పోలీస్‌ శాఖలో ‘నయీమ్‌’ వార్‌ | Gangster Nayeem case Affidavit issue in Home and Police Department | Sakshi
Sakshi News home page

పోలీస్‌ శాఖలో ‘నయీమ్‌’ వార్‌

Jan 3 2017 2:11 AM | Updated on Sep 5 2017 12:12 AM

పోలీస్‌ శాఖలో ‘నయీమ్‌’ వార్‌

పోలీస్‌ శాఖలో ‘నయీమ్‌’ వార్‌

పోలీస్‌ శాఖలో నయీమ్‌ వ్యవహారం దుమారం రేపుతోంది.

అధికారుల మధ్య ‘అఫిడవిట్‌’ రగడ
మాకు తెలియకుండానే అఫిడవిట్‌ తయారైంది
కనీస సమాచారం కూడా లేదంటున్న పోలీసు ఉన్నతాధికారులు
హోం, పోలీస్‌ శాఖ మధ్య కోల్డ్‌వార్‌


సాక్షి, హైదరాబాద్‌ : పోలీస్‌ శాఖలో నయీమ్‌ వ్యవహారం దుమారం రేపుతోంది. నాలుగు రోజుల క్రితం నయీమ్‌ కేసులో హోంశాఖ దాఖలు చేసిన అఫిడవిట్‌పై వాడివేడిగా చర్చ జరుగుతోంది. పోలీస్‌ శాఖలో కీలక అధికారులకు కూడా తెలియకుండా అఫిడవిట్‌ రూపొందిందని, కేవలం అధికారిక సంతకం కోసం మాత్రమే ఉన్నతాధికారులకు అఫిడవిట్‌ కాపీ చేరినట్టు చర్చ జరుగుతోంది. సాధారణంగా న్యాయస్థానాల్లో పోలీస్‌ శాఖకు సంబంధించిన కేసుల్లో అఫిడవిట్‌ వేసే సందర్భాల్లో.. ఉన్నతాధికారులు, న్యాయశాఖ అధికారులు చర్చిస్తారు. ప్రభుత్వ నిర్ణయాన్ని కౌంటర్‌ అఫిడవిట్‌లో పేర్కొంటారు. కానీ ఇక్కడ అలాంటి కార్యక్రమాలేవీ జరగలేదని పోలీసు శాఖలోని ఉన్నతాధికారులు అభిప్రాయపడ్డారు. తమకు కనీస సమాచారం కూడా లేదని, అఫిడవిట్‌ వివరాలు మీడియాలో చూసిన తర్వాతే తెలిసిందని కీలక అధికారి ఒకరు పేర్కొన్నారు.

దర్యాప్తు జరుగుతుండగానే..
నయీమ్‌ కేసులో రాజకీయ నేతలు, పోలీస్‌ అధికారులు, ఇతరత్రా పెద్దలున్నారన్న వార్తలు మొదట్లో షికార్లు చేశాయి. కేసులో చోటామోటా అధికారులకు సాక్షులుగా నోటీసులిచ్చి సిట్‌ విచారించింది. డీఎస్పీ స్థాయి అధికారుల వరకు వివరాలు రాబట్టింది. రాజకీయ నాయకుల విషయంలోనూ కొంత వరకు విచారణ చేసింది. ఇదే సమయంలో సీపీఐ నేత నారాయణ నయీమ్‌ కేసును సీబీఐకి బదిలీ చేయాలని కోరుతూ హైకోర్టు తలుపుతట్టారు. ఆ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది.

కంగుతిన్న అధికారులు
న్యాయస్థానం ఆదేశం మేరకు హోంశాఖ కౌంటర్‌ దాఖలు చేసింది. ఈ అఫిడవిట్‌లో ఉన్న వివరాలు, కొంత మంది అధికారులు, రాజకీయ నాయకులకు తీపి కబురుగా అనిపించినా పోలీస్‌ ఉన్నతాధికారుల్లో మాత్రం ఆగ్రహం రగిలేలా చేసిందని పోలీస్‌ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. నయీమ్‌ కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులకు సైతం ఈ అఫిడవిట్‌లోని అంశాలు కంగు తినిపించాయని, పోలీస్‌ శాఖలో పెద్దతలలుగా చెప్పుకుంటున్న వారు కూడా ఈ అఫిడవిట్‌ వార్తతో షాక్‌ తిన్నట్టు చర్చించుకుంటున్నారు.

మొదలైన అసహనం
హోంశాఖ అధికారులు, పోలీస్‌ ఉన్నతాధికారుల మధ్య ప్రస్తుతం బయటపడని అసహనం వ్యక్తమవుతోంది. అఫిడవిట్‌ అంశాలపై ఆరా తీయగా ఆ విషయంపై తమకెలాంటి సమాచారం లేదని కొందరు, హోంశాఖ అధికారులకే అంతా తెలుసని మరికొందరు చెబుతున్నారు. దీంతో ఈ రెండు విభాగాల మధ్య అంతరం పెరిగినట్టుగా చర్చ సాగుతోంది. అఫిడవిట్‌ అంశంపై తమకు కనీసం సమాచారం చెప్పకపోవడంపై పోలీసు ఉన్నతాధికారులు హోంశాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేసినట్టు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement