పునరుజ్జీవ’ పథక మోటార్లను పరిశీలించిన ఇంజనీర్లు | Sakshi
Sakshi News home page

పునరుజ్జీవ’ పథక మోటార్లను పరిశీలించిన ఇంజనీర్లు

Published Fri, Apr 20 2018 1:12 AM

engineers team in China - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకంలో వినియోగించనున్న మోటార్ల తయారీ, పనితీరును చైనా వెళ్లిన రాష్ట్ర ఇంజనీర్ల బృందం గురువారం పరిశీలించింది. నిర్ణీత ప్రామాణికాల మేరకు పంపుల తయారీ ఉన్నదీ లేనిదీ తనిఖీ చేసింది. ఈఎన్‌సీ అనిల్‌కుమార్, ఎత్తిపోతల పథకాల సలహాదారు పెంటారెడ్డి, తెలంగాణ జెన్‌కో ఇంజనీర్‌ వాసుదేవ్‌ చైనాలోని వుషి నగరంలో ఎస్‌ఈసీ కంపెనీలో తయారవుతున్న వర్క్‌షాప్‌ను రెండు గంటల పాటు పరిశీలించారు.

మోటారు పనితీరు సంతృప్తికరం గా, డిజైన్‌ స్పెసిఫికేషన్ల ప్రకారమే ఉన్నాయని పెంటారెడ్డి పేర్కొన్నారు. జూలై చివరి వరకు కనీసం మూడు పంపులు బిగించి నీటిని తోడవలసిన పరిస్థితి ఉందని, దానికి అనుగుణంగా పంపులు మోటార్ల సరఫరా జరగాలని పెంటారెడ్డి కంపెనీ ప్రతినిధులకు స్పష్టం చేశారు. మోటార్లు, పంపుల బిగింపు సమయంలో కంపెనీ ప్రతినిధులు తప్పనిసరిగా ఉండాలని వారికి సూచించారు.

వీటి సరఫరా తేదీలను నిర్ధారించాలని కోరారు. సాయంత్రం 6 గంటల వరకు అనేక సాంకేతిక అంశాలపై కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపామని అనిల్, పెంటారెడ్డి పేర్కొన్నారు. రెండు పంపు హౌస్‌లలో బిగించడానికి 6 మోటార్లు సిద్ధంగా ఉన్నాయని, జూన్‌ చివరికల్లా ప్రాజెక్టు ప్రదేశానికి వాటిని చేరుస్తామని కంపెనీ ప్రతినిధులు హామీ ఇచ్చినట్లు పెంటారెడ్డి తెలిపారు.

Advertisement
Advertisement