breaking news
Telangana Home Department
-
కానిస్టేబుల్ ఫలితాలపై విచారణ వాయిదా
సాక్షి, హైదరాబాద్: కానిస్టేబుల్ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. కట్ ఆఫ్ కంటే ఎక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థులను ఎంపిక చేయలేదని పిటిషనర్ వాదనలు వినిపించారు. అయితే కానిస్టేబుల్స్ నియామక ప్రక్రియ సక్రమంగానే జరిగిందని, ఫలితాల్లో ఎలాంటి అవకతవకలు చోటుచేసుకోలేదని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు న్యాయ స్థానానికి తెలిపింది. అంతా పారదర్శకంగానే నిర్వహించామంటూ ఫలితాల వివరాలను కౌంటర్ ద్వారా కోర్టుకు సమర్పించింది. ఇరు వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి(అక్టోబర్ 29) వాయిదా వేసింది. కాగా కానిస్టేబుల్ ఫలితాల్లో అవకతవకలు జరిగాయంటూ అక్టోబర్ 1న అభ్యర్థులు కోర్టు మెట్లెక్కిన విషయం తెలిసిందే. -
కానిస్టేబుల్ ఫలితాలపై హైకోర్టును ఆశ్రయించిన అభ్యర్థులు
సాక్షి, హైదరాబాద్ : ఇటీవల వెల్లడించిన కానిస్టేబుల్ ఫలితాలలో అవకతవకలు జరిగాయంటూ అభ్యర్థులు మంగళవారం హైకోర్టును ఆశ్రయించారు. కటాఫ్ మార్కుల కంటే ఎక్కువ మార్కులు వచ్చినా ఉద్యోగాలు రాలేదని అభ్యర్థులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌ను విచారించిన హైకోర్టు కానిస్టేబుల్ ఫలితాలకు సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలని తెలంగాణ హోంశాఖను ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను అక్టోబరు 15కు వాయిదా వేసింది. -
పోలీస్ శాఖలో ‘నయీమ్’ వార్
-
పోలీస్ శాఖలో ‘నయీమ్’ వార్
► అధికారుల మధ్య ‘అఫిడవిట్’ రగడ ► మాకు తెలియకుండానే అఫిడవిట్ తయారైంది ► కనీస సమాచారం కూడా లేదంటున్న పోలీసు ఉన్నతాధికారులు ► హోం, పోలీస్ శాఖ మధ్య కోల్డ్‌వార్ సాక్షి, హైదరాబాద్ : పోలీస్ శాఖలో నయీమ్ వ్యవహారం దుమారం రేపుతోంది. నాలుగు రోజుల క్రితం నయీమ్ కేసులో హోంశాఖ దాఖలు చేసిన అఫిడవిట్‌పై వాడివేడిగా చర్చ జరుగుతోంది. పోలీస్ శాఖలో కీలక అధికారులకు కూడా తెలియకుండా అఫిడవిట్ రూపొందిందని, కేవలం అధికారిక సంతకం కోసం మాత్రమే ఉన్నతాధికారులకు అఫిడవిట్ కాపీ చేరినట్టు చర్చ జరుగుతోంది. సాధారణంగా న్యాయస్థానాల్లో పోలీస్ శాఖకు సంబంధించిన కేసుల్లో అఫిడవిట్ వేసే సందర్భాల్లో.. ఉన్నతాధికారులు, న్యాయశాఖ అధికారులు చర్చిస్తారు. ప్రభుత్వ నిర్ణయాన్ని కౌంటర్ అఫిడవిట్లో పేర్కొంటారు. కానీ ఇక్కడ అలాంటి కార్యక్రమాలేవీ జరగలేదని పోలీసు శాఖలోని ఉన్నతాధికారులు అభిప్రాయపడ్డారు. తమకు కనీస సమాచారం కూడా లేదని, అఫిడవిట్ వివరాలు మీడియాలో చూసిన తర్వాతే తెలిసిందని కీలక అధికారి ఒకరు పేర్కొన్నారు. దర్యాప్తు జరుగుతుండగానే.. నయీమ్ కేసులో రాజకీయ నేతలు, పోలీస్ అధికారులు, ఇతరత్రా పెద్దలున్నారన్న వార్తలు మొదట్లో షికార్లు చేశాయి. కేసులో చోటామోటా అధికారులకు సాక్షులుగా నోటీసులిచ్చి సిట్ విచారించింది. డీఎస్పీ స్థాయి అధికారుల వరకు వివరాలు రాబట్టింది. రాజకీయ నాయకుల విషయంలోనూ కొంత వరకు విచారణ చేసింది. ఇదే సమయంలో సీపీఐ నేత నారాయణ నయీమ్ కేసును సీబీఐకి బదిలీ చేయాలని కోరుతూ హైకోర్టు తలుపుతట్టారు. ఆ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. కంగుతిన్న అధికారులు న్యాయస్థానం ఆదేశం మేరకు హోంశాఖ కౌంటర్ దాఖలు చేసింది. ఈ అఫిడవిట్లో ఉన్న వివరాలు, కొంత మంది అధికారులు, రాజకీయ నాయకులకు తీపి కబురుగా అనిపించినా పోలీస్ ఉన్నతాధికారుల్లో మాత్రం ఆగ్రహం రగిలేలా చేసిందని పోలీస్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. నయీమ్ కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులకు సైతం ఈ అఫిడవిట్‌లోని అంశాలు కంగు తినిపించాయని, పోలీస్ శాఖలో పెద్దతలలుగా చెప్పుకుంటున్న వారు కూడా ఈ అఫిడవిట్ వార్తతో షాక్ తిన్నట్టు చర్చించుకుంటున్నారు. మొదలైన అసహనం హోంశాఖ అధికారులు, పోలీస్ ఉన్నతాధికారుల మధ్య ప్రస్తుతం బయటపడని అసహనం వ్యక్తమవుతోంది. అఫిడవిట్ అంశాలపై ఆరా తీయగా ఆ విషయంపై తమకెలాంటి సమాచారం లేదని కొందరు, హోంశాఖ అధికారులకే అంతా తెలుసని మరికొందరు చెబుతున్నారు. దీంతో ఈ రెండు విభాగాల మధ్య అంతరం పెరిగినట్టుగా చర్చ సాగుతోంది. అఫిడవిట్ అంశంపై తమకు కనీసం సమాచారం చెప్పకపోవడంపై పోలీసు ఉన్నతాధికారులు హోంశాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేసినట్టు తెలిసింది.