ముంగిళ్లను ముద్దాడిన వైద్యం

Mallepally Laxmaiah Article On Buddha Purnima - Sakshi

కొత్త కోణం

‘‘బౌద్ధం ఒక మతం కాదు. అది ఒక సాధారణ జీవన విధానం మాత్రమే కాదు. అది ఒక నాగరికత. సమాజాన్ని మానవ పురోభివృద్ధివైపు నడిపించి, గతాన్ని సమూలంగా మార్చివేసే వ్యవస్థలను సృష్టించడం నాగరికత. అటువంటి చారిత్రక కర్తవ్యాన్ని బౌద్ధం స్వీకరించి, అమలు చేసి విజయం సాధించింది. అందువల్ల బౌద్ధం ఒక మత వ్యవస్థ కాదు. అది ఒక సంపూర్ణ విప్ల వాన్ని సాధించింది. అందువల్ల ఆ బౌద్ధాన్ని ప్రపంచానికి అందించిన గౌతముడు ఒక సామాజిక విప్లవకారుడు’’ బ్రిటిష్‌ చరిత్రకారుడు ట్రెవర్‌ లింగ్‌ బౌద్ధాన్ని నిర్వచించిన విధానమిది. ‘‘ది బుద్ధ’’అనే పుస్తకంలో ఈ విషయాలను వెల్లడించారు. అంతేకాకుండా, ఈ పుస్తకా నికి సబ్‌ టైటిల్‌గా ‘‘ది సోషల్‌ రెవల్యూషనరీ పొటెన్షియల్‌ ఆఫ్‌ బుద్ధిజం’’ అని చేర్చి తన అధ్యయనాన్ని ఆ దిశలో కొనసాగించారు. ట్రెవర్‌ లింగ్‌ రాసిన ఈ పుస్తకం, ఆయన చేసిన అధ్యయనం బౌద్ధం పైన ఒక సమగ్ర అవగాహనను అందిస్తుంది. 

నిజానికి ట్రెవర్‌ లింగ్‌ పేర్కొన్న విధంగానే బౌద్ధం ఆనాటి మానవ జీవితంలోని అన్ని రంగాలను సమూలంగా మార్చివేసింది. రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, వైద్య, విద్యారంగాల్లో మానవ జాతి గమనాన్ని ఎన్నెన్నో మార్పులకు గురిచేసింది. మరెన్నో మలుపులు తిప్పింది. రాజకీయ రంగంలో ఆనాటి రాజ్యాల పనితీరుని పునర్‌నిర్వచించింది. రాజు అంటే సేవకుడనీ, ప్రజాక్షేమమే పాలన అర్థమనీ, ప్రజాసంక్షేమమే పరమావధిగా భావించే అధికార యంత్రాంగాన్ని నిర్మించాలని బౌద్ధం ప్రతిపాదించింది. ప్రజల అభి ప్రాయాలకు, మనోభావాలకు ప్రాధాన్యత ఇచ్చి ప్రజలే కేంద్రంగా అభివృద్ధి జరగాలని బౌద్ధం ప్రతిపాదించింది. రాజు యజ్ఞ, యాగా లతో ప్రజల సొమ్మును బూడిదపాలు చేయకూడదనీ, ప్రజల్లో హేతు వాద భావాలను నింపాలని కూడా బౌద్ధం బోధించింది.

ఆనాడే అభివృద్ధి చెందుతోన్న వ్యవసాయానికి యజ్ఞ, యాగాల పేరుతో జరు గుతున్న జంతు బలులు తీవ్ర  అవరోధంగా ఉన్న విషయాన్ని బౌద్ధం బయటపెట్టింది. తద్వారా పరిపాలన వ్యవస్థలో ప్రగతిశీల మార్పు లకు బౌద్ధం పునాదులు వేసింది. సామ్రాట్‌ అశోకుడు, కనిష్కుడు, శ్రీహర్షుడు లాంటి వాళ్ళ పాలన బుద్ధుడి బోధనలకు కార్యరూపాన్ని చ్చింది. బుద్ధుడు కలగన్న  ప్రజారంజక పాలనకు నిలువుటద్దంలా నిలిచింది. అదేవిధంగా అప్పుడప్పుడే పుంజుకుంటున్న వృత్తులను ప్రోత్సహించి, వ్యాపార వాణిజ్య రంగాలకు అడ్డంకిగా ఉన్న ఛాందస భావాలను తోసిరాజన్నది మొట్టమొదట బౌద్ధమే. సరిగ్గా ఇదే వర్ణ వ్యవస్థను తిరస్కరించి, ప్రజలందరూ సమానమనే ఒక సమతాభావ నను పాదుకొల్పింది.

వీటన్నింటితో పాటు, ప్రజల జీవితంలో అనునిత్యం భాగమైన, అత్యంత కీలకమైన  వైద్యం కూడా ప్రజల ముంగిళ్ళను ముద్దాడింది బుద్ధుడి కాలంలోనే. అప్పటివరకు విడివిడిగా ప్రజలు తమకు తాముగా అనుసరిస్తున్న వైద్య వి«ధానం సమాజపరమైంది బౌద్ధం ఫలితంగానే. ముఖ్యంగా సాంప్రదాయక వైద్య విధానమైన ఆయుర్వే దానికి ఒక నిర్మాణాత్మక రూపమిచ్చి వైద్యం ప్రజాసేవలో ప్రధాన భాగమని గుర్తించి అమలు చేసిన ఘనత బౌద్ధానిదేననడంలో సందే హం లేదు.  వైద్య విధానాన్ని ఒక శాస్త్రీయ పద్ధతిలో క్రోడీకరించిన ఘనత ముమ్మాటికీ బౌద్ధానిదే. అప్పటి వరకు ఏదైనా జబ్బులు వస్తే, కొన్ని ఔషధాలు మాత్రమే ఉండేవి. అంతేకాకుండా దేవతలను పూజిస్తే అన్ని రోగాలు మాయమవుతాయనే అశాస్త్రీయ భావనలు రాజ్యమేలుతున్న కాలంలో బౌద్ధం తన శాస్త్రీయ వైద్యవిధానానికి శ్రీకారం చుట్టింది. బౌద్ధం ప్రధానంగా ఆరోగ్యాన్ని కేవలం శారీరక రుగ్మతగా చూడలేదు. మనస్సు, శరీరం, పరిసరాలు అన్ని కూడా స్వచ్ఛంగా ఉన్నప్పుడే ఆరోగ్యం సరిగ్గా ఉంటుందని బుద్ధుడు భావించి దాన్నే బోధించాడు. దానిని ఆయన బౌద్ధ బిక్కులకు బోధిం చిన వినయపిటకంలోని ఆరవ అధ్యాయంలో భైషజ్య స్కందంలో మనం చూడవచ్చు.

ప్రజల ఆరోగ్యానికి సూచనలతో పాటు, వైద్యాన్ని చాలా శాస్త్రీయంగా నిర్ధారించి, నిర్వచించారు. నిజానికి ఔషధాలను ప్రత్యేకంగా సూచిస్తూనే, ఆహారాన్ని సైతం ఔష«ధంగా చూడాలని చెబుతూనే వాటిని కొన్ని విధాలుగా విభజించారు. అందులో నెయ్యి, వెన్న, తేనె, నూనె, చక్కెరను బౌద్ధం ఆహారంగా చూడలేదు. వాటిని ఔషధాలుగా సూచించింది. జంతువుల కొవ్వును సైతం మరో ఔషదంగా బౌద్ధం పేర్కొన్నది. ముఖ్యంగా మూలికలను మంచి ఔషధా లుగా తేల్చింది. అందులో పసుపు, అల్లం, వస, తెల్లవస, అతివసలను శరీరంలో ఉన్న దోషాలను తొలగించే మహాద్భుత ఔషధాలని స్పష్టంగా పేర్కొన్నది. అదేవిధంగా కషాయాలు, ఆకులు కూడా ఔషధాలుగా భావించింది. వేపాకులు, కొడిశె ఆకులు, తులసి ఆకులు, పత్తి ఆకులు, పొట్ల ఆకులు కూడా రోగ నిర్మూలనకు పనికి వస్తాయని నిరూపించింది. ఇలా ఆ అ«ధ్యాయం నిండా మనకు వైద్య విధానం, ఔషధ వినియోగం అన్నింటినీ పొందుపరిచారు.

బుద్ధుడి కాలంలోనే జీవకుడు అనే వైద్యుడు ఆనాటి ఆధునిక వైద్య విధానాభివృద్ధికి ఎంతో కృషి చేశాడు. జీవకుడు మగధరాజు బింబిసారుడి ఆస్థాన వైద్యుడిగా మాత్రమే కాకుండా, గౌతమ బుద్ధుని అధికారిక వైద్యుడిగా ఉంటూ బౌద్ధం వ్యాప్తికి కృషి చేశాడు. వీటన్నింటితో పాటు ఆయుర్వేద వైద్యానికి అక్షర రూపమిచ్చిన మరో ఇద్దరు వైద్య పితామహులు మన చరిత్రలో ఉన్నారు. వారిలో ఒకరు చరకుడు, రెండోవాడు సుశ్రుతుడు. మనకు ఇప్పటి వరకు అందు బాటులో ఉన్న భారత ప్రాచీన వైద్య గ్రంథం చరక సంహిత. చరక సంహిత వినయ పిటకంలోని ఎన్నో అంశాలను తనలో పొందుపరుచు కున్నది. చరకుడు కూడా బౌద్ధ చక్రవర్తి కనిష్కుడి రాజ వైద్యుడు. అతడుæ నిత్యం సంచారిగా ఉంటూ ఉండేవాడని, ఎక్కడా నిలకడగా ఉండ కుండా నిత్యం ప్రజల్లో సంచరిస్తూ వైద్యాన్ని అందించాడని చరిత్ర కారులు చెబుతున్నారు. ఆ తర్వాత వచ్చే సుశ్రుతుడు, ఆయన తద నంతరం ఆయుర్వేదాన్ని అభివృద్ధి పరిచిన వాగ్బాటులు కూడా బౌద్ధ అనుయాయులేనని చరిత్రకారులు భావిస్తున్నారు.

ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న కరోనా లాంటి మహావిపత్తులు చరిత్రలో ఎన్నో. వాటిని ఎదుర్కొని ప్రజలను రక్షించిన ఉదాహరణలు బౌద్ధ చరిత్రలో కోకొల్లలు. క్రీస్తు శకం ఒకటవ శతాబ్దంలో తమిళ నాడులో జరిగిన ఒక సంఘటన మనకు బౌద్ధంలో ఇమిడిఉన్న ఉన్నతమైన మానవతా విలువలను పట్టిచూపుతుంది. తమిళనాడు లోని నాగపట్నం ప్రాంతంలో అంబిగామయి అనే బిక్కుని బౌద్ధ ప్రచారం చేస్తుండేది. ఆమె నిత్యం వేపచెట్టుకింద కూర్చుని ధ్యానం చేస్తుండేది. త్రిపిటకాలలో ఆమె పరిపూర్ణ జ్ఞానాన్ని సంపాదించింది. అందువల్ల ఆమె పట్ల ప్రజలకు గౌరవం ఉండేది. ఆ సమయంలో నాగ  పట్నంలో వర్షాలు లేక కరువు వచ్చింది. వాటివలన అంటురోగాలు ప్రబలాయి. వందలాది మంది మనుషులు ప్రాణాలు కోల్పోయారు. వేలాది పశువులు చనిపోయాయి.

ఆ సమయంలో ఆమె నాగపట్నం వెళ్ళి ‘‘మీరంతా ఆరోగ్యంగా ఉండాలంటే మీ మనస్సును, మీ ఇల్లును, ఊరునీ శుభ్రంగా ఉంచుకోవాలి.’’ అని చెప్పింది. గుగ్గిలం, మైసాచి, సాంభ్రాణి పొగలు వేయాలని, ప్రతి ఇంటికీ వేపాకు తోర ణాలు కట్టాలని వివరించింది. మనసు, దేహం, దేశం శుద్ధి చేసు కోవాలని చెప్పిన విషయమే తిరుమంత్రమైంది. పసుపు, కుంకుమ రాసుకోవాలని, ఇల్లును ఎర్ర మట్టితో అలకాలనీ, వాకిళ్ళలో అలుకు చల్లాలని, సుద్ద ముక్కతో ముగ్గులు పెట్టాలని, పసుపు, కుంకుమలను గడపలకు రాయాలని సూచించింది. ఈ సూచనలే కాకుండా, రోగు లకు చిరుధాన్యాలతో చేసిన అంబలి ఇవ్వాలని కూడా ప్రజలను ఆదేశించింది. దీనితో రోగాలు తగ్గుముఖం పట్టాయి. ఈ విషయాన్ని తమిళ పింగళి నిఘంటువు, జీవగ చింతామణి పుస్తకాలలో ఉన్నట్టు తమిళనాడు దళిత తాత్వికుడు ఆయోతీదాసు తన రచనల్లో పేర్కొన్నారు. 

అయితే బౌద్ధం సాంప్రదాయాల నుంచి కొన్ని విషయాలను తీసుకొని అభివృద్ధి చేసిన వైద్యం గుప్తుల కాలం వరకు కొనసాగింది. అయితే అక్కడ కూడా మేధోరంగంలో వచ్చిన బ్రాహ్మణాధిపత్యం వైద్యాన్ని కొన్ని కులాలకే పరిమితం చేసింది. అందుకే ఆ తర్వాత ఆయుర్వేదం పుస్తకాలకే పరిమితమై తన ప్రాధాన్యతను కోల్పో యింది. కింది కులాల ప్రజలు తమ సొంత వైద్యాన్ని సృష్టించుకొని జీవించారు. కానీ ఆయుర్వేద ఫలితాలను అందుకోలేకపోయారు. అందుకే ఈ రోజుకీ కూడా ఆయుర్వేదం అభివృద్ధి చెందకపోవడానికి కారణం కొందరి చేతుల్లో బందీ అవడం, వర్తమాన పరిస్థితులకు అనుగుణంగా పరిశోధనలు జరగని పరిస్థితిలో ఉండడమే. కాగా, ఈరోజు శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందిన అల్లోపతి వైద్యం కార్పొరేట్‌ చేతుల్లో చిక్కి, ప్రజలందరికీ కాకుండా, సంపన్నులకే ఫలితాలను ఇస్తున్నది. నిజానికి వైద్యం పుట్టింది సేవలో.. దానిని బౌద్ధం ఆచరించి చూపింది. అప్పుడు వర్ణ, కుల వ్యవస్థ, ఈ రోజు వర్గ, కుల వ్యవస్థలు వైద్యాన్ని సేవాభావం నుంచి మరల్చి లాభార్జనే లక్ష్యంగా మార్చివేశాయి. ప్రభుత్వాల ప్ర«థమ ప్రాధాన్యంగా ఉండా ల్సిన ఆరోగ్యం గాలిలో దీపంలా మారింది. డబ్బున్నవాడికే వైద్యం అందుతోంది. పేదవాడి కోపమే కాదు, నిరుపేదలకు అనారోగ్యం  కూడా శాపంగా మారింది. 

ఆనాడు మలేరియా అయినా, ఈనాటి కరోనా అయినా మురికి కూపాలుగా మారిన పేదల జీవితాల్లో పెద్దగా మార్పులేదు. క్వారం టైన్, లాక్‌డౌన్‌ లాంటి పెద్ద పెద్ద పదాలు వారికర్థం కావు. వారికర్థ మయ్యేదల్లా వారి తాతముత్తాతల కథల్లో, గా«థల్లో మిళితమైన వైద్యం, బౌద్ధం విప్పిచెప్పిన ఔషధ రహస్యం ప్రకృతిజీవనం. ఆ ప్రకృతినుంచి పుట్టిన పసుపు, వేప, తులసి లాంటి సహజ ఔషధతత్వాన్ని తిరిగి మన జీవితాల్లోకి ఆహ్వానిద్దాం. బౌద్ధం చూపిన మార్గాన్ని అను సరిద్దాం. వైద్యానికి అర్థం పరమార్థం సేవాభావమనే బుద్ధుడి నానుడిని ప్రచారం చేద్దాం.
(నేడు బుద్ధ పౌర్ణమి)


మల్లెపల్లి లక్ష్మయ్య
వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్‌ : 81063 22077

 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top