సెట్‌రైట్..అయ్యేనా..! | Anthem buses end to bancing | Sakshi
Sakshi News home page

సెట్‌రైట్..అయ్యేనా..!

Sep 13 2015 12:00 AM | Updated on Sep 3 2017 9:16 AM

సెట్‌రైట్..అయ్యేనా..!

సెట్‌రైట్..అయ్యేనా..!

కోఠి మీదుగా దిల్‌సుఖ్‌నగర్ నుంచి పటాన్‌చెరుకు వెళ్లే 5 బస్సులు వరుసగా ఉన్నాయి.

బస్సుల బంచింగ్‌కు చరమగీతం
అన్ని ప్రధాన రూట్ల రేషనలైజేషన్
నష్ట నివారణ చర్యలపై ఆర్టీసీ కసరత్తు
50 కంటే ఎక్కువ బస్సులు తిరిగే రూట్లపై సమగ్ర సర్వే
అక్టోబర్ నుంచి బస్సుల నిర్వహణలో మార్పులు

 
సిటీబ్యూరో :
సమయం    :     ఉదయం 8 గంటలు
స్థలం    :     కోఠి బస్టాప్
సందర్భం    :    కోఠి మీదుగా దిల్‌సుఖ్‌నగర్ నుంచి పటాన్‌చెరుకు వెళ్లే 5 బస్సులు వరుసగా ఉన్నాయి. అన్నీ ఒకే రూట్‌లో వెళ్లేవే. బండెనక బండి కట్టినట్లు బారులు తీరాయి. సుమారు 25 మంది ప్రయాణికులు అరగంటకు పైగా ఎదురు చూస్తున్నారు. ఒక్క బస్సు కూడా రాలేదు. కానీ సరిగ్గా ఎనిమిది గంటల సమయంలో అన్నీ ఒకేసారి కట్టకట్టుకొని వాలాయి. కేవలం ఒక్క నిమిషం వ్యవధిలో ఐదు బస్సులు....ప్రయాణికులంతా ఒక్క బస్సులోనే ఎక్కేశారు. మిగతా బస్సులు  ఖాళీగా వెళ్లాయి. ఆ ఒక్క రూట్‌లోనే కాదు. గ్రేటర్‌లోని అన్ని ప్రధాన రూట్లలోనూ బస్సుల బంచింగ్ తీవ్ర రూపం దాల్చింది. సమయపాలన లేదు. ఏ బస్సు ఏ సమయానికి వస్తుందో తెలియదు. డిపో మధ్య సమన్వయం ఉండదు. ఏ డిపోకు ఆ డిపో ఇష్టారాజ్యంగా బస్సులు నడుపుతున్నాయి. ప్రయాణికుల డిమాండ్‌కు,అవసరాలకు సంబంధం లేదు. దీంతో ఏళ్లుగా అస్తవ్యస్తంగా కొనసాగుతున్న బస్సుల నిర్వహణపై గ్రేటర్ ఆర్టీసీ దృష్టి సారించింది. బస్సుల బంచింగ్‌ను అరికట్టి  రూట్‌లను,సమయాన్ని క్రమబద్ధీకరించేందుకు భారీ క సరత్తుకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం అన్ని  ప్రధాన మార్గాల్లో  శాస్త్రీయమైన రూట్ సర్వే చేపట్టారు. అక్టోబర్ మొదటివారం నాటికి  బస్సుల నిర్వహణలో  పూర్తిస్థాయి మార్పులు తెచ్చే దిశగా రూట్ సర్వే ఫలితాలు అమల్లోకి వస్తాయని ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ పురుషోత్తమ్ నాయక్ ‘సాక్షి’తో చెప్పారు.

 50 బస్సులు దాటిన రూట్లపై అధ్యయనం
 ప్రయాణికుల రద్దీ అత్యధికంగా ఉండే కోఠీ-బీహెచ్‌సీఎల్, ఉప్పల్-కేపీహెచ్‌బీ వంటి రూట్లలో ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉండాలి. ఈ  రూట్లలో వివిధ డిపోల ద్వారా 50 నుంచి 100 వరకు బస్సులు రాకపోకలు సాగిస్తాయి. కానీ ఈ డిపోల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల 10 నిమిషాల వ్యవధి అనే నిబంధన అరగంట నుంచి గంటకు పెరిగిపోతుంది. అరగంటకు ఒక బస్సు నడవాల్సిన రూట్లలో  10 నిమిషాల్లోనే నాలుగు బస్సులు  నడుస్తాయి. ఇలా ఒకో డివిజనల్ మేనేజర్ పరిధిలో 50 బస్సులు దాటుతున్న 4 ప్రధానమైన రూట్లను ఎంపిక చేసి బస్సుల వేళలు, డిపోల మధ్య సమన్వయం కోసం చర్యలు తీసుకుంటున్నారు.

 నష్టాల నుంచి గట్టెక్కేందుకే...
 ఆర్టీసీకి తెలంగాణలో రూ.350 కోట్లకు పైగా నష్టాలు నమోదైతే, ఒక్క హైదరాబాద్‌లోనే సుమారు రూ.160 కోట్ల నష్టాలను చవి చూస్తోంది. ట్రిప్పుల రద్దు, ప్రయాణికులకు నమ్మకమైన, కచ్చితమైన సర్వీసులను అందజేయకపోవడం వల్ల ఆక్యుపెన్సీ రేషియో 72 శాతం నుంచి  68కి పడిపోయింది. ఈ ప్రతికూల పరిస్థితిని అధిగమించి, సంస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు రూట్ల రేషనలైజేషన్ దోహదం చేయగలదని ఆర్టీసీ అధికారుల అంచనా.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement