మూడేళ్లుగా జంట పోలీసు కమిషనరేట్ పరిధిలో వరుస దోపిడీలు, దొంగతనాలకు బరితెగ్గించి.. తప్పించుకు తిరుగుతున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన గంజదొంగల ముఠా నగర సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులకు చిక్కారు.
హైదరాబాద్‌సిటీ : మూడేళ్లుగా జంట పోలీసు కమిషనరేట్ పరిధిలో వరుస దోపిడీలు, దొంగతనాలకు బరితెగ్గించి.. తప్పించుకు తిరుగుతున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన గంజదొంగల ముఠా నగర సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులకు చిక్కారు. సీసీఎస్ ప్రత్యేక పోలీసు బృందం ఉత్తరప్రదేశ్‌లోని వారి స్థావరంపై దాడి చేసి ముఠాకు చెందిన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి భారీ స్థాయిలో రికవరీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌కు చెందిన యూసుఫ్, రషీద్, నౌషాద్, రహీంలు ఒక ముఠాగా ఏర్పడ్డారు. గతంలో కూడా వీరు ఇళ్లలో దొంగతనాలు, దారీ దోపిడీలు, హత్యలకు పాల్పడి జైలుకెళ్లి వచ్చారు.
జైలు నుంచి వచ్చాక ఈ ముఠా సైబరాబాద్, నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో పలు నేరాలకు పాల్పడింది. మూడేళ్ల నుంచి వీరి కోసం జంట పోలీసు కమిషనరేట్లకు చెందిన సీసీఎస్ పోలీసులు గాలిస్తున్నారు. వీరి కోసం ప్రత్యేక బృందాలు గతంలో ఉత్తరప్రదేశ్‌కు వెళ్లి వాకబ్ చేసినా ఫలితం లేకుండా పోయింది. నగర సీసీఎస్ పోలీసులు వారిపై గట్టి నిఘాను పెంచారు. వారి కదలికలపై ఎప్పటికప్పుడు ఆరా తీయడం మొదలు పెట్టారు. రెండు నెలల నుంచి తీవ్రకసరత్తు చేయడంతో వారి ఫలితం ఫలించింది. ఇటీవలే ఓ దోపిడీకి పాల్పడిన ఈ ముఠా ఉత్తరప్రదేశ్‌కు వెళ్ళి విశ్రాంతి తీసుకుంది. ఇదే అదనుగా భావించిన సీసీఎస్ పోలీసులు చాకచక్యగంగా వారుటున్న నివాసాలపై మెరుపుదాడి చేసి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఇదే ముఠాకు చెందిన మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. ఈ నలుగురు నేరస్తులను సీసీఎస్ పోలీసులు విచారిస్తున్నారు. ఈ ముఠా ఇప్పటి వరకు వందకు పైగా నేరాలు చేసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. చోరీ సొత్తు భారీగానే రికవరీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.