అపాయింటెడ్ డే నుంచి తెలంగాణ కొత్త రాష్ట్రం ఏర్పాటు కావడంతో అంతకు ముందే ప్రభుత్వం సంక్షేమభవన్‌లోని ఆరు అంతస్తులను జనాభా ప్రాతిపదికన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు విభజించింది. గ్రౌండ్ ఫ్లోర్, మొదటి, రెండో అంతస్తులను తెలంగాణకు , మూడు నుంచి ఆరు అంతస్తు లను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు. ఈ మేరకు సంక్షేమ భవన్‌లో విభజన వివరాలను కాగితాలపై ముద్రించి అన్ని అంతస్తులలో అతికించారు కూడా. అయితే వారం రోజులు గడచినా... రెండు ప్రాంతాల అధికారులు, ఉద్యోగులు తమ చాంబర్లను ఖాళీ చేయలేదు. విభజనకు ముందు ఉన్నట్టుగానే అధికారులు, ఉద్యోగులు యథాస్థానాల్లోనే ఉండి కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే రెండు ప్రాంతాలకు చెందిన వారు నెపాన్ని ఎదుటివారిపై నెట్టేస్తున్నారు. దీంతో సంక్షేమ భవన్‌కు వచ్చే ప్రజలు, ఫీజు రీయింబర్స్‌మెంటు కోసం వచ్చే విద్యార్థులు అయోమయ పరిస్థితి ఎదుర్కొంటున్నారు.

 ఏపీలోకి 13 మంది తెలంగాణ ఉద్యోగులు

 గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ విభాగంలో పూర్వపు ఆంధ్రప్రదేశ్‌లో 516 మంది ఉద్యోగులు ఉండ గా, ప్రధాన కార్యాలయమైన సంక్షేమ భవన్‌లో 69 మంది ఉద్యోగులున్నారు. ఈ 69 మందిలో స్థానికత ఆధారంగా 23 మంది ఉద్యోగులను తెలంగాణకు కేటాయించారు. మిగతా 46 మందిని ఆంధ్రప్రదేశ్‌కు అప్పగించారు. మంజూరైన పోస్టుల ఆధారంగా జరిగిన ఈ విభజనలో సీమాంధ్రకు వెళ్లినవారిలో 13 మంది తెలంగాణ వారున్నారు. తెలంగాణకు చెందిన తమను సీమాంధ్రకు కేటాయించడంపై ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే తమను సీమాంధ్రకు పంపించారన్న అభిప్రాయంతో ఉన్న ఆ ఉద్యోగులు సహకరించడం లేదని సీమాంధ్ర అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై గిరిజన శాఖ ఇంజనీరింగ్ విభాగం ఈఎన్‌సీ రాజేంద్రప్రసాద్ ‘సాక్షి’ తో మాట్లాడుతూ ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారమే ఉద్యోగుల విభజన జరిగిందని, తెలంగాణకు కొత్తగా పోస్టులు మంజూరైన తరువాత సీమాంధ్రకు కేటాయించిన ఉద్యోగులు తమ ప్రాంతాలకు వెళతారని చెప్పారు.
 
 
 

Advertisement
 
Advertisement
Advertisement