రైతుల సమస్యలు పరిష్కరించండి | Sakshi
Sakshi News home page

రైతుల సమస్యలు పరిష్కరించండి

Published Fri, Oct 21 2016 2:15 AM

రైతుల సమస్యలు పరిష్కరించండి - Sakshi

సర్కారుకు వైఎస్సార్‌సీపీ తెలంగాణ శాఖ సూచన
వైఎస్ ముందుచూపు వల్లే
తెలంగాణ ప్రాజెక్టుల్లో పురోగతి
పార్టీ ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రచార ఆర్భాటాల కోసం సమీక్షలతో కాలం గడపకుండా రైతుల సమస్యలపై చర్చించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ డిమాండ్ చేసింది. సీఎం కేసీఆర్ మొదలుకుని హరీశ్‌రావు, కేటీఆర్ ఇతర మంత్రులు సమీక్షల పేరిట కాలం వెళ్లబుచ్చుతున్నారు తప్పించి, ప్రజలు ముఖ్యంగా రైతాంగం సమస్యల పరిష్కారానికి ఎలాంటి చొరవా తీసుకోవడం లేదంది. గురువారం పార్టీ ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ... రబీలో 31.90 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వకపోతే ఊరుకునేది లేదంటూ అధికారులతో సమీక్షలో హరీశ్‌రావు హెచ్చరించడం విడ్డూరంగా ఉందన్నారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ముందుచూపుతో తెలంగాణలో 36 ప్రాజెక్టులను ప్రారంభించారని, ఆయన హయాంలోనే 6 ప్రాజెక్టులను పూర్తి చేశారన్నారు. ప్రస్తుతం కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా ప్రాజెక్టులు జలకళతో ఉన్నాయంటే గతంలో వైఎస్ చేసిన కృషే కారణమన్నారు. అయితే ఇది తమ ఘనతగా చెప్పుకునేందుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఖరీఫ్‌లో ఏమైంది, ఎంత పంట వేశారు, ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇచ్చారు, రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులు ఏమిటీ అన్న దానిపై సమీక్ష నిర్వహించి ఉండాల్సిందన్నారు.

ఖరీఫ్‌లో రైతులకు రూ.17,489కోట్ల మేర కొత్త రుణాలు ఇవ్వాల్సిండగా, రూ.8.60వేల కోట్లు మాత్ర మే రుణాలు ఇచ్చారని చెప్పారు. ఈ కాలంలో 1.08 లక్షల ఎకరాల్లో పంట వేసేందుకు వ్యవసాయ నిపుణులు అంచనా వేసినా, అందులో 45 శాతం కూడా రైతులు పంటలు వేయలేకపోయారన్నారు. దీంతో పాటు రుణమాఫీ జరగక, కొత్త రుణాలు అందక, కల్తీ విత్తనాలతో కుదేలై అధిక వడ్డీతో అప్పులు తెచ్చి వేసిన పంటలు దెబ్బతిని రైతులకు రూ.2 వేల కోట్లు నష్టం వాటిల్లిందన్నారు.

ఈ అంశాలతో పాటు, కరువు మండలాల జాబితాను కేంద్రానికి పంపించడం, హరితహారం పేరిట పోడు భూముల నుంచి ఎస్సీ, ఎస్టీ రైతులను వెళ్లగొట్టడంపై ఎలాంటి సమీక్షను ప్రభుత్వం నిర్వహించలేదని విమర్శించారు. మిషన్ కాకతీయపై ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని రాఘవరెడ్డి డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement