koina daam
-
‘కొయినా’ నీళ్లు కృష్ణాకి మళ్లాలి
సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్ర ప్రభుత్వం కొయినా డ్యామ్‌లో విద్యుదుత్పత్తి చేస్తూ ఏటా వంద టీఎంసీల మేర నీటిని వృథాగా అరేబియన్ సముద్రంలో కలిపేస్తోందని, దీన్ని నిలువరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అభిప్రాయపడ్డారు. ఆ నీటిని కృష్ణా నదికి మళ్లించాలని, అలాచేస్తే దిగువన ఉన్న శ్రీశైలం, నాగార్జునసాగర్, జూరాల, ఆల్మట్టి, నారాయణపూర్ ద్వారా అంతకంటే ఎక్కువ విద్యుత్‌ను ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. దిగువ తెలంగాణలో రెండు నెలలకు మించి కృష్ణా జలాల ప్రవాహం ఉండటం లేదని, ఈ నేపథ్యంలో సముద్రంలో కలిసే నీటిని కట్టడి చేసి దిగువకు పారేలా చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని, ఈ అంశంపై మహారాష్ట్రతో చర్చలు జరగాలని, ఇండియా వాటర్ కౌన్సిల్ ఆ దిశగా కృషి చేయాలని సూచించారు. మంగళవారం ఖైరతాబాద్‌లోని ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్‌లో తెలంగాణ జల వనరుల అభివృద్ధి సంస్థ, ఇండియా వాటర్ కౌన్సిల్ ఆధ్వర్యంలో కృష్ణానది పునరుజ్జీవనం అనే అంశంపై జాతీయ సదస్సు జరిగింది. జల వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వి.ప్రకాశ్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి మంత్రి హరీశ్‌తో పాటు మరో మంత్రి లక్ష్మారెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేందర్‌సింగ్, వాటర్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గవర్నర్ పృధ్వీరాజ్‌సింగ్, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు ప్రారంభోపన్యాసం చేశారు. దిగువ రాష్ట్రాల్లో నీటి కొరత ఉన్న సమయంలో ఎగువ నుంచి నీటి ప్రవాహాలను దిగువకు వదిలేలా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అలా అయితేనే దిగువ రాష్ట్రాల తాగునీటి అవసరాలు తీరతాయని అన్నారు. ప్రస్తుతం ఏడాదిలో రెండు నెలలు కూడా కృష్ణానదిలో ప్రవాహాలు ఉండటం లేదని, ఈ నేపథ్యంలో ఉద్యమంలా కృష్ణా పునరుజ్జీవనం జరగాల్సిన అవసరం ఉందన్నారు. వలసలు తగ్గినాయ్.. రాష్ట్రంలో సాగునీటికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని, ఇప్పటికే కృష్ణాజలాల వినియోగం కోసం పాలమూరు–రంగారెడ్డి, డిండి, తుమ్మిళ్ల వంటి ఎత్తిపోతల పథకాలు చేపట్టామని, కృష్ణా బేసిన్లో 6 వేలకు పైగా చెరువులను పునరుద్ధరించామని హరీశ్ తెలిపారు. నిర్మాణంలోని కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు వంటి ప్రాజెక్టులను పూర్తి చేసి 6.5 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చామని, దీంతో వలసలు తగ్గాయని చెప్పారు. చెరువుల పునరుద్ధరణతో భూగర్భ జలాలు పెరిగాయని, ఎరువుల వినియోగం తగ్గి, దిగుబడులు పెరిగాయని ఫలితంగా రైతుల స్వయం సమృద్ధి సాధ్యమైందని తెలిపారు. గోదావరి నీటిని వినియోగంలోకి తెచ్చేలా కాళేశ్వరం ఎత్తిపోతల చేపట్టామని, దీనిద్వారా 37 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. నదులను రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని, దీనికి తెలంగాణలోనే బీజం పడటం తమకు గర్వంగా ఉందని చెప్పారు. మంత్రి లక్ష్మారెడ్డి మట్లాడుతూ, ప్రజలకు నీటిని అందించేందుకు మిషన్ భగీరథ వంటి కార్యక్రమం చేపట్టామని, దీంతో ఆరోగ్య తెలంగాణ సాధ్యమవుతుందన్నారు. నీటికున్న ప్రాధాన్యత ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలుసని, అందుకే ప్రతి నీటి చుక్కను వినియోగంలోకి తెచ్చేలా కృషి చేస్తున్నారన్నారు. పరీవాహక రాష్ట్రాలన్నీ నడుంబిగించాలి: రాజేందర్‌సింగ్ కృష్ణా నది పునరుజ్జీవనానికి పరీవాహకంలోని మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలన్నీ నడుం బిగించాలని రాజేందర్‌సింగ్ సూచించారు. పరీవాహక రాష్ట్రాల ప్రభుత్వాల సమన్వయంతో ఈ కార్యక్రమం జరగాలన్నారు. కొయినా డ్యామ్ నీటిని కృష్ణాలోకి మళ్లించగలిగితే నీటిని రీసైక్లింగ్ చేసినట్లవుతుందని, తద్వారా పర్యావరణ సమతుల్యత జరుగుతుందన్నారు. తెలంగాణ చేపట్టిన మిషన్ కాకతీయ, భగీరథ దేశానికే ఆదర్శంగా నిలిచాయని, ఇందులో సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ పాత్ర మరువలేనిదని కితాబిచ్చారు. కాగా, కొయినా డ్యామ్ నీరు అరేబియన్ సముద్రంలోకి వెళ్లకుండా కృష్ణా నదిలోకి మళ్లించేలా చూడాలని జాతీయ సదస్సు తీర్మానించింది. కృష్ణా నదిని పునరుజ్జీవనం చేసేందుకు అనునిత్యం ప్రభుత్వ శాఖలు, పౌర సమాజం మధ్య తరచు వ్యవస్థీకృత సంప్రదింపులు జరపాలని మరో తీర్మానం చేసింది. -
మంచినీళ్లు 'మహా' ప్రభో!
కృష్ణా బేసిన్లో తీవ్ర నీటి దుర్భిక్షం ► ఆశలన్నీ మహారాష్ట్ర పైనే పెట్టుకున్న సర్కారు ► అక్కడి కోయినా డ్యామ్ నుంచి నీళ్లు తెచ్చే ఆలోచన ► ఆ డ్యామ్‌లో చేస్తున్న విద్యుదుత్పత్తికి డబ్బులు చెల్లింపు ► దిగువకు నీరు వచ్చేలా కర్ణాటక సాయం కోసం సంప్రదింపులు ► సెప్టెంబర్ తర్వాతే ఓ నిర్ణయానికి రానున్న ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ బేసిన్లో నెలకొన్న తీవ్ర నీటి దుర్భిక్షం సర్కారును కలవరపెడుతోంది. ప్రస్తుత తాగునీటి డిమాండ్‌కు, సరఫరాకు మధ్య సమతుల్యత దెబ్బతిని మున్ముందు నీటి కొరత తప్పదన్న భయం ప్రభుత్వాన్ని కలవరపెడుతోంది. రాష్ట్ర ప్రాజెక్టుల్లో చుక్క నీరు చేరని ప్రస్తుత పరిస్థితే మరో ఇరవై రోజులు కొనసాగితే తాగునీటికి తీవ్ర ఇక్కట్లు తప్పవని భావిస్తున్న ప్రభుత్వం ఇందుకు ప్రత్యామ్నాయాలపై ఆలోచనలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఎగువ మహారాష్ట్రలోని కృష్ణా బేసిన్‌పై ఉన్న భారీ విద్యుదుత్పత్తి ప్రాజెక్టు కోయినా డ్యామ్ నుంచి నీటి విడుదలపై దృష్టి పెట్టింది. ఈ డ్యామ్‌లో విద్యుదుత్పత్తి కోసం వినియోగిస్తున్న జలాలను తాగునీటి అవసరాల నిమిత్తం రాష్ట్రానికి తీసుకొచ్చి, ఆ మేరకు విద్యుత్ కొనడానికి అయ్యే నిధులను మహారాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించే అంశమై ప్రభుత్వం ఆలోచనలు చేస్తోంది. ఇప్పటికే అక్కడ 2, 516 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవడం, డ్యామ్‌లో 80 శాతం మేర నీటి నిల్వలు ఉండటంతో మహారాష్ట్ర దీనిపై సానుకూలంగా స్పందించే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. వందేళ్ల దుర్భిక్షం పునరావృతం...! కృష్ణా బేసిన్లో మునుపెన్నడూ లేని రీతిలో నీటి ఎద్దడి నెలకొంది. సుమారు వందేళ్ల కిందట 1918-19లో మొత్తం కృష్ణా బేసిన్లో అత్యంత కనిష్టంగా 1,200 టీఎంసీల కంటే తక్కువగా నీరు వచ్చింది. ఇప్పుడు అంతకంటే తక్కువగా కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని బేసిన్లో కలపి మొత్తంగా 575 టీఎంసీల మేర మాత్రమే నీరు వచ్చింది. ఇందులో 260 టీఎంసీలు కర్ణాటక, 300 టీఎంసీలు మహారాష్ట్రంలో రాగా ఏపీ, తెలంగాణలో మొత్తంగా 15 టీఎంసీల నీరు మాత్రమే ప్రాజెక్టుల్లోకి వచ్చింది. మహారాష్ట్ర కృష్ణా సబ్ బేసిన్‌లోని 13 ప్రాజెక్టుల కింద గరిష్టంగా 3,048 మిల్లీమీటర్లు, కనిష్టంగా 145 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఇందులో కోయినా డ్యామ్ కింద జూన్ నుంచి ఇప్పటి వరకు 2,516 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో ప్రస్తుతం డ్యామ్‌లో 73 టీఎంసీల నీటి నిల్వ ఉంది. మిగతా ప్రాజెక్టుల్లోనూ 85 నుంచి 100 శాతం వరకు నీటి లభ్యత ఉంది. నీటి లభ్యత పుష్కలంగా ఉన్న దృష్ట్యా 1,960 మెగావాట్ల ఉత్పత్తి సామర్ధ్యం ఉన్న కొయినాలో విద్యుదుత్పత్తి చేస్తున్న మహారాష్ట్ర ఇప్పటివరకు 25 టీఎంసీల నీటిని వినియోగించింది. ఉత్పత్తికి వాడిన నీరు బేసిన్ దిగువకు రావాల్సి ఉన్నా, డ్యామ్ కట్టిన ప్రదేశం కారణంగా నీరంతా సముద్రంలోకి వెళుతోంది. మీకు విద్యుత్తు.. మాకు తాగు నీరు.. ఎగువన మహారాష్ట్ర కరెంట్ కోసం నీటిని వృథా చేస్తుంటే దిగువన తెలంగాణ ప్రాజెక్టుల్లో గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి. ఒక్క జూరాలలో మినహా సాగర్, శ్రీశైలంలో తీవ్ర నీటి కొరత ఉంది. మరో రెండు నెలల గడిస్తే రాష్ట్రంలో తాగునీటికి తీవ్ర ఇక్కట్లు ఎదురయ్యే పరిస్థితి ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొనే నీటి లభ్యత ఎక్కువగా ఉన్న కోయినా డ్యామ్‌పై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇక్కడ విద్యుదుత్పత్తి చేస్తున్న మొత్తానికి అవసరమయ్యే కరెంట్‌ను ప్రైవేటు కంపెనీల వద్ద మహారాష్ట్ర కొనుగోలు చేసేందుకు వీలుగా, అందుకు అవసరమయ్యే నిధులను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చి, విద్యుదుత్పత్తికి వినియోగించే నీటిని కోయినా నుంచి దిగువకు తీసుకురావాలని భావిస్తోంది. దీనిపై ఇప్పటికే ఒకట్రెండుసార్లు అధికారులతో సీఎం కేసీఆర్ చర్చించారు. మహారాష్ట్ర ఈ ప్రతిపాదనకు అంగీకరించేందుకు ప్రత్యేకంగా బృందాన్ని అక్కడకు పంపాలని, కేంద్రం సాయాన్ని తీసుకోవాలని నిర్ణయించారు. కోయినా నుంచి తెలంగాణలోని సాగర్‌కు సుమారు 600 కిలోమీటర్ల దూరం ఉండటం, మధ్యలో కర్ణాటక ప్రాజెక్టులను దాటి నీరు రావాల్సి ఉన్న దృష్ట్యా దీని సాధ్యాసాధ్యాలను పరిగణనలోకి తీసుకోవాలని కూడా సీఎం అధికారులకు సూచించినట్లుగా సమాచారం. నీటి తరలింపులో అవసరమైతే కర్ణాటకతోనూ చర్చలు జరపాల్సి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమైనట్లుగా తెలిసింది. సెప్టెంబర్ తర్వాత రాష్ట్ర ప్రాజెక్టుల్లో నీటి నిల్వ పరిస్థితులు, భవిష్యత్ తాగునీటి అవసరాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే కోయినా డ్యామ్ నుంచి నీటిని తీసుకునే అంశమై ఓ నిర్ణయానికి రావాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.