
వాటాకు టాటా
జీహెచ్‌ఎంసీ నుంచి అందాల్సిన ఆస్తిపన్ను వాటా విషయంలో జలమండలికి చుక్కెదురవుతోంది. గత ఐదేళ్లుగా పోరాడుతున్నా ఫలితం కనిపించడంలేదు.
=ఆస్తిపన్ను వాటా ఇవ్వని జీహెచ్‌ఎంసీ
= నిధుల్లేక నీరసించి పోతున్న జలమండలి
= అభివృద్ధి పనులకు విఘాతం
=రూ.750 కోట్లు పెండింగ్
సాక్షి,సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ నుంచి అందాల్సిన ఆస్తిపన్ను వాటా విషయంలో జలమండలికి చుక్కెదురవుతోంది. గత ఐదేళ్లుగా పోరాడుతున్నా ఫలితం కనిపించడంలేదు. స్వయంగా మున్సిపల్ పరిపాలనశాఖ 2009లో జారీచేసిన ఉత్తర్వులు(జీవోఎంఎస్.నెం.261,తేది:16.7.2009) సైతం అమలుకు నోచుకోకపోవడంతో మహానగరపాలక సంస్థ నుంచి రూ.750 కోట్లు రాబట్టు కోవడమెలాగో బోర్డువర్గాలకు అంతుబట్టడం లేదు. నెలకు రూ.29 కోట్ల లోటుతో నడుస్తున్న బోర్డుకు ఇది పెద్ద సమస్యగా మారింది. ప్రస్తుతం ఖజానా దివాళా అంచున పయనిస్తుండడంతో శివారు ప్రాంతాల్లో మంచినీటి సరఫరా నెట్‌వర్క్, స్టోరేజీ రిజర్వాయర్లు,మురుగునీటి పైప్‌లైన్లు ఏర్పాటు చేసే పనులు ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి.
విధులు పుష్కలం..నిధులు శూన్యం : గ్రేటర్ పరిధి,జనాభా ఇటీవలికాలంలో అనూహ్యంగా పెరిగాయి. ఆయా ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన మంచినీరు,మురుగునీటిపారుదల వ్యవస్థలు ఏర్పాటు చేయాల్సి వస్తోంది. కానీ నిధులు లేమిని సాకుగా చూపుతూ బోర్డు కాలంవెల్లదీస్తోంది. జలమండలికి నెలవారీగా నీటిబిల్లులు, మురుగుశిస్తు రూపేణా రూ.53 కోట్లు,నూతన కనెక్షన్లజారీతో రూ.6.50కోట్లు,ఇతరత్రా రూ.1.5 కోట్ల ఆదాయం వస్తోంది.
అంటే మొత్తంగా రూ. 61 కోట్ల ఆదాయం ఉందన్నమాట. నెలవారీగా విద్యుత్తుబిల్లు రూ.55 కోట్లు,ఉద్యోగుల జీతభత్యాలు రూ.20 కోట్లు,నిర్వహణ ఖర్చులు రూ.7 కోట్లు,పరిపాలన వ్యయం రూ.3 కోట్లు,గతంలో తీసుకున్న రుణాలకు సంబంధించి వడ్డీచెల్లింపులు, రుణవాయిదాలకు చేయాల్సిన వ్యయం రూ.5 కోట్లుగా ఉంది. అంటే మొత్తం వ్యయం రూ.90 కోట్లకు చేరుతోంది. ఆదాయానికి,వ్యయానికి మధ్య అంతరం రూ.29 కోట్లుగా ఉంది. నెలకు ఇంత భారీలోటుతో బోర్డు కనాకష్టంగా నెట్టుకొస్తుంది.
ఉత్తర్వులు బుట్టదాఖలు : జీహెచ్‌ఎంసీకి వస్తున్న ఆస్తిపన్నులో ఏటా రూ.25శాతం మేర జలమండలికి కేటాయించాలని స్పష్టంచేస్తూ మున్సిపల్ పరిపాలనశాఖ 2009 జూలై 16న జీవోఎం.ఎస్.నెం.261 జారీచేసింది. నాటి నుంచి 2013 డిసెంబరు వరకు ఆస్తిపన్ను వాటాగా సుమారు రూ.750 కోట్లు ఇవ్వాల్సి ఉంది. కానీ బల్దియా స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు మొండికేస్తుండడంతో పైసా విదల్చడంలేదు.