ఆయుధాలుంటే చాలదా, ఔషధాలెందుకు? | Madabhushi Sridhar Article On Corona Crisis In America | Sakshi
Sakshi News home page

ఆయుధాలుంటే చాలదా, ఔషధాలెందుకు?

Apr 10 2020 12:31 AM | Updated on Apr 10 2020 12:31 AM

Madabhushi Sridhar Article On Corona Crisis In America - Sakshi

ప్రపంచాన్ని గడగడలాడించే భయానక మారణాయుధాల సంపదలో అమెరికాకు అమెరికాయే సాటి. అణ్వస్త్రాలు ప్రయోగించి రెండున్నర లక్షల మానవులను హననం చేసిన ఘనచరిత్ర కూడా అమెరికాదే. అణ్వస్త్రాలకు పోటీ పెంచి, విశ్వ విధ్వంస రచన చేస్తున్న అమెరికా యుద్ధ, మార్కెట్‌ రాజకీయాల ఒత్తిడితో ప్రకృతి తల్లడిల్లిపోతున్నది. భూమండలం మీద ప్రకృతిని చాలా లోతుగా, విస్తారంగా, వేగంగా తన వ్యాపారానికి వినియోగించుకునే అతి పెద్ద అమానవీయ వ్యాపారి అమెరికా. రెండు ఖండాలు విస్తరించిన రాజ్యం. భారతదేశానికి మూడింతలు పెద్దభూభాగం. మనలో మూడోవంతు మాత్రమే జనం. ప్రపంచమంతా పెట్టుబడి, చేతి నిండా ఆయుధాలు, అణుబాంబులు, క్షిపణులతో పెద్ద మృత్యుబేహారి అమెరికా. 2018 ర్యాంకుల ప్రకారం అమెరికా మారణాయుధాలు అమ్ముకునే దేశాల్లో అగ్రస్థానంలో ఉంది. ఆ దేశం 10,508 మిలియన్‌ డాలర్ల ఆయుధాలు ఎగుమతి చేస్తుంది. రెండో స్థానం 6,409 డాలర్లు సంపాదించే రష్యాది. 1,040 డాలర్లతో చైనా ఏడో స్థానంలో ఉంది. 3. ఫ్రాన్స్‌ (1,768), 4. జర్మనీ (1,277), 5. స్పెయిన్‌ 1,188, 6. దక్షిణ కొరియా 1,083, 8. యునైటెడ్‌ కింగ్‌డమ్‌ 741, 9. ఇజ్రాయెల్‌ 707, 10. ఇటలీ (611) దేశాలు ఏటా మిలియన్లకొద్దీ డాలర్లు సంపాదిస్తున్నాయి.

మిగతా దేశాలు తిండికి లేకపోయినా, రోగాలు చంపుతున్నా, దారిద్య్రం నిరక్షరాస్యత, నిరుద్యోగంతో కొట్టుమిట్టాడుతున్నా, ఏవో కారణాల మీద ఆయుధాలు కొనుక్కుంటూ, యుద్ధాలు చేసుకుంటున్నాయి. దారిద్య్రాన్ని జయించలేని దరి ద్రులు, అందరికీ చదువుచెప్పలేని రాజమూర్ఖులు, దొంగమాటలు, మాయమాటలు చెప్పుకుంటూ, మతాలకు, కులాలకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వైషమ్యాలు పంచిపెడుతున్నాయి. చైతన్యవంతంగా ఉండవలసిన పౌరులు మెదళ్ల గూళ్లలో బూజు పెంచుకుంటూ, ఓట్లమ్ముకుంటూ, అబద్ధాల ఫేక్‌ న్యూస్‌ నమ్ముతూ, పాలకులకు భజన చేస్తూ ఉంటే, వాళ్ల ఓట్లతో అధికారంలోకి వచ్చి అమెరికా వంటి దేశాల దగ్గర ఆయుధాలు కొనుక్కుంటున్నాయి. ఆయుధ, వ్యాపారాలకు అగ్రరాజ్యాలు బానిసలైతే ఆ అగ్రరాజ్యానికి బానిసత్వం చేసే దేశాలు, వాటి బానిస పాలకులు, లోటు పూడ్చడానికి వేరే పార్టీల బానిస ఎంపీలను, ఎమ్మెల్యేలను కొనుక్కుంటూ, అంకెల ఆధిక్యతతో, స్వతంత్ర ప్రజాస్వామ్య పాలకులుగా చెలామణి అవుతున్నారు. వారి వల్ల దేశాలు అస్తిత్వం కోల్పోయి అగ్రరాజ్యాలకు బానిసలౌతున్నాయి. 

ప్రకృతిని డాలర్లుగా మార్చుకునే పెట్టుబడిలో, వ్యాపార తెలివితేటల్లో, ఆయుధ కండబలంలో అమెరికాకు ఎదురులేదు. అది అత్యంత సంపన్నదేశాల్లో ఒకటి. ప్రపంచాన్ని దారుణంగా కలుషితం చేసే పదింటిలో ముఖ్యమైంది. ప్రపంచంలో 15 శాతం మరణాలకు కాలుష్యం కారణం. ఆ తిలాపాపంలో అమెరికాదే సింహభాగం. యుద్ధాల్లో హింసలో కన్న 15 రెట్లు ఎక్కువ మంది కాలుష్యానికి చనిపోతున్నారు.  భారతదేశంలో అన్నిదేశాల్లో కన్న ఎక్కువగా– 23 లక్షల 26వేల 771 మంది కాలుష్యంతో మరణించారు. చైనా 18.6 లక్షలతో రెండో స్థానంలో ఉంది. వాయుకాలుష్యంలో అమెరికా ముందంజలో ఉంది. ఒబామా కాలంలో కాలుష్యం పెరుగుతూ పెరుగుతూ, ట్రంప్‌ వచ్చిన తరువాత ఇంకా విధ్వంసకరంగా పెరిగిందని 2019 అక్టోబర్‌లో ఒక అధ్యయనం  ప్రకటించింది.  ఇక ఎక్కువ కాలుష్యాన్ని పరిశ్రమల్లో ఉత్పత్తి లాగా పెంచి పంచుతున్న దేశాల్లో తొలి స్థానం చైనాది. ప్రపంచంలో 30 శాతం డయాక్సయిడ్‌లను చైనాలోని 5 రాష్ట్రాలు సరఫరా చేస్తున్నాయట. ఇక చైనా కాలుష్యంలో సగం అంటే  15 శాతం పంచుతూ అమెరికా రెండో స్థానంలో ఉంది. మనం చైనా, అమెరికా సూపర్‌ పవర్‌ పక్కన ఉంటామో లేదో గాని కాలుష్యంలో మాత్రం ఈ రెండు దేశాల తరువాత మూడోస్థానం మనదే అని 58 అంగుళాల ఛాతీ పెంచుకోవచ్చు. ప్రపంచంలో ఏడు శాతం కాలుష్యం మనమే ఉత్పత్తి చేస్తున్నాం. ప్రపంచం మొత్తం మీద 15 భయానక కాలుష్యనగరాలు ఉంటే అందులో 14 నగరాలు మనవే. మనం మహాన్‌ అనుకుని గర్వించవచ్చు. కాగా 5 శాతం కాలుష్యంతో రష్యా, 4 శాతంతో జపాన్‌ మన వెనకే. 

ఏలెక్కలో చూసినా అమెరికా చైనా అగ్రదేశాలే, చిన్నదేశాలమీద విరుచుకుపడే ఉగ్రదేశాలే. ప్రాణాలు తీసే ఆయుధ సంపత్తి పెంచుకున్నాయి, మందు (ఆల్కహాల్‌) ఉత్పత్తి పెంచుకున్నాయి కాని, రోగుల్ని బతికించుకునే మందులమీద దృష్టి పెట్టలేదు. క్లోరోక్విన్‌ కోసం భారత్‌ను అనేక దేశాలు అభ్యర్థిస్తున్నాయి. మనం ఎంత గొప్ప శాస్త్రవేత్తలమయినా దోమలను ఏమీ చేయలేం. దోమలు పంచే మలేరియా కోసం మందులు తయారు చేస్తున్నాం. ఆ విధంగా మనదేశంలో దోమలు, మలేరియా మందులు నిరంతరం వృద్ధి చెందుతున్నాయి. కరోనాకు  హైడ్రాక్సీ క్లోరోక్విన్, సరైన మందో కాదో తెలియకపోయినా, అది తప్ప మరో మందు పనిచేయడం లేదు కనుక, అందరికీ అవసరమైంది. ఇవ్వనంటే భారత్‌ను ట్రంప్‌ బెదిరించాడని వార్త ప్రచారంలో ఉంది. అతి తెలివి మీడియా వారు మసిపూసి మారేడుకాయ చేసారనే వార్త కూడా వచ్చింది. ఎప్పుడైనా మనిషికి కావలసింది బతికించే మందులు కాని, చంపేసే ఆయుధాలు, ‘మందు’ కాదని అమెరికా చైనా వంటి అగ్రరాజ్యాలతో బాటు మన నగరాల్లో మందుబాబులకు ఎప్పుడు తెలుస్తుందో ఏమో?

మాడభూషి శ్రీధర్‌
వ్యాసకర్త బెన్నెట్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్,
కేంద్ర సమాచార మాజీ కమిషనర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement