తైవాన్ విధానాలు అనుసరణీయం | jupally krishanrao statement on taiwan policies | Sakshi
Sakshi News home page

తైవాన్ విధానాలు అనుసరణీయం

Aug 29 2015 1:31 AM | Updated on Sep 3 2017 8:18 AM

తైవాన్ విధానాలు అనుసరణీయం

తైవాన్ విధానాలు అనుసరణీయం

తైవాన్‌లో పారిశ్రామికీకరణ, సంక్షేమ పథకాలు, అత్యున్నత మౌలిక వసతులతో కూడిన నగరాల నిర్మాణం మొదలైనవి రాష్ట్రానికి అనుసరణీయమని వాణిజ్య, పరిశ్రమలశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.

ఐటీసీఎఫ్ సమావేశంలో పరిశ్రమల మంత్రి జూపల్లి
తైపీ కంప్యూటర్స్ అసోసియేషన్‌తో ఐటీ ఒప్పందం
హైదరాబాద్: తైవాన్‌లో పారిశ్రామికీకరణ, సంక్షేమ పథకాలు, అత్యున్నత మౌలిక వసతులతో కూడిన నగరాల నిర్మాణం మొదలైనవి రాష్ట్రానికి అనుసరణీయమని వాణిజ్య, పరిశ్రమలశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. తెలంగాణతో పోలిస్తే మూడింట రెండో వంతు విస్తీర్ణంలో ఉన్న తైవాన్ భారత స్థూల జాతీయోత్పతిలో సగం మేర సాధించడం అద్భుతమని కొనియాడారు. నూతనంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం తైవాన్‌తో దృఢ బంధాన్ని ఏర్పరుచుకుంటుందని చెప్పారు. తైవాన్ కంపెనీల నుంచి పెట్టుబడుల కోసం రాష్ట్రంలో తైవాన్ డెస్క్ ఏర్పాటు చేయడంతోపాటు మాండరిన్ భాషలో దరఖాస్తులను అందుబాటులోకి తెస్తామన్నారు.

రాష్ట్ర ఐటీశాఖ సహకారంతో ఇండియా-తైపీ అసోసియేషన్ శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఇండియా తైవాన్ కోఆపరేషన్ ఫోరం (ఐటీ సీఎఫ్) సమావేశానికి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జూపల్లి సమక్షంలో తెలంగాణ ఐటీ శాఖ, తైపీ కంప్యూటర్స్ అసోసియేషన్ పరస్పర సహకార ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకున్నాయి. చైనా, తూర్పు ఆసియా దేశాల్లో తైవాన్‌కు చెందిన కంపెనీలు నెలకొన్నాయని, వాటికి ప్రత్యామ్నాయ వేదికగా తెలంగాణను తీర్చిదిద్దుతున్నట్లు జూపల్లి వెల్లడించారు. ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల మార్కెటింగ్‌కు భారత్ గమ్యస్థానంగా మారుతోందని, 2050 నాటికి అత్యధిక మానవవనరులున్న దేశంగా వృద్ధి చెందుతుందన్నారు. రాష్ట్రంలో టీఎస్ ఐపాస్ ద్వారా నిర్ణీత వ్యవధిలో పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు ఇస్తుండటాన్ని ఆయన ప్రస్తావించారు. నాలుగు వేలకుపైగా ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ సంస్థల సభ్యత్వం ఉన్న తైపీ కంప్యూటర్స్ అసోసియేషన్‌తో ఒప్పందం కుదుర్చుకోవడాన్ని జూపల్లి స్వాగతించారు.

పెట్టుబడులకు రాష్ట్రం అత్యంత అనువైనదని, అత్యున్నత సౌకర్యాలు కలిగిన హైదరాబాద్‌లో పెట్టుబడులకు అనేక కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయని తైపీ కంప్యూటర్స్ అసోసియేషన్ డైరక్టర్ జనరల్ డాక్టర్ డెన్నిస్ హూ పేర్కొన్నారు. గూగుల్, ఫేస్‌బుక్, అమెజాన్ వంటి అంతర్జాతీయ ఐటీ సంస్థలు హైదరాబాద్‌లో నెలకొనడం నగర ప్రతిష్టను ఇనుమడింప చేసిందన్నారు. సెప్టెంబర్‌లో ప్రారంభమయ్యే ‘టీ హబ్’తో పెట్టుబడులకు అవకాశాలు పెరుగుతాయని రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ వెల్లడించారు. సమావేశంలో తైపీ భారత విభాగ ఆర్థిక, సాంస్కృతిక కేంద్రం ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ డాక్టర్ జాన్‌లీ, అమెజాన్ పబ్లిక్ పాలసీ సీనియర్ మేనేజర్ మోహిత్ బన్సల్, అడ్వాన్‌టెక్ సేల్స్ మేనేజర్ డారీన్ చెన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement