రాంరెడ్డి వెంకట్‌రెడ్డి ఇకలేరు

రాంరెడ్డి వెంకట్‌రెడ్డి ఇకలేరు - Sakshi


నేడు స్వగ్రామం పాతలింగాలలో అంత్యక్రియలు

సాక్షి, ఖమ్మం/హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత, పీఏసీ చైర్మన్ రాంరెడ్డి వెంకట్‌రెడ్డి(72) కన్నుమూశారు. కొంతకాలంగా ఊపిరితిత్తుల కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. వెంకట్‌రెడ్డి నాలుగేళ్లుగా ఊపిరితిత్తుల కేన్సర్‌తో బాధపడుతున్నారు. నెల రోజుల కింద ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కిమ్స్‌లో చేర్చారు. చికిత్స సమయంలో ఫిట్స్ రావడంతో కొద్దిరోజుల కిందట అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. దీంతో ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందజేశారు.పరిస్థితి విషమించి శుక్రవారం మధ్యాహ్నం మరణించారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి నేత వరకు ఎదిగిన వెంకట్‌రెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై.. మంత్రిగానూ పనిచేశారు. ఆయనకు భార్య సుచరిత, నలుగురు కుమార్తెలు ఉన్నారు. వెంకట్‌రెడ్డి అంత్యక్రియలు శనివారం ఆయన స్వగ్రామం ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పాతలింగాలలో నిర్వహించనున్నారు.

 

రాజకీయాల్లో తనదైన ముద్ర..

రాంరెడ్డి వెంకట్‌రెడ్డి ఖమ్మం జిల్లాలోని కామేపల్లి మండలం పాతలింగాల గ్రామంలో నారాయణరెడ్డి-కమలమ్మ దంపతులకు 1944, మే 22న జన్మించారు. ఆయన ఉస్మానియా నుంచి ఎంఏ పూర్తి చేశారు. అప్పటి కాంగ్రెస్ నేత శీలం సిద్ధారెడ్డికి ప్రియశిష్యుడు. 1962లో పాతలింగాల గ్రామ సర్పంచ్‌గా వెంకట్‌రెడ్డి రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. వరుసగా 15 ఏళ్లపాటు సర్పంచ్‌గా కొనసాగారు. 1996, 1999, 2004లో సుజాతనగర్ ఎమ్మెల్యేగా, 2009, 2014లో పాలేరు ఎమ్మెల్యేగా గెలిచారు.2014లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మంత్రివర్గంలో సహకార, కార్మిక, ఉద్యానవన శాఖల మంత్రిగా పనిచేశారు. అనంతరం రోశయ్య, కిరణ్ కేబినెట్‌లోనూ కొనసాగారు. కమ్యూనిస్టుల ప్రభావం ఉన్న ఖమ్మం జిల్లాలో ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై రాంరెడ్డి వెంకట్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తోడ్పడ్డారు. గత ఏడాది నవంబర్‌లో పీఏసీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. రాజకీయాల్లో ఆయనకు వివాద రహితుడిగా పేరుంది.ఇక రాంరెడ్డి వెంకట్‌రెడ్డి పేరు వింటేనే ఒంగోలు గిత్తలు, పాడిగేదెలు గుర్తొస్తాయి. రైతుకు వ్యవసాయంతో పాటు పాడిగేదెల పెంపకం అవసరమని ఆయన భావించేవారు. రైతుల కోసం ఎంతో కృషి చేశారు. పాతలింగాలలోని వారి ఇంట్లో దేశంలో ఉన్న అన్ని జాతుల పశు సంపద ఉండడం విశేషం. దేశంలో ఎక్కడ ఎడ్ల బండి, గిత్తల పోటీలు జరిగినా రాంరెడ్డి సోదరుల గిత్తలే విజేతలుగా నిలిచేవి.

 

ప్రముఖుల సంతాపం..

రాంరెడ్డి వెంకట్‌రెడ్డి మరణవార్త విని ఆయన బంధువులు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కిమ్స్ ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. మంత్రులు హరీశ్‌రావు, ఈటెల, జగదీశ్‌రెడ్డి, తుమ్మల, ఇంద్రకరణ్‌రెడ్డి, పీసీసీ చీఫ్ ఉత్తమ్, భట్టివిక్రమార్క, ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ తదితరులు వెంకటరెడ్డి భౌతికకాయానికి నివాళులర్పించారు. ఆయన మృతి పట్ల కాంగ్రెస్ సీనియర్ నేతలు జానారెడ్డి, జైపాల్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, గుత్తా సుఖేందర్‌రెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, వంశీచంద్‌రెడ్డి, బీజేపీ నాయకులు జి.కిషన్‌రెడ్డి, కె.లక్ష్మణ్ సంతాపం తెలిపారు.

 

తీరని లోటు: కేసీఆర్

రాంరెడ్డి వెంకట్‌రెడ్డి మరణం రాష్ట్రానికి తీరని లోటని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. వెంకట్‌రెడ్డి మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీనియర్ ఎమ్మెల్యేగా అందరితో అన్యోన్యంగా ఉండేవారని, ఉన్నత వ్యక్తిత్వమున్న వెంకట్‌రెడ్డి పట్ల రాజకీయాలకు అతీతంగా ఎంతో గౌరవం ఉందని చెప్పారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

 

అధికార లాంఛనాలతో అంత్యక్రియలు

అనారోగ్యంతో కన్నుమూసిన కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట్‌రెడ్డి అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సీఎం కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మను ఆదేశించారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top