కోరిక తీరేనా? కొత్తగాలి వీచేనా?

Guest Column By Dileep Reddy - Sakshi

సమకాలీనం

లోకసభకు జరుగబోయే సార్వత్రిక ఎన్నికల ముంగిట్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్‌పై తీసుకున్న నిర్ణయం రాజకీయంగా నెరవేర్చే మేళ్లకన్నా దానివల్ల కలిగే సామాజిక ప్రయోజనాలు, కొత్తగా తలెత్తే సందేహాలే ప్రధానాంశాలవుతున్నాయి. తాజా ప్రతిపాదన దేశంలో న్యాయ, రాజకీయ, సామాజిక పరమైన ఏయే కొత్త వివాదాలకు దారితీస్తుందోనన్న భయాందోళనలు వ్యక్తమౌతున్నాయి. అనూహ్యంగా కేంద్ర ప్రభుత్వం కదిపిన ఈ తేనెతుట్టె ఎన్నికల్లో గెలవడమనే కోరికను తీరుస్తుందా లేక రిజర్వేషన్ల చిక్కుముడిపై కొత్తగాలి వీస్తుందా అనేది అసలు ప్రశ్న. ఈ అంశంపై చర్చ తప్పక కొనసాగుతుంది. పర్యవసానాలు వేచి చూడాల్సిందే.

అగ్రవర్ణ పేదల రిజర్వేషన్‌ ప్రతిపాదన స్థూలంగా మొత్తం రిజర్వేషన్ల అంశాన్నే మరో మారు చర్చకు పెట్టింది. ఒక్క నిర్ణయంతో తేనెతు ట్టెను కదిల్చినట్టయింది. కొన్ని దశాబ్దాలుగా సాగుతున్న రిజర్వేషన్‌ డిమాం డ్లు–ఉద్యమాలకు దీన్కొక పరిష్కారంగా చూపుతున్నా, సమాధానం లేని తాజా ప్రశ్నలెన్నింటికో ఆస్కారం కల్పిస్తోంది. కొత్త కోటాను సాధ్యపరిచే రాజ్యాంగ సవరణ బిల్లుకు ఆమోదం లభించినా, ఈ పది శాతం రిజర్వేషన్ల అమలు ఎలా ఉంటుందనే అంశమే ఉత్కంఠ రేపుతోంది. లోకసభకు జరుగ బోయే సార్వత్రిక ఎన్నికల ముంగిట్లో బీజేపీ నేతృత్వపు ఎన్డీయే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయంగా నెరవేర్చే మేళ్లకన్నా సామాజికంగా ఒనగూర్చబోయే ప్రయోజనాలు, కొత్తగా తలెత్తే సందేహాలే ప్రధానాంశాల వుతున్నాయి.

రిజర్వేషన్లపై ఇప్పటివరకూ ఏర్పడ్డ సందిగ్దతను, దురభిప్రా యాన్ని తొలగించే క్రమంలో ఇదొక ముందడుగని సమర్థించే వారున్నారు. దానికి భిన్నంగా, అసలు రిజర్వేషన్లను శాశ్వతంగా ఎత్తివేసే దిశలో ఇది దుందుడుకు చర్య అనే వారూ ఉన్నారు. అగ్రవర్ణ పేదలకు విద్య, ఉద్యో గాల్లో రిజర్వేషన్ల కల్పనకుద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటు ఉభయసభలు ఆమోదించడాన్ని సవాల్‌ చేస్తూ అత్యున్నత న్యాయస్థానంలో గురువారం ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) పడింది. తాజా ప్రతిపాదన దేశంలో న్యాయ, రాజకీయ, సామాజికపరమైన ఏయే కొత్త వివాదాలకు దారితీస్తుందోనన్న భయాందోళనలు వ్యక్తమౌతున్నాయి. ఇదే చర్చను రగి లిస్తోంది.

దాదాపు అన్ని ప్రధాన పార్టీలు తమ ‘రాజకీయ’విధానాలకు అనుగుణంగా ఉభయసభల్లో ఈ బిల్లుకు మద్దతిచ్చినా, బిల్లు తీసుకువచ్చిన తీరే బాగోలేదని విపక్షాల సన్నాయినొక్కులు. ఈ దిశలోనే... రాజకీయ, రాజ కీయేతర వర్గాల్లో తాజా రిజర్వేషన్‌ కోటాకు అనుకూల–ప్రతికూల చర్చ ఊపందుకుంటోంది. ప్రభుత్వ రంగంలో విద్య, ఉద్యోగావకాశాలు ఏ మేర కున్నాయి? అగ్రవర్ణాల్లో ఏయే కులాల జనాభా ఎంత? అందులో ఆర్థిక స్థితి గతులకు సంబంధించిన గణాంకాలున్నాయా? పేదరిక గణనకు విధించిన సంపద పరిమితులు హేతుబద్దమా? వీటన్నింటిపై సమగ్ర కసరత్తు జరి గిందా? అన్న ప్రశ్నలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి.

ప్రాతిపదికపైనే పంచాయతీ!
రిజర్వేషన్ల వర్తింపు ఏ ప్రాతిపదికన అన్నదే మొదట్నుంచి వివాదాస్పద అంశం. కులాల వారిగా రిజర్వేషన్లు ఇస్తూ, నిరంతరం దాన్ని సంరక్షిస్తూ కుల వ్యవస్థను, వివక్షను నిర్మూలించాలనడం ఓ అర్థరహిత చర్చ అనే వాదన ఉంది. రిజర్వేషన్లను గట్టిగా వ్యతిరేకించే వారు, ఉంటే గింటే అవి ఆర్థిక స్థితి గతుల ఆధారంగా ఉండాలంటారు. అగ్రవర్ణాల్లో పేదలు, దళిత–బలహీన వర్గాల్లో సంపన్నులు ఉన్నపుడు వర్గాల వారిగా రిజర్వేషన్లు తప్పని, ఆర్థిక స్థితిగతుల్ని బట్టి పేదలకు రిజర్వేషన్‌ వర్తింపజేయాలని, అదే సామాజిక న్యాయమని వీరంటారు. రిజర్వేషన్ల కారణంగా ప్రతిభ తిరస్కారానికి గుర వుతోందనే తమ వాదనకు ఈ అంశాన్ని జోడించి వేదికలపై హోరు ప్రసం గాలు చేస్తుంటారు.

బీజేపీ విధానాల్ని ప్రభావితం చేసే ఆరెస్సెస్‌ సిద్దాంత కర్తల వాదన మొదట్నుంచీ ఇదే! మరోవైపున పూర్తి విరుద్ద వాదన! సమా జంలోని కొన్ని వర్గాలే ప్రగతి ఫలాలు అనుభవించి, నిమ్నజాతి వర్గాలను అణచివేస్తూ సాగిన సుదీర్ఘ చరిత్ర తాలూకు తప్పిదాల్ని సరిదిద్దడానికే రిజర్వేషన్లని వీరంటారు. రాజ్యాంగం ప్రసాదించిన రిజర్వేషన్లను, వాటి కొనసాగింపును సమర్థించే వారి వాదన ఇది. సమాజంలో ఇప్పటికీ కొన సాగుతున్న ప్రత్యక్ష–పరోక్ష వివక్షను సమర్థంగా ఎదుర్కొనే ప్రతిచర్యే ఈ రిజర్వేషన్లని వీరంటారు. ఆర్థిక స్థితిగతుల్ని బట్టి రిజర్వేషన్లు కల్పించాలనే వాదనను వీరు వ్యతిరేకిస్తారు. వామపక్షీయులు దీనికి ప్రధాన మద్దతుదా రులు.

రాజ్యాంగ నిర్మాణ సమయంలోనూ ఈ చర్చ విస్తృతంగా సాగి, సామాజిక వర్గాల వారిగా రిజర్వేషన్లు కల్పించడానికే నాటి పెద్దలు మొగ్గారు. ఇది సున్నితమైన అంశమని, ఒకవైపు సమసమాజ స్థాపన మరోవైపు కుల నిర్మూలన... పరస్పర విరుద్ధ ప్రయోజనాల్ని నెరవేర్చాల్సి ఉంటుం దనేదీ వారి ఎరుకలోని అంశమే! రాజ్యాంగ నిర్మాణ కమిటీలో మెజారిటీ అగ్రవర్ణ ప్రముఖులే ఉన్నప్పటికీ నిర్ణయం అలా జరిగింది. రిజర్వేషన్ల వర్తింపునకు కేవలం ఆర్థిక స్థితిగతులు ప్రాతిపదిక కారాదనే వారలా నిర్ణయించారు.

 ‘రాజ్యాంగ స్ఫూర్తి’ని ఎక్కడ్నుంచి తీసుకోవాలి?
రిజర్వేషన్లు 50 శాతం దాటొద్దని రాజ్యాంగంలో ఎక్కడా లేదు. అయినప్ప టికీ సుప్రీంకోర్టు పరిమితి విధించింది. రాజ్యాంగ అధికరణాలు 15 (4), 16 (4)ను ఉటంకిస్తూ ‘ఇందిరా సహానీ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా’ కేసులో సుప్రీంకోర్టు ఈ మాట చెప్పింది. అప్పట్నుంచి ఎవరు, ఏ వర్గానికి రిజర్వేషన్లు పెంచాలన్నా, కొత్తగా కల్పించాలన్నా పరిమితికి లోబడాల్సి వస్తోంది. అన్ని రిజర్వేషన్లు కలిపి 50 శాతం దాటకుండా ఉండటం హేతు బద్దమని చెప్పిందే కానీ, అది 50 శాతమే ఎందుకో? ఏ 40 శాతమో, 60 శాతమో ఎందుకు కాకూడదో సుప్రీంకోర్టు చెప్పలేదు.

దీనిపై వివిధ స్థాయిల్లో లోతైన చర్చలే జరిగాయి. ఈ పరిమితిపై ఎన్నో అనుకూల, ప్రతి కూల వాదనలు వస్తున్నాయి. రాజ్యాంగంలోని ఏ అంశం ఈ ‘పరిమితి’ని నిర్దేశిస్తుందో న్యాయస్థానం చెప్పలేదు. కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే ఈ పరిమి తిని దాటాయి. ఇంకొన్ని రాష్ట్రాలు దాటేలా కొత్తగా రిజర్వేషన్లు ప్రతిపాదిస్తు న్నాయి. అందులో రెండు తెలుగు రాష్ట్రాలూ ఉన్నాయి. తమిళనాడు ఈ పరి మితిని దాటి రిజర్వేషన్లు (69శాతం) కల్పించినా ఒక ప్రత్యేక చర్య ద్వారా అవి చెల్లుబాటయ్యేలా చేసుకోగలిగింది.

సుప్రీంకోర్టు విధించిన పరిమితిని దాటొద్దని మద్రాస్‌ హైకోర్టు తిరస్కరించినపుడు, నాటి ముఖ్యమంత్రి జయ లలిత ప్రభుత్వం కేంద్ర సహకారంతో, న్యాయసమీక్షకు ఆస్కారం లేని విధంగా రాజ్యాంగాన్ని సవరింపజేసి, ఈ అంశాన్ని 9వ షెడ్యూల్‌లో పెట్టుకు న్నారు. ‘అయినా మేం సమీక్షిస్తాం, సమీక్షించగలమ’నే అర్థం వచ్చేలా ఒక సందర్భంలో సుప్రీం పేర్కొంది. ఇక ఈ అవకాశం తర్వాత ఏ ఇతర రాష్ట్రా లకూ కేంద్రం కల్పించలేదు. ఇప్పుడు స్వయంగా కేంద్రమే మరోమార్గంలో సుప్రీంకోర్టు విధించిన ఈ ‘పరిమితి’ని దాటేందుకు నిర్ణయించింది.

న్యాయస్థానం అంగీకరించేనా?
పేదలకు రిజర్వేషన్‌ కల్పించే విషయంలో కేంద్ర ప్రభుత్వం ముందుజా గ్రత్తతో వ్యవహరించింది. పార్లమెంటులో సదరు బిల్లు తీసుకురావడానికి ముందే రాజ్యాంగ సవరణకు సిద్దపడింది. దీన్ని ప్రత్యర్థి రాజకీయ పక్షాలేవీ వ్యతిరేకించలేవనే ధీమాతో సభల్లో అసరమైన మెజారిటీపై సందేహించ లేదు. అంతా అనుకున్నట్టే జరిగింది. కానీ, దీన్ని సుప్రీంకోర్టు అంగీకరి స్తుందా అన్నదే ప్రశ్న! రాజ్యాంగ అధికారణాలు 15, 16 ను సవరించడం ద్వారా కేంద్రమీ భూమిక సిద్దం చేసింది. ‘సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన...’ (అ:15) అన్న పదజాలానికి ‘ఆర్థికంగా వెనుకబడిన...’ అన్న పదాల్ని జతపరుస్తూ సవరణ ప్రతిపాదించారు.

ఇంకోచోట ‘ఎస్సీ, ఎస్టీలు...’ (అ:16) అన్న మాటలకు ‘ఈబీసీలు’ అనే పదం చేర్చడం మరో సవరణ. రాజ్యాంగాన్నే సవరిస్తున్నాం కనుక ఇప్పుడు సుప్రీం అభ్యంతరం చెప్పదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ అంటున్నారు. ‘అదేం కుదరదు, మాటల సవరణతో మాయజేసి, రిజర్వేషన్లను 50 శాతం దాటించి, రాజ్యాంగ స్ఫూర్తికే భంగం కలిగించారని సుప్రీంకోర్టు కొట్టివేయవచ్చ’నేది ప్రత్యర్థుల వాదన. అధికరణం 368 కింద ఇలాంటి మార్పులు చేసే అధి కారం పార్లమెంటుకు ఉందని ప్రభుత్వం చెబుతోంది.

అలా చేసే ఏ సవరణ యినా, రూపొందించే ఎలాంటి చట్టమైనా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉండొద్దని, రాజ్యంగ మౌలిక స్వరూప–స్వభావాల్ని మార్చకూడదని  ‘కేశ వానంద భారతి– కేరళ ప్రభుత్వం’ కేసులో 13 మంది న్యాయమూర్తుల ధర్మాసనం తీర్పిచ్చింది. ఇక్కడ రిజర్వేషన్ల ప్రాతిపదిక సామాజిక వర్గాల వారిగా కాకుండా ఆర్థిక స్థితిగతుల ప్రాతిపదికన చేయడం రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చడమేనని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. పాలక పక్షం దీన్ని ఖండిస్తోంది. ‘‘ప్రజలందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ పరంగా సమాన అవకాశాలు కల్పించాలి’’ అన్నది రాజ్యాంగ పీఠికలోనే ఉందని, తామదే చేస్తున్నామని ప్రభుత్వ వాదన.

మళ్లీ తెరపైకి క్రీమీ లేయర్‌?
అగ్రవర్ణ పేదల రిజర్వేషన్‌ లబ్దిదారుల ఎంపికకు నిర్ణయించిన సంపద పరిమితులే విస్మయం కలిగిస్తున్నాయి. ఇది కొత్త వివాదానికి దారి తీసే అవకాశముంది. అయిదెకరాలకు పైబడి భూమి, 8 లక్షలకు మించి వార్షికా దాయం, నగరాల్లో 1000 చదరపు అడుగులకు మించి నివాసస్థలం ఉన్న వారు అర్హులు కారనే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. అంటే, ఆయా పరిమితులకు లోబడి సంపద కలిగిన వారంతా ఈ 10 శాతం రిజర్వేషన్లకు అర్హులే! ఇంత ఉదారంగా సంపద పరిమితిని విధించి, ‘ఆర్థి కంగా వెనుకబడినవారి’గా అగ్రవర్ణాల్లోని అత్యధికుల్ని (80–90 శాతం) ప్రసన్నం చేసుకోవాలనే వ్యూహం కనబడుతోంది. గత కొన్ని సంవత్సరా లుగా జాట్లు, పటేళ్లు, మరాఠీలు, కాపులు తమకు ప్రత్యేక రిజర్వేషన్‌ కల్పించాలని డిమాండ్‌ చేస్తూ ఉద్యమిస్తున్నారు.

బీజేపీకి గట్టి మద్దతుదారు లైన అగ్రవర్ణాలూ క్రమంగా దూరమౌతున్నాయని ఇటీవలి 3 రాష్ట్రాల ఎన్ని కల ఫలితాల విశ్లేషకులు తేల్చారు. సదరు వర్గాల్ని ప్రసన్నం చేసుకునేందుకే ఈ ఎత్తుగడ అని ప్రత్యర్థుల ఆరోపణ. ఉదారపరిమితి వల్ల కోటా మిగిలి పోవడమనే ప్రశ్నే ఉత్పన్నం కాదు. దళిత, వెనుకబడిన వర్గాలతో పోల్చి చూస్తే చాలా రాష్ట్రాల్లో అగ్రవర్ణాల జనాభా తక్కువ. మొన్నటి సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం తెలంగాణాలో వీరి జనాభా 9 శాతమే! ఒడిశాలో 6 శాతాన్ని మించదు. అంత తక్కువ శాతం జనాభాలోని పేదలకు 10 శాతం రిజర్వేషన్‌ కల్పించడం, సంపద పరిమితికి ఉదారమేమిటనే ప్రశ్న తలెత్తుతోంది. కొన్ని విద్యాసంస్థల్లో దళిత, ఓబీసీ రిజర్వు సీట్లు నిండటం లేదు.

ఒక వైపు ఏడున్నర ఎకరాల పొలం, నెలకు 65 వేల రూపాయల జీతం, నగరంలో 1000చ.అ లవిస్తీర్ణపు ఇల్లూ ఉన్న అగ్రవర్ణపు వారికి రిజ ర్వేషన్‌తో సర్కారు కొలువు ఖాయమై, అక్కడే ఒక దళితుడికో, బీసీకో కోటా నిండి ఉద్యోగం దొరక్కపోతే ఆర్థిక సమానత్వం సాధ్యమా అన్న ప్రశ్న తలెత్త వచ్చు! జనాభా ప్రాతిపదిక (దామాషా పద్దతి)న రిజర్వేషన్ల డిమాండ్‌ పెరిగే ఆస్కారముంది. దళిత, వెనుకబడిన వర్గాల్లో సంపన్నుల సంగతేమిటనే ప్రశ్న తెరపైకి వస్తుంది. ఆర్థిక స్థితిగతుల ఆధారంగా రిజర్వేషన్లు ఒక్క అగ్ర వర్ణాలకేనా? దళిత, వెనుకబడిన వర్గాల్లోనూ సంపన్న వర్గాల (క్రీమీ లేయర్‌) రిజర్వేషన్‌ను కట్టడి చేయాలనే డిమాండ్‌ తెరపైకి రావచ్చంటు న్నారు. ఎస్సీల్లో ఎ.బి.సి.డి వర్గీకరణకు ఒత్తిడి పెరిగే ఆస్కారమూ ఉంటుం దనే వాదన ఉంది. తాజా ప్రతిపాదన ఒక చర్చనైతే లేవనెత్తింది. పర్యవసానాలు వేచి చూడాల్సిందే!

 ఈ–మెయిల్‌ : dileepreddy@sakshi.com

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top