కల్వకుర్తి ఎత్తిపోతల పథకం సామర్థ్యాన్ని 25 టీఎంసీల నుంచి 40 టీఎంసీలకు పెంచుతూ తెలంగాణ చేసిన నిర్ణయాన్ని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు తప్పుపట్టింది.
సాక్షి, హైదరాబాద్: కల్వకుర్తి ఎత్తిపోతల పథకం సామర్థ్యాన్ని 25 టీఎంసీల నుంచి 40 టీఎంసీలకు పెంచుతూ తెలంగాణ చేసిన నిర్ణయాన్ని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు తప్పుపట్టింది. ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ ఫిర్యాదు చేసినట్లు.. దీనిపై వివరణ ఇవ్వాలని మంగళవారం తెలంగాణకు బోర్డు లేఖ రాసింది. ఈ లేఖతో పాటు ఏపీ ఫిర్యాదు లేఖ, గతేడాది సెప్టెంబర్ 8న సామర్థ్యం పెంచుతూ ప్రభుత్వమిచ్చిన జీవో 141 ప్రతిని జత చేసింది.
గతంలో నిర్ణయించిన 25 టీఎంసీలతో 3.65 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం సాధ్యం కానందునే సామర్థ్యాన్ని 40 టీఎంసీలకు పెంచినట్లు ఇప్పటికే రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు వివరణ ఇచ్చారు. కల్వకుర్తి ద్వారా 2 టీఎంసీలు మంచినీటికి, మరో 1.5 టీఎంసీల నీరు ఆవిరై పోతున్నందున.. మిగిలే 21.5 టీఎంసీలతో కేవలం 2.15 లక్షల ఎకరాలకు మాత్రమే నీరివ్వొచ్చని, నిర్ణీత ఆయకట్టుకు నీరివ్వాలంటే 40 టీఎంసీలు అవసరమని ఆయన వివరించారు.