కృత్రిమ మేధకు కొత్త రెక్కలు!

Consumer electronics show - Sakshi

త్వరలో స్మార్ట్‌ఫోన్లలోనూ కృత్రిమ మేధ

కొత్త పుంతలు తొక్కుతున్న రోబోలు..

సీఈఎస్‌లో ఆసక్తి రేపుతున్న పలు ఉత్పత్తులు

కన్జూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ షో (సీఈఎస్‌) అమెరికాలో ఏటా వారం రోజుల పాటు జరిగే హైటెక్‌ ప్రదర్శన. టెక్‌ రంగంలో దిగ్గజాలైన కంపెనీలు తమ పరిశోధనల ఫలితాలను ఇక్కడ ప్రదర్శిస్తాయి. భవిష్యత్తులో రాబోయే వింతలకు ఈ ప్రదర్శనను సూచికగా చూస్తారు. ఈ ఏడాది ఇందులో దాదాపు 4 వేల కంపెనీలు పాల్గొన్నాయి. అందులో ప్రదర్శితమైన కొన్ని సాంకేతికతల వివరాలు మీకోసం.   –సాక్షి, హైదరాబాద్‌

అందరికీ అందుబాటులోకి ఏఐ!
కృత్రిమ మేధను నిన్న మొన్నటివరకూ సంక్లిష్టమైన సమస్యల పరిష్కారానికి వాడటం చూశాం. ఇకపై అలా ఉండదు.. వాచీల్లో, స్మార్ట్‌ఫోన్లలో, టీవీల్లో ఈ టెక్నాలజీ అందుబాటులోకి రానుంది. అమేజాన్‌ తన అలెక్సా వర్చువల్‌ అసిస్టెంట్‌ మొబైల్‌ కిట్‌ను డెవలపర్లకు అందుబాటులోకి తేనుంది.

గూగుల్‌ కూడా తన గూగుల్‌ అసిస్టెంట్‌ను ప్రజలకు మరింత దగ్గర చేసే పనులు మొదలుపెట్టింది. ఒకట్రెండేళ్లలో ఇవే టెక్నాలజీలు గొంతును గుర్తించి ఇంటి తాళాలూ తీసిపెట్టొచ్చు.. ఫలానా రోడ్డులో ట్రాఫిక్‌ ఎక్కువగా ఉందని, ఆఫీసుకు వేరే రోడ్డు ద్వారా వెళదామని మీ స్మార్ట్‌ఫోన్‌ నుంచే సూచనలు రావొచ్చు.

బాధ అర్థం చేసుకునే రోబోలు..
మీరు కష్టాల్లో ఉంటే.. మీ స్నేహితుడో.. బంధువో ఎలా ఓదారుస్తారో కొత్త రకం రోబోలు కూడా పరిస్థితికి తగ్గట్లు వ్యవహరిస్తూ మీకు సాంత్వన చేకూరుస్తాయి. ఎల్‌జీ కంపెనీ షాపింగ్‌ మాల్స్‌లో, హోటళ్లలో ఎయిర్‌పోర్టుల్లో ఉద్యోగాలకు ఎసరుపెట్టే స్థాయిలో సేవలందించగలవని అంచనా.

టైటాన్‌–ఏఐ రోబో మన ముఖ కవళికలను గుర్తించడమే కాకుండా అందుకు తగ్గట్లు స్పందిస్తుంది. కోపంగా ఉంటే ఇష్టమైన పాటలు వినిపిస్తుంది.. కామెడీ సీన్స్‌ చూపిస్తుంది. చెప్పిన పని చేసే రోబోలతో పోలిస్తే.. మనుషుల భావోద్వేగాలను అర్థం చేసుకునే రోబోలను తయారు చేయడం చాలా కష్టమని.. అయినా ఈ దిశగా చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని నిపుణులు అంటున్నారు.

కార్లకూ టెక్‌ హంగులు..
డ్రైవర్‌ రహిత కార్ల గురించి తరచూ వింటూనే ఉన్నా.. ఈ ఏడాది సీఈఎస్‌లో మరిన్ని కంపెనీలు ఇలాంటి వాటిని ముందుకు తీసుకొచ్చాయి. చైనీస్‌ కంపెనీ ‘బైటన్‌’ఓ ఎలక్ట్రిక్‌ కారును తీసుకొచ్చింది. హెన్రిక్‌ ఫిస్కర్‌ డిజైన్‌ చేసిన ఈ కారు ఖరీదు దాదాపు రూ.30 లక్షలు.

యమహా కంపెనీ డ్రైవర్‌ అవసరం లేని ఓ మోటర్‌బైక్‌ను ప్రదర్శించగా.. హ్యుందాయ్‌ ఫుయెల్‌సెల్‌ టెక్నాలజీతో పనిచేసే నెక్సోను ప్రదర్శనకు పెట్టింది. ప్రజా రవాణాతో పాటు రకరకాల అవసరాల కోసం ఒకే ప్లాట్‌ఫార్మ్‌ అనే కాన్సెప్ట్‌తో టయోటా ఓ సరికొత్త కాన్సెప్ట్‌ను ప్రదర్శించింది. చక్రాలు, ఛాసిస్‌ మాత్రమే స్థిరంగా ఉండే ఈ కాన్సెప్ట్‌లో పై భాగం అవసరాన్ని బట్టి మారుతుంటుంది.

వీఆర్‌పై లెనవూ ఫోకస్‌..
చైనీస్‌ కంప్యూటర్‌ తయారీ సంస్థ లెనవూ సీఈఎస్‌లో ప్రదర్శించిన ఉత్పత్తుల్లో అధికం వర్చువల్‌ రియాలిటీ (వీఆర్‌), ఆగ్యుమెంటెడ్‌ రియాలిటీ (ఏఆర్‌)లకు సంబంధించినవే. మిరేజ్‌ సోలో, డే డ్రీమ్‌ పేర్లతో విడుదలైన వ్యవస్థలతో వర్చువల్‌ కంటెంట్‌ను చాలా తేలికగా సృష్టించొచ్చు. ఫొటోలు, వీడియోల ఆధారంగా డే డ్రీమ్‌ ఈ కంటెంట్‌ను సృష్టిస్తుంది. పదేళ్ల కిందటి మీ పెళ్లి వీడియోను ఇందులోకి ఎక్కిస్తే.. మీరు అక్కడున్న అనుభూతి పొందుతూ వర్చువల్‌ రియాల్టీలో చూడొచ్చన్నమాట.

స్మార్ట్‌ఫోనే ల్యాప్‌టాప్‌..
ప్రాసెసింగ్‌ స్పీడ్‌ విషయంలో కంప్యూటర్లకు, స్మార్ట్‌ఫోన్లకు మధ్య అంతరం ఇప్పుడు దాదాపు లేదనే చెప్పాలి. ప్రాజెక్టు లిండా పేరుతో రేజర్‌ అనే కంపెనీ సీఈఎస్‌లో స్మార్ట్‌ఫోన్‌నే ల్యాప్‌టాప్‌గా ఎలా వాడుకోవచ్చో ప్రదర్శించింది. నిర్దిష్టమైన స్థానంలోకి చేర్చడం ద్వారా స్మార్ట్‌ఫోన్‌ తాలూకూ ప్రాసెసర్, సాఫ్ట్‌వేర్లతోనే ల్యాప్‌టాప్‌ తరహాలో పనిచేసుకునేందుకు వీలు కల్పిస్తుంది ఇది.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top