గ్రేటర్‌లో ‘రోడ్డు డాక్టర్స్’
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీలో దెబ్బతిన్న రోడ్లను ఎప్పటికప్పుడు మరమ్మతు చేసేందుకు ఐదు ‘రోడ్డు డాక్టర్’ యంత్రాలను అద్దెకు తీసుకునేందుకు అధికారులు సిద్ధమయ్యారు. వీటిని జోన్‌కొకటి చొప్పున వినియోగించనున్నారు. ఈ మేరకు త్వరలోనే టెండర్లు పిలవనున్నారు. నగరంలో ఏటా దాదాపు రూ. 300 కోట్లు రహదారుల మరమ్మతులకు వెచ్చిస్తున్నారు. కొద్ది రోజులకేపరిస్థితి షరా మామూలుగా మారుతోంది. ఈ నేపథ్యంలో రోడ్డు డాక్టర్ యంత్రం ద్వారా ఎప్పటికప్పుడు గుంతలు పూడ్చేందుకు సిద్ధమవుతున్నారు.
దీనివల్ల తక్కువ సమయంలో పని పూర్తవుతుంది. తద్వారా ట్రాఫిక్‌కు ఎక్కువ సేపు అంతరాయం కలుగకుండా నివారించవచ్చు. రోడ్డు తడిగా ఉన్నప్పటికీ దీనితో మరమ్మతులు చేపట్టవచ్చు. వీటన్నింటితో పాటు జీహెచ్‌ఎంసీ రోడ్ల మరమ్మతులకు ఏటా వెచ్చిస్తున్న మొత్తంతో పోల్చినా అదనపు ఖర్చు ఉండదని లెక్కగడుతున్నారు. దీంతో ఈ యంత్రాలను అద్దెకు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఏడాది పాటు రహదారుల మరమ్మతులకు కిలోమీటరుకు దాదాపు రూ.50 వేల నుంచి రూ. 60 వేల వంతున చెల్లించనున్నారు.
ఏడాది పొడవునా రహదారులపై గుంతలు లేకుండా చూడాల్సిన బాధ్యత కాంట్రాక్టు సంస్థదే. గుంతలు గుర్తించాక 24 గంటల్లోగా మరమ్మతులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు టెండర్లు పిలిచి.. సంబంధిత సంస్థల ద్వారా యంత్రాలను వినియోగించనున్నారు. గత ఆగస్టులో జీహెచ్‌ఎంసీ ప్రయోగాత్మకంగా ఒక రోడ్డు డాక్టర్‌ను అద్దెకు తీసుకుంది. కొద్ది రోజులకే మరమ్మతులకు గురికావడంతో పనులు నిలిచిపోయాయి.
తాజాగా మరోసారి అద్దెకు తీసుకొని... వర్షాకాలానికి ముందే రహదారుల మరమ్మతులు పూర్తి చేయడమే కాక, ఏడాది పొడవునా నిర్వహణకు రోడ్డు డాక్టర్ ను వినియోగించాలని అధికారులు భావిస్తున్నారు. దేశంలోని వివిధ నగరాల్లో వివిధ కంపెనీలకు చెందిన రోడ్డు డాక్టర్‌లు పని చేస్తున్నాయి. వాటిని పరిగణనలోకి తీసుకున్న జీహెచ్‌ఎంసీ అధికారులు నగరంలోనూ వినియోగించాలని యోచిస్తున్నారు.