653 మందికిఒకే పోలీస్ | 653 people in the same police | Sakshi
Sakshi News home page

653 మందికిఒకే పోలీస్

Nov 9 2013 4:29 AM | Updated on Oct 16 2018 5:14 PM

నిబంధనల ప్రకారం ప్రతి 500 మంది జనాభాకు ఒక పోలీసులు (క్షేత్రస్థాయి సిబ్బంది) ఉండాలి. అయితే ప్రస్తుతం జంట కమిషనరేట్లలో ప్రతి 653 మందికీ ఒకరు మాత్రమే ఉంటున్నారు.

 

= వాస్తవానికి ప్రతి 500 మందికి ఒకరుండాలి
 = ఇతర మెట్రోలతో పోలిస్తే నగరంలో ఘోరం
 = భర్తీకి నిర్ణయం తీసుకున్నా అమలుకాని వైనం

 
సాక్షి, సిటీబ్యూరో: నిబంధనల ప్రకారం ప్రతి 500 మంది జనాభాకు ఒక పోలీసులు (క్షేత్రస్థాయి సిబ్బంది) ఉండాలి. అయితే ప్రస్తుతం జంట కమిషనరేట్లలో ప్రతి 653 మందికీ ఒకరు మాత్రమే ఉంటున్నారు. ఫలితంగా శాంతిభద్రతల నిర్వహణ, నేరాల నియంత్రణ కష్టసాధ్యంగా మారుతోంది. ఇటీవల కాలంలో నగరం దాదాపు రెట్టింపు అయినా ఆ స్థాయిలో ఎంపికలు లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. అనివార్య కారణాల నేపథ్యంలో కొన్నేళ్లుగా రిక్రూట్‌మెంట్స్ సైతం పక్కాగా జరగమపోవడమూ ఈ పరిస్థితిని దారితీసింది.

ఉన్నతాధికారులు, పర్యవేక్షణ అధికారుల కంటే  క్షేత్రస్థాయిలో కీలక ఉద్యోగులైన కానిస్టేబుల్ పోస్టుల్లోనే కొరత తీవ్రంగా ఉంది. పోలీసింగ్‌లో శాంతి భద్రతల పరిరక్షణ, నిఘా, దర్యాప్తు తదితర అంశాల్లో ఎస్సైల పాత్ర చాలా కీలకం. ప్రస్తుతం నెలకొన్న పరిణామాల నేపథ్యంలో జంట కమిషనరేట్లలో నైపుణ్యం కలిగిన ఎస్సైల లేమి తీవ్ర సమస్యగా మారింది. ఫలితంగానే ప్రతి చిన్న బందోబస్తుకూ బయటి నుంచి వచ్చే బలగాలు, ఆంధ్రప్రదేశ్ పోలీసు అకాడమీ (అప్పా) ట్రైనీలపై ఆధారపడాల్సి వస్తోంది.

కొన్నేళ్ల క్రితం కేటాయించిన సిబ్బందిలో దాదాపు 24 శాతం పోస్టులు ఖాళీగా ఉండిపోవడంతో మూడు షిప్టుల్లో (8 గంటల చొప్పున) పని చేయాల్సిన సిబ్బంది రెండు షిఫ్టుల్లో (12 గంటల చొప్పున) పని చేస్తున్నారు. దీంతో పని భారం పెరిగి, పనిలో నాణ్యత కొరవడుతోంది. ఫలితంగా సిబ్బంది ఆరోగ్యం పైనా తీవ్ర ప్రభావం చూపుతోంది.
 
ప్రతి విభాగంలోనూ అరకొరే...

 జంట కమిషనరేట్‌లోని ప్రతి విభాగంలోనూ సిబ్బంది కొరత ఉంది.  హైదరాబాద్‌తో పోలీస్తే సైబరాబాద్‌లో పరిస్థితి మరింత ఘోరం. ఈ కమిషనరేట్ నగరం చుట్టూ విస్తరించి ఉండటంతో ఉన్న సిబ్బంది ఏ మూలకూ సరిపోవడం లేదు. శాంతి భద్రతలు, ట్రాఫిక్, టాస్క్‌ఫోర్స్, స్పెషల్‌బ్రాంచ్, సిటీ సెక్యూరిటీ వింగ్, సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) ఇలా ప్రతి విభాగంలోనూ కానిస్టేబుల్ నుంచి ఎస్సైల వరకు వివిధ హోదాల్లో సిబ్బంది కొరత ఉంది. వీరి తర్వాత అత్యంత కీలకమైనవి కానిస్టేబుల్ పోస్టులు. వీటిలోనూ అనేక ఖాళీలు ఉండటంతో పరిపాలనా పరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వీటిని కొంత వరకు అధిగమించాలనే ఉద్దేశంతోనే రిటైర్డ్ పోలీసులనూ ప్రత్యేక పోలీసు అధికారులు (ఎస్పీఓ)లుగా తీసుకుంటున్నా... అ నివార్య కారణాల నేపథ్యంలో వీరిని కేవలం బందోబస్తు, భద్రత విధులకు మాత్రమే పరిమి తం కావడంతో పరిస్థితుల్లో మార్పు రాలేదు.
 
 చాలాకాలం అడ్డుపడిన ‘14 ఎఫ్’...


 రాష్ట్రంలో పరిస్థితిని సరాసరిన లెక్కేస్తే ప్రతి లక్ష జనాభాకు కేవలం 118 మంది పోలీసులు మాత్రమే ఉన్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నారు. ఇదే సిటీ విషయానికి వస్తే 256 మంది చొప్పున ఉన్నారు.రాష్ట్ర పోలీసు విభాగానికి కేటాయించిన సిబ్బంది  1.3 లక్షలు కాగా ప్రస్తుతం 97 వేలు మాత్రమే ఉన్నారు. ఈ పరిస్థితుల్ని అధిగమించేందుకు కొన్నేళ్ల క్రితం వివిధ స్థాయిల్లో 35,831 మంది ఎంపికకు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో ఇప్పటికి 12,891 పోస్టుల భర్తీ పూర్తి కాగా... మరో 16,323 పోస్టుల భర్తీ వివిధ దశల్లో ఉంది. ఇప్పటి వరకు జరిగిన ఎంపిక నుంచి సిటీ కమిషనరేట్‌కు ఒరిగింది ఏమీ లేదు. దీనికి ప్రధాన కారణం ఫ్రీజోన్ వివాదం. దీనిపై భిన్నవాదనలు వినిపిస్తుండటంతో రిక్రూట్‌మెంట్ ప్రక్రియ పూర్తిగా ఆగిపోయింది. హైదరాబాద్ ఫ్రీజ్ కాదంటూ అసెంబ్లీలో తీర్మానం జరిగి, కేంద్ర ద్వారా ‘14 ఎఫ్’ను తొలగించడానికి చాలా కాలం పట్టింది. ఇది పూర్తయిన తరవాత ఈ ఏడాదే 2500 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సన్నాహాలు పూర్తి చేశారు.
 
 మనకన్నా ‘మెట్రో’లే మిన్న...


 దేశంలో ఉన్న ఇతర మెట్రో నగరాలతో జంట కమిషనరేట్లను పోలిస్తే మనం ఆఖరి స్థాయిలో ఉన్నామని స్పష్టమవుతోంది. ఐదు నగరాలకు ఢిల్లీ మెరుగైన స్థానంలో ఉండగా... హైదరాబాద్ మాత్రం అధ్వాన స్థితిలో ఉంది. జంట కమిషనరేట్ల పరిధిలో నివసించే సిటీ జనాభా దాదాపు 85 లక్షలు వరకు ఉంది. అయితే సాయుధ బలగాలు, ఇతర ప్రత్యేక విభాగాలను మినహాయించగా రెండు కమిషనరేట్లలోనూ అందుబాటులో ఉన్న క్షేత్ర స్థాయి సిబ్బంది మాత్రం 13 వేలు దాటట్లేదు. ఉన్న వారినీ అనునిత్యం బందోబస్తులు వెంటాడుతూ ఉంటున్నాయి. ఇతర మెట్రో నగరాలు, ఇక్కడి పరిస్థితి ఇలా...
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement