‘కొయినా’ నీళ్లు కృష్ణాకి మళ్లాలి | Harish rao about krishna river at National Conference | Sakshi
Sakshi News home page

‘కొయినా’ నీళ్లు కృష్ణాకి మళ్లాలి

May 23 2018 1:45 AM | Updated on May 23 2018 2:12 AM

Harish rao about krishna river at National Conference  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మహారాష్ట్ర ప్రభుత్వం కొయినా డ్యామ్‌లో విద్యుదుత్పత్తి చేస్తూ ఏటా వంద టీఎంసీల మేర నీటిని వృథాగా అరేబియన్‌ సముద్రంలో కలిపేస్తోందని, దీన్ని నిలువరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అభిప్రాయపడ్డారు. ఆ నీటిని కృష్ణా నదికి మళ్లించాలని, అలాచేస్తే దిగువన ఉన్న శ్రీశైలం, నాగార్జునసాగర్, జూరాల, ఆల్మట్టి, నారాయణపూర్‌ ద్వారా అంతకంటే ఎక్కువ విద్యుత్‌ను ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

దిగువ తెలంగాణలో రెండు నెలలకు మించి కృష్ణా జలాల ప్రవాహం ఉండటం లేదని, ఈ నేపథ్యంలో సముద్రంలో కలిసే నీటిని కట్టడి చేసి దిగువకు పారేలా చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని, ఈ అంశంపై మహారాష్ట్రతో చర్చలు జరగాలని, ఇండియా వాటర్‌ కౌన్సిల్‌ ఆ దిశగా కృషి చేయాలని సూచించారు. మంగళవారం ఖైరతాబాద్‌లోని ఇన్‌స్టిట్యూషన్‌ ఆఫ్‌ ఇంజనీర్స్‌లో తెలంగాణ జల వనరుల అభివృద్ధి సంస్థ, ఇండియా వాటర్‌ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో కృష్ణానది పునరుజ్జీవనం అనే అంశంపై జాతీయ సదస్సు జరిగింది.

జల వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ వి.ప్రకాశ్‌ అధ్యక్షతన జరిగిన సమావేశానికి మంత్రి హరీశ్‌తో పాటు మరో మంత్రి లక్ష్మారెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, వాటర్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా రాజేందర్‌సింగ్, వాటర్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా గవర్నర్‌ పృధ్వీరాజ్‌సింగ్, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు ప్రారంభోపన్యాసం చేశారు.

దిగువ రాష్ట్రాల్లో నీటి కొరత ఉన్న సమయంలో ఎగువ నుంచి నీటి ప్రవాహాలను దిగువకు వదిలేలా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అలా అయితేనే దిగువ రాష్ట్రాల తాగునీటి అవసరాలు తీరతాయని అన్నారు. ప్రస్తుతం ఏడాదిలో రెండు నెలలు కూడా కృష్ణానదిలో ప్రవాహాలు ఉండటం లేదని, ఈ నేపథ్యంలో ఉద్యమంలా కృష్ణా పునరుజ్జీవనం జరగాల్సిన అవసరం ఉందన్నారు.

వలసలు తగ్గినాయ్‌..
రాష్ట్రంలో సాగునీటికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని, ఇప్పటికే కృష్ణాజలాల వినియోగం కోసం పాలమూరు–రంగారెడ్డి, డిండి, తుమ్మిళ్ల వంటి ఎత్తిపోతల పథకాలు చేపట్టామని, కృష్ణా బేసిన్‌లో 6 వేలకు పైగా చెరువులను పునరుద్ధరించామని హరీశ్‌ తెలిపారు. నిర్మాణంలోని కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు వంటి ప్రాజెక్టులను పూర్తి చేసి 6.5 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చామని, దీంతో వలసలు తగ్గాయని చెప్పారు. చెరువుల పునరుద్ధరణతో భూగర్భ జలాలు పెరిగాయని, ఎరువుల వినియోగం తగ్గి, దిగుబడులు పెరిగాయని ఫలితంగా రైతుల స్వయం సమృద్ధి సాధ్యమైందని తెలిపారు.

గోదావరి నీటిని వినియోగంలోకి తెచ్చేలా కాళేశ్వరం ఎత్తిపోతల చేపట్టామని, దీనిద్వారా 37 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. నదులను రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని, దీనికి తెలంగాణలోనే బీజం పడటం తమకు గర్వంగా ఉందని చెప్పారు. మంత్రి లక్ష్మారెడ్డి మట్లాడుతూ, ప్రజలకు నీటిని అందించేందుకు మిషన్‌ భగీరథ వంటి కార్యక్రమం చేపట్టామని, దీంతో ఆరోగ్య తెలంగాణ సాధ్యమవుతుందన్నారు. నీటికున్న ప్రాధాన్యత ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలుసని, అందుకే ప్రతి నీటి చుక్కను వినియోగంలోకి తెచ్చేలా కృషి చేస్తున్నారన్నారు.  


పరీవాహక రాష్ట్రాలన్నీ నడుంబిగించాలి: రాజేందర్‌సింగ్‌
కృష్ణా నది పునరుజ్జీవనానికి పరీవాహకంలోని మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలన్నీ నడుం బిగించాలని రాజేందర్‌సింగ్‌ సూచించారు. పరీవాహక రాష్ట్రాల ప్రభుత్వాల సమన్వయంతో ఈ కార్యక్రమం జరగాలన్నారు. కొయినా డ్యామ్‌ నీటిని కృష్ణాలోకి మళ్లించగలిగితే నీటిని రీసైక్లింగ్‌ చేసినట్లవుతుందని, తద్వారా పర్యావరణ సమతుల్యత జరుగుతుందన్నారు.

తెలంగాణ చేపట్టిన మిషన్‌ కాకతీయ, భగీరథ దేశానికే ఆదర్శంగా నిలిచాయని, ఇందులో సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌ పాత్ర మరువలేనిదని కితాబిచ్చారు. కాగా, కొయినా డ్యామ్‌ నీరు అరేబియన్‌ సముద్రంలోకి వెళ్లకుండా కృష్ణా నదిలోకి మళ్లించేలా చూడాలని జాతీయ సదస్సు తీర్మానించింది. కృష్ణా నదిని పునరుజ్జీవనం చేసేందుకు అనునిత్యం ప్రభుత్వ శాఖలు, పౌర సమాజం మధ్య తరచు వ్యవస్థీకృత సంప్రదింపులు జరపాలని మరో తీర్మానం చేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement