కొనసాగుతున్న ఆమరణ దీక్ష
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో శుక్రవారం అర్ధరాత్రి ప్రారంభమైన ముగ్గురు విద్యార్థుల ఆమరణ దీక్ష కొనసాగుతోంది.
	సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో శుక్రవారం అర్ధరాత్రి ప్రారంభమైన ముగ్గురు విద్యార్థుల ఆమరణ దీక్ష కొనసాగుతోంది. విద్యార్థుల ప్రధానమైన డిమాండ్లలో తొలి డిమాండ్ రోహిత్‌తో సహా మరో నలుగురు విద్యార్థులను రెస్టికేట్ చేసిన అప్పారావును తొలగించడం. అయితే, అప్పారావు దీర్ఘకాలిక సెలవుపై వెళ్లగా... ఆయన స్థానంలో నియామకమైన విపిన్ శ్రీవాస్తవ్‌ని కూడా విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకించారు. విద్యార్థులతో పాటు ఎస్‌సీ, ఎస్‌టీ అధ్యాపకులు శ్రీవాస్తవ్‌కు వ్యతిరేకంగా నిరశన దీక్ష చేపట్టారు.
	
	శుక్రవారం అర్ధరాత్రి విపిన్ శ్రీవాస్తవ్ స్థానంలో  కెమిస్ట్రీ డీన్ పెరియసామి ఇన్‌చార్జ్ వీసీగా బాధ్యతలు చేపట్టడంతో విద్యార్థులలో కొంత సానుకూల వాతావరణం ఏర్పడుతుందన్న ఆశాభావాన్ని యూనివర్సిటీ అధ్యాపకులు వ్యక్తం చేశారు. గతంలోనే విద్యార్థులపై రెస్టికేషన్‌ను తాత్కాలికంగా ఎత్తివేస్తున్నట్టు యూనివర్సిటీ ప్రకటిం చింది. శుక్రవారం బాధ్యతలు చేపట్టిన ఇన్‌చార్జ్ విసి పెరియసామి శనివారం సాయంత్రం విద్యార్థులు ప్రొఫెసర్లతో మాట్లాడారు.
	
	అయితే ఆదివారం డీన్స్‌తో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటుచేసి విద్యార్థుల డిమాం డ్లపై చర్చించాలని  ఇన్‌చార్జ్ వీసీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. అలాగే మిగిలిన డిమాండ్ల పరిష్కారం కోసం ఆమరణ దీక్ష కొనసాగిస్తున్న విద్యార్థులు, విద్యార్థులకు మద్దతుగా రిలే దీక్ష చేస్తున్న ఎస్‌సీ, ఎస్‌టీ అధ్యాపకులు వీరికి మద్దతుగా నిలిచిన ఇతర అధ్యాపకులను శని వా రం సాయంత్రం పెరియార్‌సామి కలిసి మాట్లాడినట్లు తెలిసింది. అధ్యాపకుల దీక్ష సైతం కొనసాగుతుందని ప్రొఫెసర్ కృష్ణ, ప్రొఫసర్ శ్రీపతి రాముడు  తెలిపారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
