రోహిత్ చట్టాన్ని సాధిస్తాం | Rohit sure of the law | Sakshi
Sakshi News home page

రోహిత్ చట్టాన్ని సాధిస్తాం

Feb 18 2016 12:23 AM | Updated on Jul 26 2019 5:38 PM

రోహిత్ వేముల ఆశయాల సాధనకు చేపట్టిన ఉద్యమాన్ని పక్కదోవ పట్టించేందుకు కేంద్రం పన్నుతున్న కుట్రలను ....

హైదరాబాద్:  రోహిత్ వేముల ఆశయాల సాధనకు చేపట్టిన ఉద్యమాన్ని పక్కదోవ పట్టించేందుకు కేంద్రం పన్నుతున్న కుట్రలను ఛేదిస్తామని, రోహిత్ చట్టాన్ని సాధిస్తామని పలువురు వక్తలు పేర్కొన్నారు. బుధవారం హెచ్‌సీయూ విద్యార్థుల బస్సుయాత్ర ముగింపు సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ఎదుట బహిరంగ సభ నిర్వహించారు. భాస్కర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు వి.హనుమంతరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం హిందూ దేశంగా మార్చే ప్రయత్నాన్ని మానుకోవాలన్నారు. ప్రధాని మోదీ ఆర్‌ఎస్‌ఎస్ సూచనల మేరకే పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. రోహిత్ ఆత్మహత్యకు కారకులైన వారిపై కఠినంగా శిక్షించే వరకు ఉద్యమం ఆగదని ప్రొఫెసర్ కంచ ఐలయ్య అన్నారు. రోహిత్ ఘటనపై చర్చ జరగకుండా అడ్డుకునే కుట్రలో భాగంగానే జెఎన్‌యూలో కన్హయ్యపై దేశద్రోహ నేరం మోపారని మల్లెపల్లి లక్ష్మయ్య ఆరోపించారు. ఎన్ని అడ్డంకులెదురైనా రోహిత్ చట్టం వచ్చేవరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని హెచ్‌సీయూ విద్యార్థి జేఏసీ నాయకులు జోహెల్ అన్నారు.

రోహిత్‌కు జరిగిన అన్యాయంపై యువకులు, విద్యార్థులు ఆగ్రహావేశాలతో ఉన్నారని కన్వీనర్ వెంకటేశ్  చౌహాన్ తెలిపారు. ఏబీవీపీ విద్యార్థులు శూలాలతో ప్రదర్శనలు చేస్తున్నా పట్టించుకోని ప్రభుత్వం, కులవివక్షపై పోరాడుతున్న విద్యార్థులను దేశద్రోహులుగా చిత్రీకరిస్తోందని ఓయూ జేఏసీ నాయకులు దుర్గం భాస్కర్ ఆరోపించారు. డీఎస్‌ఎస్ అధ్యక్షురాలు గెడ్డం ఝాన్సీ, జమాతే ముస్లిం నాయకులు షబ్బీర్, మాల సంక్షేమ సంఘం నాయకులు రాంప్రసాద్, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు సాంబశివ, పిడిఎస్‌యు నాయకులు రాము, సత్య  కార్యక్రమంలో పాల్గొన్నారు.

విచారణ తేదీలను మార్చాలని వినతి
రోహిత్ ఘటనపై నియమించిన ఏకసభ్య కమిషన్ విచారణ తేదీని ఈ నెల 27కు మార్చాలని హెచ్‌సీయూ సామాజిక న్యాయపోరాట విద్యార్థి జేఏసీ కమిషన్‌కు లేఖ రాసింది. ఈ నెల 23న చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నందున తేదీల్లో మార్పు చేయాలని  కోరుతూ జేఏసీ నాయకులు మున్న, ఫిరదౌస్ సోనీ, జుహైల్, సంజయ్, ధనుంజయ్ ఒక ప్రకటన విడుదల చేశారు. విచారణను యుజీసీ ప్రాంతీయ కార్యాలయంలో కాకుండా హెచ్‌సీయూలో నిర్వహించాలని వారు కోరారు.

హెచ్‌సియు బంద్‌కు పిలుపు
జేఎన్‌యూ ఉపాధ్యాయులు, విద్యార్థుల పిలుపు మేరకు విశ్వవిద్యాలయాల్లో కొనసాగుతున్న వివక్షకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా జరుగుతున్న బంద్‌లో పాల్గొనాలని హెచ్‌సియు విద్యార్థి జేఏసీ నాయకులు పేర్కొన్నారు. వర్సిటీల్లో ఫాసిస్టు దాడులను వ్యతిరేకిస్తూ జరిగే బంద్ లో విద్యార్థులంతా పాల్గొనాలని కోరారు. గురువారం ఉదయం 9 గంటలకు లైఫ్ సెన్సైస్ బిల్డింగ్ దగ్గర బంద్ కార్యక్రమం ప్రారంభం అవుతుందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement