ఇక ఈజీగా పట్టేస్తారు...

ఇక ఈజీగా పట్టేస్తారు...


తప్పించుకు తిరుగుతున్న నేరగాళ్లకు చెక్

అందుబాటులోకి ఫేషియల్ రికగ్నైజేషన్ సాఫ్ట్‌వేర్

ప్రస్తుతం ఆఫ్‌లైన్‌లో, త్వరలో లైవ్ సెర్చ్‌లు సైతం

మిస్సింగ్ కేసులు కొలిక్కితెచ్చేందుకూ వినియోగం


 

సాక్షి, సిటీబ్యూరో: మలక్‌పేట పోలీసుస్టేషన్ పరిధిలో నమోదైన కేసుల్లో అరెస్టై, వారెంట్ల నేపథ్యంలో వాంటెడ్‌గా ఉన్న వ్యక్తి ఎస్సార్‌నగర్ పరిధిలో స్వేచ్ఛగా సంచరిస్తుంటాడు... అంబర్‌పేట ఠాణా పరిధి నుంచి ఉద్దేశపూర్వకంగా అదృశ్యమైన వ్యక్తి/మైనర్ గోల్కొండ పోలీసుస్టేషన్ పరిధిలో తిరుగుతుంటాడు... నగర జనాభా, పోలీసు విభాగంలో మౌలికవసతుల కొరత నేపథ్యంలో ప్రస్తుతం ఇలాంటి వారిని గుర్తించడం అధికారులకు సాధ్యం కావట్లేదు. ఈ తరహాకు చెందిన కేసుల్ని కొలిక్కితెచ్చేందుకు ఉపకరించే ఫేషియల్ రికగ్నైజేషన్ సాఫ్ట్‌వేర్‌ను నగర పోలీసు విభాగం సమీకరించుకుంది. ప్రస్తుతం ఆఫ్‌లైన్‌లో వినియోగిస్తున్నప్పటికీ రానున్న రోజుల్లో లైవ్‌సెర్చ్‌కు ఉపయుక్తంగా మార్చేలా ఐటీ సెల్ చర్యలు తీసుకుంటోంది.

‘లక్ష లక్ష్యం’ పక్కాగా సిద్ధించేందుకు...

రాజధానిలో 2019 నాటికి లక్ష సీసీ కెమెరాల ఏర్పాటు లక్ష్యంతో పోలీసు విభాగం ముందుకు వెళ్తోంది. వీటిలో 60 వేల కెమెరాలు నగర కమిషనరేట్ పరిధిలోనే ఏర్పాటుకానున్నాయి. ఓపక్క ప్రభుత్వం అందిస్తున్న నిధులు, మరోపక్క కమ్యూనిటీ ప్రాజెక్టు కింద వీటిని అందుబాటులోకి తీసుకువస్తున్నారు. వీటి ద్వారా నేర నిరోధం, కేసుల్ని త్వరితగతిన కొలిక్కి తీసుకురావడం పక్కాగా జరిపేందుకు సాఫ్ట్‌వేర్స్‌తో కూడిన సాంకేతిక పరిజ్ఞానాన్ని సైతం సమీకరించుకోడంపై పోలీసు విభాగం దృష్టిపెట్టింది. వాహనాల నెంబర్ ప్లేట్లను గుర్తించే ఆటోమేటిక్ నెంబర్‌ప్లేట్ రికగ్నైజేషన్ సిస్టం ట్రాఫిక్ విభాగం ఏర్పాటు చేస్తున్న ఐటీఎంఎస్ ప్రాజెక్టు ద్వారా సమకూరుతుండగా... ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టం సాఫ్ట్‌వేర్‌ను నెక్ సంస్థ నుంచి ఖరీదు చేశారు.

ప్రస్తుతం ఆఫ్‌లైన్‌లో వినియోగం...

ఈ సాఫ్ట్‌వేర్‌ను ప్రస్తుతం ఐటీ సెల్ అధికారులు ఆఫ్‌లైన్ విధానంలో వినియోగిస్తున్నారు. నగరంలోని వివిధ ఠాణా పరిధితో పాటు ఇతర ప్రాంతాల్లోనూ ఇప్పటికే అరెస్టు అయిన నిందితుల ఫొటోల డేటాబేస్‌ను రూపొందించారు. ఇవి నిక్షిప్తమై ఉన్న సర్వర్‌తో ఈ సాఫ్ట్‌వేర్‌ను అనుసంధానించారు. దీంతో నగరంలోని ఏ పోలీసుస్టేషన్, ప్రత్యేక విభాగానికి చెందిన అధికారులైనా ఓ వ్యక్తి ఫొటోను పంపి, గతంలో ఎక్కడైనా అరెస్టు అయ్యాడా? అనేది తెలపాలని ఐటీ సెల్‌ను కోరుతున్నారు. ఈ ఫొటోను సాఫ్ట్‌వేర్ ఆధారంగా సర్వర్‌లో సెర్చ్ చేసి అలాంటి వివరాలుంటే గుర్తించి తెలియజేస్తున్నారు. కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్‌లో చిక్కిన అనుమానితుల ఫొటోలనూ ఈ రకంగానే  సరిచూసి తదుపరి చర్యలు తీసుకుంటున్నారు.

భవిష్యత్తులో లైవ్‌సెర్చ్‌కు ఏర్పాట్లు...

ఫేషియల్ రికగ్నైజేషన్ సాఫ్ట్‌వేర్‌ను ఆన్‌లైన్‌లో ఉంచి లైవ్ సెర్చ్‌లు చేయడానికి ఐటీ సెల్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. నగర వ్యాప్తంగా ఉండే సీసీ కెమెరాలన్నీ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానించి ఉంటాయి. ప్రభుత్వం అందించనున్న నిధులతో అక్కడ ఉండే సర్వర్‌ను బలోపేతం చేయనున్నారు. ఆపై ఈ సాఫ్ట్‌వేర్‌ను సర్వర్ ద్వారా సీసీ కెమెరాలను అనుసంధానిస్తారు. ఇదే సర్వర్‌లో వాంటెడ్ వ్యక్తులు, పాత నేరగాళ్లు, మిస్సింగ్ కేసులకు సంబంధించి అదృశ్యమైన వారి ఫొటోలను నిక్షిప్తం చేస్తారు.ఫలితంగా నగరంలో ఏ సీసీ కెమెరా ముందు నుంచైనా ఆ వ్యక్తి కదలికలు ఉంటే సాఫ్ట్‌వేర్ ద్వారా గుర్తించే సర్వర్ తక్షణం కంట్రోల్ రూమ్ సిబ్బందిని అప్రమత్తం చేస్తుంది. ఫలానా వ్యక్తి, ఫలానా ప్రాంతంలో ఉన్న కెమెరా ముందు నుంచి వెళ్లాడనేది పాప్‌అప్ రూపంలో అక్కడి సిబ్బందికి తెలియజేస్తుంది. వారు క్షేత్రస్థాయి అధికారుల్ని అప్రమత్తం చేయడం ద్వారా తమకు ‘కావాల్సిన’ వారిని పట్టుకునే ఆస్కారం ఏర్పడుతుంది.

 

 

ఉన్నవాటిలో బెస్ట్ ఖరీదు చేశాం

‘ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న వాటిలో ఉత్తమమైన సాఫ్ట్‌వేర్ ఖరీదు చేశాం. అయితే దీనిలోనూ కొన్ని లోపాలు ఉన్నాయని గమనిస్తున్నాం. సీసీ కెమెరా ముందు ఫొటోలు ఉన్నట్లు స్పష్టంగా నిల్చుంటే మాత్రమే ఇది గుర్తించగలుగుతోంది. ప్రయోగాత్మకంగా అధ్యయనం తర్వాత లోపాలను గుర్తించి వాటిని అధిగమించే పరిజ్ఞానం సమకూర్చుకుంటాం’.    - ఐటీ సెల్ అధికారి

 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top