
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి చెందిన 10 మంది డిప్యూటీ కలెక్టర్ల(డీసీ)లకు ఐఏఎస్ హోదా కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం డిప్యూటీ కలెక్టర్ హోదాలో ఉన్న కొర్రా లక్ష్మి, కె.ధర్మారెడ్డి, చిట్టెం లక్ష్మి, టి.వినయ్ కృష్ణారెడ్డి, సీహెచ్ శివలింగయ్య, వి.వెంకటేశ్వర్లు, ఎం.హనుమంతరావు, డి.అమయ్‌కుమార్, కె.హైమవతి, ఎం.హరితకు ఐఏఎస్ హోదా (కన్ఫర్డ్ ఐఏఎస్) కల్పిస్తూ సోమవారం కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల విభాగం నోటిఫికేషన్ జారీ చేసింది.
ప్రమోషన్ కోటాలో రాష్ట్ర కేడర్‌కు చెందిన ఐఏఎస్ ఖాళీల్లో వీరిని భర్తీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను పరిశీలించిన కేంద్రం ఈ ప్రమో షన్ల జాబితాలను విడుదల చేసింది. 2014 బ్యాచ్ ఖాళీలకు అర్హులెవరూ లేరని, అందుకే ఆ జాబితాను తయారు చేయలేదని సెలెక్షన్ కమిటీ ప్రకటించినట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. 2015 సంవత్సరపు ఖాళీల్లో కొర్రా లక్ష్మి, కె.ధర్మారెడ్డి, 2016 ఖాళీల్లో మిగతా 8 మందిని ఎంపిక చేసింది.
ఐఏఎస్ పదోన్నతులకు సంబం ధించి ఎ.వాణీప్రసాద్, వి.కరుణ, ఎం.ప్రశాంతి దాఖలు చేసిన కేసుల్లో కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (సీఏటీ) ఇచ్చిన తీర్పుపై కేంద్రం హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో సెలెక్షన్ కమిటీ సిఫారసులు హైకోర్టు ఇచ్చే తీర్పునకు లోబడి ఉంటాయని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. కాగా, కేంద్ర ఉత్తర్వులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం 10 మంది అధికారులకు ఐఏఎస్ హోదా కల్పిస్తూ గెజిట్‌లో పొందుపరిచినట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.