భారీగా విద్యుదుత్పత్తి నిలుపుదల!


- ‘బ్యాకింగ్ డౌన్’కు ఈఆర్‌సీ ఆమోదముద్ర

- 2016-17లో 6,926 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి తగ్గింపు


 

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ ఏడాదీ భారీ ఎత్తున విద్యుదుత్పత్తి నిలుపుదలకు రంగం సిద్ధమైంది. డిమాండ్ లేకపోవడంతో 2016-17లో 6,926 మిలియన్ యూనిట్ల (ఎంయూ)లను బ్యాకింగ్ డౌన్ (అందుబాటులో ఉన్న విద్యుత్‌తో పోలిస్తే డిమాండ్ తక్కువగా ఉన్నప్పుడు బలవంతంగా ఉత్పత్తిని తగ్గించుకోవడం) చేయాల్సి రావచ్చని రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి ప్రతిపాదించాయి. విద్యుత్ డిమాండ్ గరిష్ట స్థితికి పెరిగిన సమయాల్లో నిరంతర సరఫరా కొనసాగింపునకు అదనపు విద్యుత్ కొనుగోళ్లు చేయక తప్పదని, డిమాండ్ తగ్గిన సమయాల్లో ఈ విద్యుత్ అవసరం ఉండదని వివరణ ఇచ్చాయి.

 

 తెలంగాణ రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ (జెన్‌కో) థర్మల్ ప్లాంట్లతోపాటు దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) కుదుర్చుకున్న ఇతర విద్యుత్ ప్లాంట్లలో చేపట్టాలనుకుంటున్న ఈ బ్యాకింగ్ డౌన్ వల్ల రూ. 692.61 కోట్ల అదనపు భారం పడనుందని నివేదించాయి. దీనిపై ఈఆర్‌సీ సానుకూలంగా స్పందించింది.  అదనపు భారాన్ని నిర్ధారించాక ట్రూ అప్ చార్జీల రూపంలో వినియోగదారుల నుంచి వసూలు చేసేందుకు అనుమతిస్తామని పేర్కొంది. తాజాగా ప్రకటించిన రిటైల్ టారీఫ్ ఆర్డర్ 2016-17లో విద్యుత్ ప్లాంట్ల బ్యాకింగ్ డౌన్ అంశంపై డిస్కంలకు ఈఆర్సీ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

 

 విద్యుత్ విక్రయాలతో రూ.724 కోట్ల ఆదాయం...

 విద్యుత్ డిమాండ్ లేని సమయంలో 1,448 ఎంయూల విద్యుత్‌ను విక్రయించడం ద్వారా రూ. 724 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకుంటామని డిస్కంలు అంచనా వేశాయి. కారిడార్ అందుబాటులో ఉన్న దక్షిణాది రాష్ట్రాలకు మిగులు విద్యుత్‌ను యూనిట్‌కు రూ.4.09 చొప్పున విక్రయించాలని ఈఆర్‌సీ ఆదేశించింది.

 

 అనుమతికి మించి కొంటున్నారు...

 డిమాండ్ పెరిగినప్పుడు తాము అనుమతిచ్చిన దానికన్నా అధిక విద్యుత్‌ను డిస్కంలు మార్కెట్ నుంచి కొనుగోలు చేస్తున్నాయని ఈఆర్సీ పేర్కొంది. ఈ కొనుగోళ్లతో పడే భారాన్ని ప్రభుత్వమే భరించాలంటూ బహిరంగ విచారణలో వచ్చిన సూచనలపై స్పందన తెలపాలని డిస్కంలను కోరింది.

 

 గతేడాది 2000 ఎంయూల బ్యాకింగ్ డౌన్

 2015-16లో జెన్‌కో థర్మల్ ప్లాంట్ల ద్వారా 17,076 ఎంయూల విద్యుదుత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా 15,123 ఎంయూల ఉత్పత్తే జరిగింది. లక్ష్యంతో పోల్చితే 2వేల మిలియన్ యూనిట్లను బ్యాకింగ్ డౌన్ చేశారు. దీంతో జెన్‌కో వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 12 ఏళ్లలో ఎన్నడూ లేనట్లుగా 73.21%కు పతనమైంది. జెన్‌కో ప్లాంట్లను బ్యాకింగ్ డౌన్ చేసి స్వల్పకాలిక ఒప్పందాలతో విద్యుత్ కొనుగోళ్లను కొనసాగించడంతో వినియోగదారులపై రూ. 600 కోట్ల భారం పడిందని నిపుణులు అంచనా వేశారు. ఇది కేవలం జెన్‌కో ప్లాంట్ల బ్యాకింగ్ డౌన్ వల్ల పడిన భారం మాత్రమే. గతేడాది ఆశించిన రీతిలో డిమాండ్ లేకపోవడంతో దీర్ఘకాలిక పీపీఏలు కుదుర్చుకున్న ఎన్టీపీసీ ప్లాంట్లను సైతం బ్యాకింగ్ డౌన్ చేశారు.  

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top